కరెంట్ కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ టాప్

కరెంట్ కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ టాప్
  • టూ వీలర్‌‌, త్రీ వీలర్‌‌, కార్ల సెగ్మెంట్లలో పెరిగిన ఈవీ సేల్స్‌
  • కొనసాగుతున్న టూవీలర్ల హవా.. కార్ల సెగ్మెంట్‌లో టాటా మోటార్స్ టాప్‌

న్యూఢిల్లీ: 2021–22 ఆర్థిక సంవత్సరంలో  ఎలక్ట్రిక్‌‌‌‌ వెహికల్స్ (ఈవీ) సేల్స్ బాగా పెరిగాయి. టూవీలర్లు, త్రీవీలర్లు, కార్లు, కమర్షియల్ వెహికల్స్‌‌ సెగ్మెంట్‌‌లలో కరెంట్‌‌ బండ్ల అమ్మకాలు పుంజుకున్నాయని ఫెడరేషన్ ఆఫ్‌‌ ఆటోమొబైల్‌‌ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) ప్రకటించింది. ఈ సంస్థ విడుదల చేసిన డేటా ప్రకారం, కిందటి ఆర్థిక సంవత్సరంలో మొత్తం 4,29,217  ఎలక్ట్రిక్‌‌ బండ్లు అమ్ముడయ్యాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో సేల్ అయిన 1,34,821 యూనిట్లతో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ కావడం విశేషం. 2019–20 లో 1,68,300 కరెంట్ బండ్లు అమ్ముడయ్యాయి. కాగా, దేశంలోని 1,397 రీజినల్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్‌‌ ఆఫీస్‌‌ల నుంచి  డేటాను సేకరించి రిటైల్ సేల్స్ వివరాలను  ఫాడా విడుదల చేస్తుంటుంది. 

కార్లలో టాటా మోటార్స్‌‌..

ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్‌‌ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 2021–22లో మొత్తం 17,802  ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడు కాగా, ఇందులో టాటా మోటార్స్ అమ్మిన బండ్లే 15,198 యూనిట్లు ఉన్నాయి. ప్రస్తుతం దేశ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌‌లో టాటా మోటార్స్ వాటా 85.37 శాతంగా ఉందని ఫాడా వివరించింది. 2020–21లో 3,523 ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌ను ఈ కంపెనీ అమ్మింది. కిందటి ఆర్థిక సంవత్సరంలో 2,045 ఎలక్ట్రిక్ కార్లను ఎంజీ మోటార్స్‌‌ అమ్మగా, అంతకు ముందు ఆర్థిక  సంవత్సరంలో 1,115 వెహికల్స్‌‌ను సేల్ చేసింది. ఎలక్ట్రిక్‌‌ కార్ల సెగ్మెంట్‌‌లో 11.49 శాతం మార్కెట్ వాటాతో  ఎంజీ మోటార్స్​ రెండో ప్లేస్‌‌లో కొనసాగుతోంది. మహీంద్రా అండ్ మహీంద్రా 156   యూనిట్లను, హ్యుండయ్ 128 యూనిట్లను  2021–22లో సేల్ చేశాయి. వీటి మార్కెట్ వాటా ఒక శాతం కంటే తక్కువగా ఉందని ఫాడా పేర్కొంది.  అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీలు వరసగా 94 ఈవీలను, 184 ఈవీలను  అమ్మాయి. 

ఈ‑టూవీలర్లలో హీరో..

ఈవీ సెక్టార్‌‌‌‌‌‌లో టూవీలర్ల  హవా కొనసాగుతోంది.  కిందటి ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2,31,338 ఎలక్ట్రిక్ టూవీలర్లు సేల్ అయ్యాయి.  2020–21 లో అమ్ముడయిన 41,046 యూనిట్లతో పోలిస్తే  ఇది ఐదు రెట్లు ఎక్కువ. టూ వీలర్ సెగ్మెంట్‌‌లో 28.23 శాతం మార్కెట్‌‌ వాటాతో హీరో ఎలక్ట్రిక్ మార్కెట్‌ లీడర్‌‌‌‌గా కొనసాగుతోంది. కిందటి ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ 65,303 ఈవీలను అమ్మింది.  హీరో ఎలక్ట్రిక్ తర్వాత ప్లేస్‌‌లో ఒకినావా ఆటోటెక్ ఉంది. ఈ కంపెనీ 46,447 బండ్లను అమ్మింది. 24,648 యూనిట్ల సేల్స్‌‌తో థర్డ్‌‌ ప్లేస్‌‌లో ఆంపియర్‌‌‌‌ , 19,971 యూనిట్ల సేల్స్‌‌తో ఫోర్త్‌‌ ప్లేస్‌‌లో ఎథర్ ఎనర్జీ ఉన్నాయి. కాగా, ఎథర్ ఎనర్జీలోకి హీరో మోటో కార్ప్‌‌కు వాటాలు ఉన్న విషయం తెలిసిందే. ఓలా ఎలక్ట్రిక్ కిందటి ఆర్థిక సంవత్సరంలో 14,371 యూనిట్లను అమ్మగలిగింది. టీవీఎస్‌‌ మోటార్ 9,458 యూనిట్లను సేల్ చేసింది. ఈ రెండు కంపెనీలు ఎలక్ట్రిక్ టూవీలర్ సెగ్మెంట్‌‌లో వరసగా ఆరు, ఏడు ప్లేస్‌‌లలో ఉన్నాయి. 2021–22 లో   1,77,874 ఎలక్ట్రిక్ తీ వీలర్లు సేల్ అయ్యాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఈ నెంబర్‌‌‌‌ 88,391 యూనిట్లుగా ఉంది.  ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్ సేల్స్  కూడా పెరిగాయి. 2020–21 లో  400 ఎలక్ట్రిక్‌‌ కమర్షియల్ వెహికల్స్ అమ్ముడు కాగా, 2021–22 లో ఈ నెంబర్  2,203 యూనిట్లకు పెరిగింది.