- ఆర్మీ మాజీ చీఫ్ రాసిన బుక్‌ను చూపిన రాహుల్ గాంధీ
- ప్రధాని మోదీకి ఇద్దామని తెచ్చా, కానీ ఆయన రాలేదు
- చైనా ట్యాంకులు చొరబడితే మోదీ, రాజ్‌నాథ్ పట్టించుకోలే
- బాధ్యతను అప్పటి ఆర్మీ చీఫ్ నరవణెపైకే నెట్టారని ఫైర్
- ఈ బుక్ ఫారిన్లో పబ్లిష్ అయిందని మీడియాకు వెల్లడి
న్యూఢిల్లీ: ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణె రాసిన ‘‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం పబ్లిష్ కాలేదంటూ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పార్లమెంట్ సాక్షిగా అబద్ధం చెప్పారని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ‘‘ఈ బుక్ లేదని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. కానీ చూడండి. ఆ బుక్ విదేశాల్లో పబ్లిష్ అయింది.. ఇదిగో ఆ బుక్ ప్రింటెడ్ కాపీ..” అంటూ బుధవారం ఉదయం పార్లమెంట్ వద్ద ఆ పుస్తకాన్ని మీడియాకు చూపారు. ప్రధాని నరేంద్ర మోదీని నేరుగా కలిసి ఈ బుక్ ఇద్దామని తీసుకొచ్చానని, కానీ ఆయనకు ధైర్యం లేక లోక్ సభకు రాలేదన్నారు. “2020లో లడఖ్ లోకి చైనా యుద్ధ ట్యాంకులు ప్రవేశిస్తున్నాయని, తాము ఏం చేయాలని అప్పటి ఆర్మీ చీఫ్ నరవణె రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్‌ను సంప్రదించారు. కానీ ఆయనకు నేరుగా సమాధానం లభించలేదు. దీంతో ఆయన ప్రధాని మోదీని సంప్రదించగా.. ‘మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే.. అది చేయండి’ అని ప్రధాని చెప్పారు. మొత్తం బాధ్యతనంతా తనపైనే వేసి, ప్రభుత్వంలోని పెద్దలు తప్పించుకోవడంతో తాను పూర్తిగా ఒంటరైపోయినట్టుగా నరవణె ఆందోళన చెందినట్టుగా ఈ పుస్తకంలో రాసుకున్నారు” అని రాహుల్ చెప్పారు. ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, ప్రధాని మోదీ సర్కారు ఏమీ నిర్ణయించుకోలేక.. బాధ్యతనంతా ఆర్మీ చీఫ్‌పైనే నెట్టేసిందన్నారు. అందుకే, ఈ బుక్ లోని అంశాలపై తనను పార్లమెంట్లో మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.
ఈ బుక్ ఎలా దొరికిందంటే..
ఆర్మీ మాజీ చీఫ్ నరవణె రాసిన ‘‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం విదేశాల్లో పబ్లిష్ అయిందని రాహుల్ గాంధీ చెప్పారు. ‘ఇది విదేశాల్లో అందుబాటులో ఉంది. ఈ బుక్ విదేశాల్లో పబ్లిష్ అయిందని అనుకుంటున్నా. ఇప్పుడు నా చేతిలోని ఈ బుక్ ఎక్కడి నుంచి వచ్చిందన్నది మీరు ఊహించుకోవచ్చు’ అని ఆయన హింట్ ఇచ్చారు. కాగా, ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నరవణె రాసిన ‘‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ బుక్ 2024 ఏప్రిల్ లో విడుదల కావాల్సి ఉండగా, ఆ పుస్తకానికి రక్షణ శాఖ ఆమోదం లభించలేదు. దీంతో ఈ బుక్‌ను పెంగ్విన్ పబ్లిషర్స్ సంస్థ మన దేశంలో అధికారికంగా పబ్లిష్ చేయలేదు. దీనిపై నరవణె గతంలో స్పందిస్తూ.. తాను బుక్ రాసి పెంగ్విన్ సంస్థకు ఇచ్చానని, రక్షణ శాఖ అనుమతి పొందడం ఆ సంస్థ బాధ్యతేనని చెప్పారు.
2020లో లడఖ్‌లోకి చైనా యుద్ధ ట్యాంకులు ప్రవేశిస్తున్నాయని, తాము ఏం చేయాలని అప్పటి ఆర్మీ చీఫ్ నరవణె రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్‌ను సంప్రదించారు. కానీ ఆయనకు నేరుగా సమాధానం లభించలేదు. దీంతో ఆయన ప్రధాని మోదీని సంప్రదించగా.. ‘మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే.. అది చేయండి’ అని ప్రధాని చెప్పారు. మొత్తం బాధ్యతనంతా తనపైనే వేసి, ప్రభుత్వంలోని పెద్దలు తప్పించుకోవడంతో తాను పూర్తిగా ఒంటరైపోయినట్టుగా నరవణె ఆందోళన చెందినట్టు ఈ పుస్తకంలో రాసుకున్నారు. - రాహుల్ గాంధీ
