ఆర్పీఈ కోర్సును తీసుకొచ్చిన యూజీసీ
30 గంటల పాటు క్లాసులు.. అన్ని యూనివర్సిటీలకూ యూజీసీ సర్క్యులర్
కాపీ థీసిస్, అనైతిక ప్రాక్టీస్‌లకు చెక్ పెట్టేందుకే
సిలబస్ కూడా ఫైనల్.. మంచి నిర్ణయమంటున్న స్టూడెంట్లు
పీహెచ్డీ చేయాలనుకునే స్టూడెంట్లకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కొత్త రూల్ పెట్టింది. ఎథిక్స్ (నైతిక విలువలు), పబ్లికేషన్ మిస్కండక్ట్ను తెలియజెప్పే కోర్సును తప్పనిసరి చేసింది. అన్ని యూనివర్సిటీలు, విద్యాసంస్థలకు గురువారం సర్క్యులర్‌నూ పంపించింది. ఎథిక్స్, పబ్లికేషన్ మిస్కండక్ట్ కోర్సులకు సంబంధించి టూ–క్రెడిట్ కోర్సు ‘రీసెర్చ్ అండ్ పబ్లికేషన్ ఎథిక్స్ (ఆర్పీఈ)’ని కచ్చితంగా స్టూడెంట్లకు చెప్పాలని ఆదేశించింది. పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకుని, సీటు పొందిన విద్యార్థులకు ముందుగానే ఈ 30 గంటల కోర్సును టీచ్ చేయాలని ఆదేశించింది. రీసెర్చ్ పేపర్ల క్వాలిటీని పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఎదుటి వాళ్ల రీసెర్చ్ థీసిస్‌ను కాపీ కొట్టకుండా, ఓ టాపిక్కు సంబంధించి రీసెర్చ్‌ను ఎలా చేయాలో ఆ కోర్సు ద్వారా స్టూడెంట్లకు బోధించాలని చెప్పింది. ‘‘దేశంలో చేస్తున్న రీసెర్చ్ క్వాలిటీ ఏం బాగుండట్లేదు. ఎదుటోళ్ల థీసిస్‌ను కాపీ కొడుతున్నారన్న ఫిర్యాదులూ వచ్చాయి. అందుకే ఈ ఆర్పీఈ కోర్సును తీసుకొచ్చాం” అని యూజీసీ సెక్రటరీ రజనీశ్ జైన్ చెప్పారు.
సిలబస్ ఏంటి?
ఆర్పీఈ కోసం ఇప్పటికే యూజీసీ సిలబస్‌ను కూడా కన్ఫర్మ్ చేసింది. ఫిలాసఫీ, ఎథిక్స్, సైంటిఫిక్ కండక్ట్లపై స్టూడెంట్లకు టీచింగ్ చేయనున్నారు. ఇంటలెక్చువల్ హానెస్టీ (మేధో నిజాయితీ) గురించి చెప్పడంతో పాటు, తప్పుడు ఆర్టికల్స్, ఉన్నవీ లేనివి కల్పించి రాయడం, కాపీ కొట్టడం వంటి వాటికి ఎలా దూరంగా ఉండాలో కోర్సులో భాగంగా స్టూడెంట్లకు చెప్పనున్నారు. డేటా వంటి ఓపెన్ రీసోర్సెస్‌ను వాడుకునే విధానం గురించి బోధిస్తారు. పబ్లికేషన్ మిస్కండక్ట్కు సంబంధించి విదేశాలు, ఇండియాలో నమోదవుతున్న ‘మోసపూరిత ఆర్టికల్స్’ ఫిర్యాదులపై ఉదాహరణలతో పాఠాలు చెబుతారు. వాటికి సంబంధించి కాపీరైట్ సమస్యలు, కాపీ కొడితే ఎదురయ్యే ఇబ్బందులను వివరిస్తారు. తుర్నితిన్ వంటి ప్లాగియారిజం టూల్స్ గురించీ స్టూడెంట్లకు చెప్తారు.
35 శాతం ఆర్టికల్స్ ఫేక్ జర్నల్స్లోనివే
ప్రస్తుతం దేశంలో రీసెర్చ్ స్టూడెంట్స్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఫేక్ జర్నల్స్ అని నిపుణులు చెబుతున్నారు. ఆ ఫేక్ జర్నల్స్‌లోని ఆర్టికల్స్‌లో కొన్ని మార్పులు చేసి కాపీ పేస్ట్ చేస్తున్నారని చెప్పింది. దాదాపు 35 శాతం అలాంటి ఆర్టికల్స్‌ను రీసెర్చ్ స్టూడెంట్లు ప్రొడ్యూస్ చేశారని తెలిపింది. అందుకే ఈ ఏడాది జులైలో యూజీసీ కమిటీ ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది. ‘కేర్’ లిస్ట్ పేరిట గుర్తింపు పొందిన జర్నల్స్‌తో ఓ జాబితాను తయారు చేసింది. ఆ జాబితాలోని జర్నల్స్‌లో పబ్లిష్ అయిన రీసెర్చ్ ఆర్టికల్స్‌నే అకడమిక్ పర్పస్ కోసం వాడుకోవాలని సూచించింది.
స్టూడెంట్లు ఏమంటున్నరు
ఈ కొత్త కోర్సుపై చాలా మంది స్టూడెంట్లు పాజిటివ్‌గానే ఉన్నారు. ‘‘యూజీసీ రూల్స్ ప్రకారం స్టూడెంట్లంతా ప్రీ పీహెచ్డీ కోర్స్ వర్క్ చేయడం తప్పనిసరి. కోర్సులో భాగంగా రీసెర్చ్‌లో నైతిక విలువలు, పబ్లికేషన్ గురించి చెప్పడమన్నది మంచి నిర్ణయం. రీసెర్చ్ కోసం ఏ సోర్స్ వాడుకోవాలో, కాపీ కొట్టకుండా ఉండడమెలాగో చాలా మందికి తెలియదు. కాబట్టి వీటన్నింటిపై అందరికీ అవగాహన అవసరం” అని పీహెచ్డీ కోసం అప్లై చేసుకున్న దీక్ష భతేజా అనే స్టూడెంట్ చెప్పింది. ఢిల్లీ యూనివర్సిటీలో పీహెచ్డీ ఫైనల్ ఇయర్ చేస్తున్న మమత త్రిపాఠీ అనే స్టూడెంట్ కూడా ఇదే చెప్పింది. తాను పీహెచ్డీ స్టార్ట్ చేసిన మొదట్లో ప్రతి విషయానికీ గైడ్ దగ్గరకు వెళ్లాల్సి వచ్చేదని, సోర్సింగ్, ఇండెక్సింగ్ వంటి వాటినీ అడిగి తెలుసుకోవాల్సి వచ్చేదని తెలిపింది. కాబట్టి స్టూడెంట్లకు ముందే వాటిపై బేసిక్స్ చెబితే రీసెర్చ్ ఈజీగా సాగుతుందని అభిప్రాయపడింది. దేశంలో కాపీ రీసెర్చ్‌లు, అనైతిక ప్రాక్టీస్‌లు ఎక్కువైపోతున్నాయని, ఈ కోర్సు పెట్టడం జేఎన్‌యూలో స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ప్రొఫెసర్ బిక్రమాదిత్య కుమార్ చౌదరి అన్నారు.
