కార్ల తయారీకి మహిళా ఉద్యోగులు.. మారుతీ సుజుకీ కొత్త రిక్రూట్మెంట్ ప్లాన్

కార్ల తయారీకి మహిళా ఉద్యోగులు.. మారుతీ సుజుకీ కొత్త రిక్రూట్మెంట్ ప్లాన్

భారతీయ ఆటోమొబైల్ రంగం దేశ జీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ.. అందులో మహిళల భాగస్వామ్యం దశాబ్దాలుగా చాలా తక్కువగానే ఉంది. ఈ అసమానతను తొలగించే దిశగా దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇప్పుడు నడుం బిగించింది. కేవలం పురుషులకే పరిమితమైన షాప్‌ఫ్లోర్ పనుల్లోకి మహిళలను రిక్రూట్ చేసుకుంటూ కొత్త ఒరవడికి నాంది పలికింది. ఈ క్రమంలో హర్యానాలోని గురుగ్రామ్, మానెసర్ ప్లాంట్లతో పాటు గుజరాత్‌లో కొత్తగా నిర్మిస్తున్న ప్లాంట్‌లో కూడా మహిళా ఉద్యోగుల సంఖ్యను భారీగా పెంచుతోంది. 

ప్రస్తుతం మారుతీ సుజుకీ షాప్‌ఫ్లోర్‌లో కేవలం 190 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. ఇది మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 10 శాతం కంటే తక్కువ. ఈ పరిస్థితిని మార్చాలని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ రాహుల్ భారతి స్పష్టం చేశారు. కేవలం ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా.. మహిళలకు అనువైన, సురక్షితమైన పని వాతావరణాన్ని సృష్టించడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. గుజరాత్‌లోని ఖోరాజ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో రూ.10వేల189 కోట్లతో నిర్మిస్తున్న కొత్త ప్లాంట్‌లో జిమ్, ఐటీఐ ప్రోగ్రామ్‌ల ద్వారా మహిళల నియామకాలను 30 శాతం పెంచాలని కంపెనీ టార్గెట్‌గా పెట్టుకుంది.

మహిళలను ఎందుకు రిక్రూట్ చేసుకుంటున్నారు?
మారుతీ సుజుకీ మహిళలను రిక్రూట్ చేసుకోవడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. మొదటిది మహిళలు క్వాలిటీ కంట్రోల్, ఇంజిన్ అసెంబ్లీ వంటి సున్నితమైన పనుల్లో అత్యంత ఏకాగ్రతతో, క్రమశిక్షణతో పనిచేస్తున్నారని కంపెనీ గుర్తించింది. రెండోది కంపెనీలో లింగ వివక్ష లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడం వల్ల సంస్థ ప్రతిష్ట పెరుగుతుంది. మూడోది ఐటీఐ కోర్సుల ద్వారా మెకానికల్, ఎలక్ట్రికల్ అంశాల్లో మహిళలకు శిక్షణ ఇచ్చి, వారిని పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం వల్ల ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని కంపెనీ భావిస్తోంది.

మహిళల రిక్రూట్మెంట్లో ప్రధానంగా భద్రత, వసతి, పరిశుభ్రత, సరైన శిక్షణ లేకపోవడం వంటి సవాళ్లు ఎదురయ్యాయి. వీటిని అధిగమించడానికి మారుతీ సుజుకీ రెండేళ్ల క్రితమే ఒక  అధ్యయనం చేపట్టింది. దాని ఆధారంగా ప్లాంట్‌లలో ప్రత్యేక రెస్ట్ రూమ్‌లు, చేంజింగ్ ఏరియాలు, పిల్లల సంరక్షణ కేంద్రం వంటి సౌకర్యాలను కల్పించింది. సాయంత్రం షిఫ్టుల్లో పనిచేసే మహిళల కోసం సెక్యూరిటీ గార్డులతో పెట్రోలింగ్, 100 శాతం ఉద్యోగులకు పోష్ శిక్షణ వంటి చర్యలు చేపట్టింది. 

ALSO READ : అమెరికా సైనిక లాజిస్టిక్స్ షిప్‌పై ఇరాన్ దాడి..

ప్రస్తుతం మారుతీ ప్లాంట్లలో మహిళలు కేవలం ఆఫీస్ పనులకే పరిమితం కాకుండా.. కె అండ్ జెడ్ సిరీస్ ఇంజిన్ అసెంబ్లీ, ట్రాన్స్‌మిషన్ అసెంబ్లీ వంటి కీలక విభాగాల్లో పనిచేస్తున్నారు.  టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ వంటి దిగ్గజాలతో పోటీపడుతూ మారుతీ సుజుకీ కూడా ఈ మహిళా విప్లవంలో వేగంగా ముందుకు సాగుతోంది.