అయోధ్య రామ్‌లల్లాను దర్శించుకోనున్న రాష్ట్రపతి ముర్ము

అయోధ్య రామ్‌లల్లాను దర్శించుకోనున్న రాష్ట్రపతి ముర్ము

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం(మే 01) అయోధ్యలోని రామ్‌లల్లాను దర్శించుకోనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. అలాగే, హనుమాన్‌ గర్హి ఆలయంలో హనుమంతుడిని దర్శించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆ తర్వాత సరయూ పూజ, హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. 

ముర్ము తొలిసారిగా రామమందిరాన్ని సందర్శించనున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు ఆమె ఆయోధ్యకు చేరుకోనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అయోధ్య పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్రపతి పూజా కార్యక్రమాల వల్ల సాధారణ భక్తులకు ఎలాంటి ఆటంకం ఉండదని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే దర్శనానికి టికెట్‌లు బుక్‌ చేసుకున్న భక్తులు తమ కేటాయించిన టైమ్‌లో దర్శనం చేసుకోవచ్చని తెలిపారు.

శ్రీ రామ జన్మభూమి మందిరాన్ని సాంప్రదాయ నగర శైలిలో నిర్మించచారు. దీని పొడవు 380 అడుగులు కాగా, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు. దీనికి 392 స్తంభాలు, 44 తలుపులు మద్దతుగా ఉన్నాయి. స్తంభాలు, గోడలపై దేవతల శిల్పాలను చెక్కారు. గ్రౌండ్ ఫ్లోర్‌లోని ప్రధాన గర్భగుడిలో శ్రీరాముని బాల్య రూపాన్ని ఉంచారు. ఇదిలా ఉండగా, జనవరి 23న సామాన్య ప్రజల కోసం తెరిచిన ఆలయంలో ప్రార్థనలు చేసేందుకు లక్షలాది మంది భక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు.