కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ గోట్ టూర్ ఈవెంట్ సందర్భంగా జరిగిన గందరగోళానికి నైతిక బాధ్యత వహిస్తూ పశ్చిమ బెంగాల్ క్రీడా మంత్రి అరూప్ బిశ్వాస్ మంగళవారం (డిసెంబర్ 16) తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను సీఎం మమతా బెనర్జీకి పంపారు. ఈ ఘటనపై స్వేచ్ఛగా, న్యాయంగా దర్యాప్తు జరిగేలా తాను రాజీనామా చేస్తున్నట్లు లేఖలో తెలిపారు.
గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా శనివారం (డిసెంబర్ 13) కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియానికి మెస్సీ వెళ్లారు. ఈ గ్రౌండ్లో మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో తమ అభిమాన ప్లేయర్ ఆటను కళ్లారా చూసేందుకు వేలకు వేలు పెట్టి టికెట్ కొని స్టేడియానికి తరలివచ్చారు ప్రేక్షకులు. కానీ మెస్సీ మ్యాచ్ ఆడకపోవడంతో అభిమానుల ఆశలు అడియాశలు అయ్యాయి. అంతేకాకుండా స్టేడియంలో మెస్సీ పట్టుమని పది నిమిషాలు కూడా ఉండలేదు. దీంతో మెస్సీ మ్యాచ్ ఆడతాడని ఆశించి వేలకు వేలు పెట్టి టికెట్లు కొన్న అభిమానుల కోపం కట్టలు తెంచుకుంది.
12 వేలు పెట్టి టికెట్ కొంటే ఇలా ఉసూరుమనిపించడం దారుణమని గోట్ ఫ్యాన్స్ కోపంతో రగిలిపోయారు. ఈ క్రమంలోనే స్టేడియంలో సీట్లు ధ్వంసం చేశారు. కుర్చీలు విరగ్గొట్టారు. స్టేడియంలోకి వాటర్ బాటిళ్లు విసిరేసి అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. కొందరు ఫ్యాన్స్ బారికేడ్లు దాటుకొని లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంగ ప్రవేశ చేసి అభిమానులను చెదరగొట్టారు.
ఫ్యాన్స్ ఆవేశంగా ఉండటంతో మెస్సీ టీమ్ సొరంగం ద్వారా బయటకు వెళ్లిపోయారు. మెస్సీ ఈవెంట్లో గందరగోళం నెలకొనడంతో మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రపంచ దేశాల ముందు బెంగాల్‌తో పాటు యావత్ దేశం పరువు తీశారంటూ మమతా సర్కార్‌పై విమర్శలు వర్షం కురిపించింది. మెస్సీ ఈవెంట్ అట్టర్ ఫ్లాఫ్ కావడంతో ప్రేక్షకులకు మమతా బెనర్జీ బహిరంగా క్షమాపణలు చెప్పారు. ఈ ఘటనపై ఆమె ప్రత్యేక విచారణకు ఆదేశించారు.
