మూడో కాన్పులో ఆడ బిడ్డ.. ఫీల్ అయిన ఫ్యామిలీ.. లేడీ డాక్టర్పై నెటిజన్లు గరంగరం !

మూడో కాన్పులో ఆడ బిడ్డ.. ఫీల్ అయిన ఫ్యామిలీ.. లేడీ డాక్టర్పై నెటిజన్లు గరంగరం !

ఆడపిల్లలు పుడితే అదృష్టంగా భావిస్తున్న ఈరోజుల్లో కూడా కొందరి తీరు మారడం లేదు. మూడో సారి కూడా ఆడ బిడ్డ పుట్టిందని బాధపడుతున్న ఆ కుటుంబానికి అవగాహన కల్పించాల్సిన ఒక వైద్యురాలు వాళ్లను ఓదార్చి సోషల్ మీడియాలో విమర్శల పాలైంది. ఇన్ స్టా గ్రాంలో ఈ వీడియో వైరల్ అయింది. ఈరోజుల్లో అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ఒకటేనని చెప్పాల్సిన వైద్యురాలు.. అయిపోయిందేదో అయిపోయింది.. ఇప్పుడు ఏం చేస్తాంలే.. ఊరుకోండని ఓదార్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వివక్ష పూరిత సమాజంలో ఆ ఆడబిడ్డ.. పాపం ఎలా పెరిగి పెద్దదవుతుందోనని కొందరు నెటిజన్లు ఆ పాప పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. ఆడబిడ్డ పుట్టడం శోచనీయం కాదని.. పుట్టగానే ఆమె ఎదుర్కొన్న ఈ వివక్ష శోచనీయం అని ఒక నెటిజన్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

జీవన శైలిలో వచ్చిన మార్పుల కారణంగా.. అసలు పిల్లలు పుట్టడమే కష్టతరమైన ఈరోజుల్లో పాప పుట్టినందుకు సంతోషించాల్సింది పోయి విచారం వ్యక్తం చేయడంపై నెటిజన్లు విస్మయం చెందారు. స్కానింగ్ సెంటర్లు, హాస్పిటల్స్లలో లింగ నిర్దారణ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. మగ పిల్లాడు పుడితే వారసత్వం నిలబడుతుందనే చాదస్తంతో కొందరు ఇలా మూడో కాన్పు, నాలుగో కాన్పు వరకూ ఎదురుచూస్తున్నారు. అప్పుడు కూడా ఆడ బిడ్డ పుట్టిందని తెలిసి వంశం అంతరించిపోయిందనే తరహాలో తెగ బాధపడిపోతున్నారు. 

కాని ఇలాంటి వాళ్లకు అసలు పిల్లలు లేక బిడ్డ కోసం పరితపిస్తున్న వాళ్ల బాధ అర్థం కావడం లేదు. ప్రతి నాలుగు జంటల్లో ఒక జంట ఏదో ఒక ఇన్‌ఫర్టిలిటీ సమస్యను ఎదుర్కొంటున్నది. చిలుకూరు బాలాజీ టెంపుల్‌లో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇచ్చే గరుడ ప్రసాదం స్వీకరిస్తే సంతానం కలుగుతుందని అక్కడి పూజారులు చెప్పడంతో.. ఏకంగా రెండు లక్షల మంది ప్రసాదం కోసం ఆ గుడికి వెళ్లారు. సుమారు15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. తోపులాటల మధ్యే 30 వేల మంది మహిళలకు పూజారులు ప్రసాదం అందించారు.

గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో ప్రసాదం కోసం జనాలు రాలేదు. గరుడ ప్రసాదం స్వీకరిస్తే  సంతానంలేని మహిళలకు, సంతాన భాగ్యం కలుగుతుందని పూజారులు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారు. దీంతో రాష్ట్రం నలుమూలల నుంచి సంతానలేమితో ఇబ్బంది పడుతున్న మహిళలు గుడికి పోటెత్తారు. ఇన్‌ఫర్టిలిటీ సమస్యను ఈ ఒక్క ఘటన తేటతెల్లం చేసింది. మారిన లైఫ్ స్టైల్‌‌తో ఆడ, మగ ఇద్దరిలోనూ ఇన్‌‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ పెరిగాయి. పిల్లలు పుట్టకపోవడంతో కొత్త జంటలు మానసిక వేదనను అనుభవిస్తున్నాయి.