- ఎరువుల పంపిణీకి ప్రత్యేక మొబైల్ యాప్ తెచ్చిన వ్యవసాయశాఖ
- 20 నుంచి ప్రయోగాత్మకంగాఅమలు చేయాలని నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రైతులు యూరియాను ఇంటి నుంచే బుక్ చేసుకునేలా రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రత్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 20 నుంచి ఎరువుల మొబైల్ యాప్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించింది.
ఈ యాప్ ద్వారా రైతులు తమకు దగ్గరలోని ఎరువుల డీలర్‌తో పాటు జిల్లా పరిధిలోని డీలర్ల వద్ద ఉన్న యూరియా స్టాక్ లభ్యతను తెలుసుకోవచ్చు. రైతు తన పంటలకు అవసరమైన యూరియాను ఏ డీలర్ నుంచైనా ముందుగా బుక్ చేసుకుని కొనుగోలు చేసుకోవచ్చు. అవసరమైతే, యూరియా బుకింగ్ కోసం రైతులు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈవో) సేవలనూ ఈ యాప్ ద్వారా వినియోగించుకోవచ్చు.
యాప్ ఎలా పనిచేస్తుందంటే..
యూరియా బుక్ చేసిన అనంతరం రైతుకు ఒక బుకింగ్ ఐడీ వస్తుంది. ఆ ఐడీ ఆధారంగా రైతు ఎంపిక చేసిన డీలర్ నుంచి యూరియాను కొనుగోలు చేయవచ్చు. డీలర్, రైతు, రైతు ప్రతినిధి వద్ద ఉన్న బుకింగ్ ఐడీ, బుక్ చేసిన పరిమాణాన్ని ధృవీకరించిన తరువాతే యూరియాను విక్రయించాల్సి ఉంటుంది. బుకింగ్ సమయంలో రైతు.. సీజన్, పాస్‌బుక్ నెంబర్, తాను వేసిన పంటల రకాలు, సాగు విస్తీర్ణం యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.
ఈ వివరాల ఆధారంగా రైతుకు అవసరమైన మొత్తం యూరియాను, ఎప్పుడెప్పుడు బుక్ చేసుకోవచ్చో యాప్ స్వయంగా లెక్కిస్తుంది. పంట రకం, సాగు విస్తీర్ణాన్ని బట్టి రైతుకు అవసరమయ్యే యూరియా బస్తాలను 15 రోజుల వ్యవధితో 1 నుంచి 4 దశలలో అందచేసేలా వివరాలు కనిపిస్తాయి. రైతులకు ఏవైనా సమస్యలు ఎదురైతే పరిష్కరించేందుకు హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు యాప్ ద్వారా వ్యవసాయశాఖ అందుబాటులోకి తెచ్చింది.
యాప్‌లోని ప్రత్యేకతలు
మొబైల్ నెంబర్, ఓటీపీ ద్వారాలాగిన్ అయ్యే అవకాశం
రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని బస్తాల యూరియా అందుబాటులో ఉందో తెలుసుకోవచ్చు
జిల్లాలో అందుబాటులో ఉన్నయూరియా బస్తాల వివరాలు చూడొచ్చు
కౌలు రైతులకు ఆధార్ నెంబర్ ద్వారాబుక్ చేసుకునే వెసులుబాటు
డీలర్లు తమ లాగిన్‌లో రోజువారీ స్టాక్, అమ్మకం వివరాలు నింపే విధానం
