ప్రభుత్వ దవాఖాన్లలో ప్రారంభమైన ఈవినింగ్ ఓపీ సేవలు

ప్రభుత్వ దవాఖాన్లలో ప్రారంభమైన ఈవినింగ్ ఓపీ సేవలు
  • తొలిరోజు పదుల సంఖ్యలో పేషెంట్లు 
  • నల్లబ్యాడ్జీలు ధరించి పనిచేసిన డాక్టర్లు

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్లలో ఈవినింగ్ ఓపీ సేవలు సోమవారం ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌‌లోని ఉస్మానియా, గాంధీ, నిలోఫర్‌‌‌‌, వరంగల్ ఎంజీఎం సహా జిల్లాల్లోని టీచింగ్ హాస్పిటళ్లలో సాయంత్రం కూడా డాక్టర్లు అందుబాటులో ఉండి ఓపీ విధులు నిర్వర్తించారు. తొలి రోజు జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్‌‌, ఆర్థోపెడిక్స్ విభాగాలతో ఓపీ సేవలు షురూ చేశారు. వరంగల్ ఎంజీఎంలో ఈవినింగ్‌‌ ఓపీకి అత్యధికంగా 117 మంది పేషెంట్లు వచ్చారు. మిగిలిన దవాఖాన్లలో వంద లోపే రోగులు వచ్చారని అధికారులు తెలిపారు. ఈవినింగ్‌‌ ఓపీలో డాక్టర్లు రాసిన టెస్టులు చేసేందుకు అనుగుణంగా ల్యాబ్​లను సాయంత్రమే నడిపిస్తున్నామని తెలిపారు. ఈవినింగ్ ఓపీ సేవలను వినియోగించుకోవాలని ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్‌‌ డాక్టర్ నాగేందర్ విజ్ఞప్తి చేశారు.

ఈవినింగ్‌‌ ఓపీకి వ్యతిరేకం కాదు

టీచింగ్ డాక్టర్స్‌‌ అసోసియేషన్ పిలుపు మేరకు సోమ వారం నల్లబ్యాడ్జీలతో డాక్టర్లు విధులకు హాజరయ్యారు. తమ సమస్యలను పరిష్కరించాలని హాస్పిటళ్ల ఎదుట నిరసన తెలిపారు. సోమవారం సాయంత్రం ఐదు డిమాండ్లతో కూడిన ప్రకటనను అసోసియేషన్‌‌ విడుదల చేసింది. డీఎంఈ పోస్టు క్రియేట్ చేయడం, 56 నెలల  పీఆర్సీ బకాయిలు చెల్లించడం, కెరీర్ అడ్వాన్స్‌‌మెంట్ స్కీమ్ అమలు చేయడం వంటి డిమాండ్లు ఆ ప్రకటనలో ఉన్నాయి. తొలుత విడుదల చేసిన నోట్‌‌లో ఈవినింగ్ ఓపీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్ ఉన్నప్పటికీ, ఆ తర్వాత దాన్ని తొలగిస్తూ మరో నోట్ విడుదల చేశారు. దీనిపై అసోసియేషన్​ను సంప్రదించగా.. తమ నిరసన ఈవినింగ్ ఓపీకి వ్యతిరేకం కాదు అని, తమ సమస్యల పరిష్కారం కోసమేనని చెప్పారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సంప్రదిస్తే బాగుంటుందని సూచించారు.