రోజురోజుకూ పుంజుకుంటున్న ఇరాన్ అమెరికా యుద్ధం కొత్త కొత్త మలుపులు తిరుగుతోంది. ఏదో బాంబులు వేశాం అంటే వేశాం అన్నట్లు కాకుండా చాలా క్యాలిక్యులేటెడ్ గా ఇరాన్ తన దాడులను కొనసాగిస్తోంది. మెున్నటికి మెున్న అమెరికాకు చెందిన యుద్ధనౌక అబ్రహం లింకన్ పై దాడి చేసిన ఇరాన్ అదే స్పీడ్ కొనసాగిస్తోంది.
తాజాగా గల్ఫ్ లోని ఒమన్ తీరానికి సమీపంలో అమెరికా సైన్యానికి చెందిన ఒక భారీ లాజిస్టిక్స్ నౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ విరుచుకుపడింది. ఒమన్లోని సలాలా నౌకాశ్రయానికి కొంత దూరంలో.. అమెరికా సైన్యానికి సపోర్ట్ గా వెళ్తున్న లాజిస్టిక్స్ నౌకను ఇరాన్ సాయుధ దళాలు విజయవంతంగా లక్ష్యం చేసుకున్నాయని ఇరాన్ సెంట్రల్ మిలిటరీ కమాండ్ ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫాఘరి అధికారికంగా ప్రకటించారు. శనివారం జరిగిన ఈ దాడితో అమెరికా-ఇరాన్ మధ్య ప్రత్యక్ష యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు.
ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ నుంచి బయటకు వచ్చిన ఈ ప్రకటన అంతర్జాతీయంగా యుద్ధంపై భయాన్ని మరింతగా పెంచేస్తోంది. అమెరికా సైన్యానికి అవసరమైన యుద్ధ సామగ్రిని, ఇంధనాన్ని సరఫరా చేసే ఈ లాజిస్టిక్స్ నౌకను దెబ్బతీయడం ద్వారా అమెరికాను యుద్ధ భూమిలో అస్తవ్యస్తం చేయడమే ఇరాన్ వ్యూహంగా కనిపిస్తోంది. ఇప్పటికే చాలా అమెరికా బేస్ లు ఇరాన్ దాడుల్లో ధ్వంసం కావటంతో ఆ సైనికులను యూఎస్ హోటళ్లకు మార్చిన వేళ శత్రువుపై మరింత కసిగా ఇరాన్ ముందుకు సాగుతోందని తాజా ఎటాక్ నిరూపిస్తోంది.
ALSO READ : బంగారం అమ్మటం మొదలుపెట్టిన రష్యా
అబ్రహం లింకన్ నౌకపై దాడి తర్వాత ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు సరే కదా.. మరింత దూకుడుగా వ్యవహరించటం అమెరికా, ఇజ్రాయెల్ లెక్కలను తారుమారు చేస్తోందని నిపుణులు అంటున్నారు. సముద్ర మార్గాల్లో అమెరికా ఆధిపత్యానికి సవాల్ విసురుతూ.. వ్యూహాత్మక ప్రాంతాల్లో దాడులకు తెగబడుతోంది ఇరాన్. ఈ తాజా దాడితో పర్షియన్ గల్ఫ్, హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో వాణిజ్య నౌకల రాకపోకలపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో అమెరికా ఈ దాడులకు ఎలాంటి ప్రతిదాడి చేస్తుందోననే భయాలు పెరిగిపోతున్నాయి.
