- సౌదీలోని అతిపెద్ద రిఫైనరీ అరామ్‌కోపై
- ఇరాన్ డ్రోన్ దాడి.. చమురు ఉత్పత్తిపై ఎఫెక్ట్
- కువైట్ ఆర్మీ పొరపాటుతో కూలిన 3 అమెరికా జెట్‌ఫైటర్స్
- దుబాయ్, దోహాలో పేలుళ్లు.. బహ్రెయిన్‌లోని సల్మాన్ పోర్ట్‌పైనా దాడి
- గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో చమురు నౌకపై అటాక్.. ఇండియన్ మృతి
- గల్ఫ్‌లోని యూఎస్ ఎయిర్ బేస్‌లే లక్ష్యంగా ఇరాన్ భీకర దాడులు
- అమెరికాతో చర్చల ప్రసక్తే లేదని వెల్లడి
- ఇరాన్‌లోని అణు కేంద్రాలపై అమెరికా-ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్!
- లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు..
- మూడు రోజుల్లో ఇరాన్‌లో 555 మంది మృతి
- ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా, ఇజ్రాయెల్ ఆపరేషన్
- కువైట్‌లోని యూఎస్ ఎంబసీపై అటాక్..ముగ్గురు అమెరికా సైనికులు మృతి
టెహ్రాన్: ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా జాయింట్ ఆపరేషన్‌తో పశ్చిమాసియా అట్టుడుకుతున్నది. తొలిదాడిలోనే ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీసహా కీలక నేతలను మట్టుబెట్టగా.. తాజాగా ఇరాన్‌లోని అణు కేంద్రాలపై ఎయిర్ స్ట్రైక్స్ చేశాయి. లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి చేయగా.. కీలక నేత మృతి చెందారు. మరోవైపు తమ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఇరాన్ దాడులు తీవ్రతరం చేసింది. దీంతో మిడిల్ ఈస్ట్‌లో మినీ వరల్డ్ వార్ జరుగుతున్నది. దాడులు ప్రతి దాడులతో సోమవారం మూడోరోజు పశ్చిమాసియాలో హైటెన్షన్ నెలకొన్నది. కువైట్‌లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్, మిసైల్స్‌తో దాడికి పాల్పడింది.
ఈ ప్రాంతంలో దట్టంగా పొగ అలముకున్నది. బాంబు పేలుళ్లు, అంబులెన్స్‌లు, ఫైర్ ఇంజిన్ల సైరన్లతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. అలాగే, సౌదీ అరేబియాలోని అతిపెద్ద రిఫైనరీ అయిన అరామ్‌కోపై ఇరాన్ షాహెద్-136 డ్రోన్‌తో అటాక్ చేసింది.. దీంతో ఆ కేంద్రం వద్ద భారీగా మంటలు చెలరేగి.. చమురు ఉత్పత్తిపై ఎఫెక్ట్ పడింది. కువైట్‌లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్లు, మిసైల్స్‌తో విరుచుకుపడింది. ఆ దేశంలో 3 అమెరికా జెట్‌ఫైటర్స్ నేలకూలాయి. -బహ్రెయిన్‌లోని సల్మాన్ పోర్ట్‌పైనా ఇరాన్ దాడి చేసింది. దుబాయ్, దోహాలోనూ భారీ పేలుళ్లకు పాల్పడింది. గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో చమురు నౌకపై అటాక్ చేయగా.. ఓ ఇండియన్ మృతి చెందారు.
అమెరికా ఎయిర్ బేస్‌లే లక్ష్యంగా గంట గంటకూ బాంబుల మోతలు మోగిస్తున్నది. ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం, ఎయిర్‌ఫోర్స్ కమాండర్ హెడ్‌క్వార్టర్స్‌ను లక్ష్యంగా చేసుకొని దాడి చేసినట్టు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ ప్రకటించింది. ఆ సమయంలో కార్యాలయంలో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఉన్నారా? లేదా? అనే విషయంపై సందిగ్ఘం నెలకొన్నది. ఇదిలా ఉండగా.. యుద్ధం మరో 4 నుంచి 5 వారాలపాటు జరగొచ్చని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. తమ సైనికుల మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. మరోవైపు అమెరికాతో చర్చల ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చిచెప్పింది.
ఆరామ్కో రిఫైనరీపై డ్రోన్ దాడి..
సౌదీ అరేబియాలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాల్లో ఒకటైన అరామ్‌కోపై ఇరాన్ దాడి చేసింది. రాస్ తనురాలో ఉన్న ఈ రిఫైనరీపై ఇరాన్ షాహెద్-136 డ్రోన్‌తో విరుచుకుపడ్డట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతో ఆ రిఫైనరీలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ఈ చమురు శుద్ధి కేంద్రాన్ని టెంపరరీగా నిలిపివేశారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని సమాచారం.
ఈ ఘటనలో ఇప్పటివరకు ఆస్తి, ప్రాణనష్టం వివరాలు తెలియరాలేదు. ఈ దాడి ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు బ్యారెల్‌కు 80 డాలర్లకు చేరుకున్నాయి. మరోవైపు తాము రెండు డ్రోన్లను కూల్చివేసినట్లు సౌదీ రక్షణ శాఖ వెల్లడించింది. తమ భూభాగాన్ని ఇరాన్‌పై దాడులకు ఉపయోగించనివ్వబోమని స్పష్టం చేసినప్పటికీ, ఆ దేశం దాడులు చేయడంపై సౌదీ తీవ్రంగా మండిపడింది.
అమెరికాతో చర్చల ప్రసక్తే లేదు: ఇరాన్
యుద్ధం ఆపేందుకు మధ్యవర్తులతో ఇరాన్ సంప్రదింపులు జరుపుతున్నదంటూ వస్తున్న వార్తలను ఆ దేశం ఖండించింది. ఈ మేరకు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లరిజానీ ‘ఎక్స్’ వేదికగా స్పష్టత ఇచ్చారు. యుద్ధం విషయంలో అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదన్నారు. ఈ దాడులను తాము మొదలుపెట్టలేదని, ట్రంప్ తన తప్పుడు ఆకాంక్షలతో ఈ ప్రాంతాన్ని సంక్షోభంలోకి నెట్టేశారని మండిపడ్డారు. ఇజ్రాయెల్ అధికార కాంక్ష కోసం అమెరికా సైనికులను బలి చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
రణరంగంగా మారిన గల్ఫ్..
యూఎస్ ఎయిర్ బేస్‌లే లక్ష్యంగా ఇరాన్ దాడులకు దిగడంతో గల్ఫ్ దేశాలన్నీ రణరంగంగా మారాయి. బహ్రెయిన్ రాజధాని మనామాతో పాటు దుబాయ్, దోహా, అబుదాబిలోని పలు ప్రాంతాల్లో ఇరాన్ అటాక్ చేసింది. దీంతో సోమవారం ఉదయం పేలుళ్ల శబ్దాలు వినిపించాయని స్థానికులు ఇంటర్నేషనల్ మీడియాకు వెల్లడించారు. యుద్ధ ప్రభావంతో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ విమానాశ్రయాన్ని గంటల తరబడి మూసివేశారు. అక్కడ ఒక విలాసవంతమైన హోటల్‌పై క్షిపణి దాడి జరిగింది.
ఇరాక్‌లోని ఎయిర్‌పోర్టు సమీపంలో రెండు డ్రోన్లను ఆ దేశ గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చేశాయి. బాగ్దాద్ విమానాశ్రయం, ఇర్బిల్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ అనుకూల మిలిషియా గ్రూప్ డ్రోన్ దాడులు చేసింది. సైప్రస్‌లోని బ్రిటన్ నౌకాదళ స్థావరంపై డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో స్వల్ప నష్టం జరిగిందని ఆ ప్రభుత్వం వెల్లడించింది. ఇక, ఇజ్రాయెల్‌లో సైరన్ల మోత మోగింది. ఇరాన్ నుంచి వచ్చే క్షిపణులను తమ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుంటున్నదని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెల్లడించాయి.
కువైట్‌లోని యూఎస్ ఎంబసీపై దాడి..
కువైట్‌లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్, మిసైల్స్‌తో దాడి చేసింది. ఈ ప్రాంతంలో దట్టంగా పొగ అలుముకున్నది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంబులెన్స్‌లు, అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకున్నట్లు ఇంటర్నేషనల్ మీడియా కథనాలు వెల్లడించాయి. అమెరికా రాయబార కార్యాలయం ఉన్న ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగలు కనిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ దాడుల్లో ముగ్గురు అమెరికా సైనికులు మృతిచెందారు.
ఈ యుద్ధ గందరగోళంలో అమెరికాకు చెందిన మూడు ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాలను కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థ పొరపాటున కూల్చివేసింది. విమానాల్లోని ఆరుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం వారు కువైట్ అధికారుల సంరక్షణలో ఉన్నారు. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం ఇప్పటికే అక్కడి తమ పౌరులకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ‘‘ఎవరూ ఎంబసీ వైపు రావద్దు.. సురక్షిత ప్రాంతాల్లోనే ఉండండి” అని ఆదేశించింది.
ఇరాన్‌లో 555 మంది మృతి రెండు రోజుల క్రితం అమెరికా, ఇజ్రాయెల్ ప్రారంభించిన దాడుల కారణంగా ఇరాన్ వ్యాప్తంగా మొత్తం 555 మంది ప్రాణాలు కోల్పోయారని ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సోమవారం ప్రకటించింది. తన టెలిగ్రామ్ చానల్‌లో వివరాలను ప్రకటించింది. ‘‘మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన అమెరికా దాడుల్లో ఇప్పటివరకూ 131 నగరాలు ప్రభావితమయ్యాయి. ఈ దాడుల్లో మన దేశానికి చెందిన 555 మంది పౌరులు మరణించారు” అని వెల్లడించింది. దేశవ్యాప్తంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఇరాన్ అంతటా భయాందోళనలు నెలకొన్నాయని పేర్కొన్నది.
