అమెజాన్ కంపెనీ వాషింగ్టన్లో మరోసారి ఉద్యోగాల కోత విధించింది. అలాగే ఈ ఉద్యోగాల కోతలు గత అక్టోబర్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రకటించిన పెద్ద ఎత్తున చేసిన 14వేల తొలగింపులకు సంబంధం లేదని కంపెనీ తెలిపింది. అయితే అమెజాన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన కొత్త నోటీసు ప్రకారం 84 మంది ఉద్యోగులను తొలగించనుంది.
కంపెనీ వ్యాపార నిర్మాణాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటుందని, ఇదొక సాధారణ ప్రక్రియ అని అమెజాన్ ప్రతినిధి తెలిపారు. భారీ తొలగింపులతో వీటికి సంబంధం లేదని కూడా స్పష్టం చేసారు. ఈ తొలగింపులు వచ్చే ఏడాదిలో ఫిబ్రవరి 2 నుండి ఫిబ్రవరి 23 మధ్య జరగనున్నాయి. అయితే సియాటెల్, బెల్లేవ్ ఆఫీస్, వాషింగ్టన్‌లో ఉన్న రిమోట్ ఉద్యోగులపై ఈ కోత ప్రభావం ఉంటుంది.
తొలగింపుల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, ప్రోగ్రామ్ మేనేజర్లు, రిక్రూటర్లు, హెచ్‌ఆర్ నిపుణులు, యుఎక్స్ డిజైనర్లు వంటి ఉద్యోగులు ఇందులో ఉండగా.... వీరిలో ఎంట్రీ-లెవల్ నుండి డైరెక్టర్ల స్థాయి వరకు ఉన్నారు. తొలగించనున్న ఉద్యోగులకు 90 రోజుల పూర్తి జీతం, ప్రయోజనాలు, ఆరోగ్య బీమా, కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి సేవలు అందిస్తున్నట్లు అమెజాన్ తెలిపింది.
వాషింగ్టన్ రాష్ట్రంలో 'వార్న్ చట్టం' అనే కొత్త చట్టం ఉంది. దాని ప్రకారం తొలగింపులు ఉంటే కంపెనీలు 90 రోజుల ముందే నోటీసు ఇవ్వాలి. అందుకే అమెజాన్ ఈ నోటీసు ఇచ్చింది. ఉద్యోగులకు కనీసం 89 రోజుల ముందుగానే సమాచారం ఇచ్చామని కంపెనీ పేర్కొంది.
గత నెల అక్టోబర్‌లో అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా 14వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అందులో భాగంగా వాషింగ్టన్లో మాత్రమే 2,303 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలిపింది.
కంపెనీని క్రమబద్ధంగా మార్చడానికి సీఈఓ ఆండీ జాస్సీ ఈ కోతలను ప్రకటించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం పెరిగితే, ముఖ్యంగా చిన్న చిన్న పనులు ఆటోమేటిక్ అయితే, మరిన్ని ఉద్యోగాల కోతలు ఉండొచ్చని ఆయన గతంలో చెప్పారు. 2026 వరకు కోతలు కొనసాగే అవకాశం ఉందని కంపెనీ గతంలో సూచించింది.
