పార్లమెంట్ ఆవరణ లో సస్పెండెడ్ ఎంపీల ఆందోళన : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

పార్లమెంట్ ఆవరణ లో సస్పెండెడ్ ఎంపీల ఆందోళన : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
  •     లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర ఎంపీల మద్దతు

న్యూఢిల్లీ, వెలుగు: ఆర్మీ మాజీ చీఫ్ నరవణె రాసిన బుక్ లోని అంశాలు ఎక్కడ బయటపడతాయో అని కేంద్రం భయపడుతున్నదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. అందుకే లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తిన ఈ అంశాలపై సమాధానం చెప్పలేక పారిపోతుందన్నారు. సస్పెండ్ అయిన 8 మంది ఎంపీలు బుధవారం ఉభయసభల ఆరంభానికి ముందు పార్లమెంట్ ఆవరణలోని మకర ద్వారం ఎదురుగా ఆందోళన చేపట్టారు. 

ఈ నిరసన కార్యక్రమంలో ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాణిక్కం ఠాగూర్, ప్రశాంత్ పడోలే, హిబి ఈడెన్, డీన్ కురియకోస్, ఎస్.వెంకటేశన్, గుర్జీత్ సింగ్ ఔజ్లా, అమరీందర్ సింగ్ రాజా వారింగ్ పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో  రాజీపడ్డార‌‌‌‌ని((పీఎం ఈజ్ కాంప్రమైజ్ డ్) ప్లకార్డులు, భారీ బ్యానర్ ను ప్రదర్శించారు. ఆర్మీ మాజీ జనరల్ మనోజ్ కుమార్ నరవణె పుస్తకంతో పాటు నరేంద్ర మోదీ ఫోటోను ఆ బ్యానర్ పై ముద్రించారు. 

ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ,  ప్రియాంక గాంధీ సహా ప్రతిపక్ష పార్టీల ఎంపీలు వారి ఆందోళనలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్డీఏ ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకొని పార్లమెంట్​లో ప్రతిపక్షం గొంతు నొక్కాలని చూస్తోందని ఆరోపించారు. ప్రతిపక్ష నేతకే మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే, దేశం కోసం ప్రశ్నిస్తే మైక్ కట్ చేస్తుంటే.. ఇక సభలు నిర్వహించుకోవడం ఎందుకని ప్రశ్నించారు.