హైవే ప్రయాణికులకు అలర్ట్..ఏప్రిల్ 1, 2026 నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలు పెరగనున్నాయి. ప్రస్తుతమున్న యాన్యువల్ పాస్ ధర 2.5% పెరిగి రూ. 3వేలనుంచి రూ. 3వేల075కు పెరగనుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఈ కొత్త టోల్ రేట్లు వర్తిస్తాయి. ఇది 200 టోల్ క్రాసింగ్‌లకు లేదా ఏడాది కాలపరిమితికి వర్తిస్తుంది.
ఈ యాన్యువల్ పాస్ నిబంధనలలో కూడా కొన్ని కీలక మార్పులు చేశారు.3వేల 075 రూపాయలు చెల్లించి తీసుకునే ఈ పాస్.. ఒక ఏడాది పాటు లేదంటే గరిష్టంగా 200 సార్లు టోల్ గేట్లను దాటడానికి మాత్రమే అనుమతిస్తుంది. ఈ రెండింటిలో ఏది ముందు పూర్తయితే అది వర్తిస్తుంది. అంటే ఒకవేళ వాహనదారుడు ఏడాది పూర్తికాకముందే 200 సార్లు టోల్ ప్లాజాలను దాటేస్తే.. ఆ పాస్ గడువు ముగిసినట్లే. అప్పుడు మళ్లీ కొత్త పాస్ కొనుక్కోవాల్సిందే. టోల్ రుసుములను ప్రతి ఏటా సమీక్షించడం సహజమని.. అందులో భాగంగానే ఈ స్వల్ప పెంపును చేసినట్లు మోడీ ప్రభుత్వం పేర్కొంది.
NHAI ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ ప్లాజాలకు, సంబంధిత అధికారులకు ఈ మార్పులపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి పెంచిన ధరలను వసూలు చేయాలని, ఈ సమాచారాన్ని ప్రయాణికులకు ముందుగానే తెలియజేయాలని సూచించింది. హైవేలపై నిరంతరం ప్రయాణించే వారికి వార్షిక పాస్లు కొంత ఉపశమనాన్ని ఇస్తాయి. అయితే తాజా ధరల పెంపుతో సామాన్య వాహనదారులపై అదనపు భారం పడనుంది.
►ALSO READ | మైనింగ్పై అసెంబ్లీలో హాట్ హాట్ డిస్కషన్.. పొంగులేటి రాజీనామా చేయాలన్న హరీష్
గత ఏడాది ఆగస్టు 15న ప్రారంభించబడిన వార్షిక పాస్ వాహనదారుల నుంచి విశేష స్పందనను పొందిన సంగతి తెలిసిందే. పట్టుమని ఏడాది కూడా కాకమునుపే రేట్ల వడ్డింపును కేంద్రం ప్రకటించటంపై చాలా మంది నిరాశ వ్యక్తం చేస్తున్నారు. దీంతో దాదాపు అర కోటికి పైగా వాహనదారులపై ఆర్థిక ప్రభావం పడనుందని తెలుస్తోంది. పాస్ ధరలను 2.5 శాతం పెంచటం చూడటానికి చిన్నగానే కనిపిస్తున్నప్పటికీ తమపై అన్ని విధాలా భారం పెరుగుతోందని వాహన యజమానులు పెరుగుతున్న ఖర్చులపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
