ప్రియాంక vs శివరాజ్ చౌహాన్..ఉపాధి హామీ పథకం మార్పు వెనక కుట్ర

ప్రియాంక vs శివరాజ్ చౌహాన్..ఉపాధి హామీ పథకం మార్పు వెనక కుట్ర

లోక్ సభ వింటర్ సెషన్ సమావేశాలు హాట్ హాట్ సాగుతున్నాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) స్థానంలో రోజ్‌గార్ ,అజీవిక మిషన్ బిల్లు, 2025 కోసం విక్షిత్ భారత్ గ్యారెంటీ బిల్లును  లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు పథకాల మార్పును తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ బిల్లుపై కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ,  అధికార పక్ష నేత , కేంద్ర మంత్రి శివారజ్  చౌహాన్ మధ్య మాటల యుద్ధం సాగింది. 

ఉపాధి హామీ పథకం లో గాంధీ పేరు తొలగించడంపై  కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధి ఫైర్ అయ్యారు. గాంధీ పేరు మార్చడంలో మోదీ సర్కార్ ఎందుకు అంత ఇంట్రస్టో చెప్పాలన్నారు. దీనివెనక కుట్ర ఉందన్నారు. ఈ పథకం పేరులో గాంధీ పేరు తీసేయడం ఆయనను అవమానించడమే అన్నారు. ఈ బిల్లుతో మార్పులు  చేసి  ఉపాధిహామీ చట్టాన్ని బలహీన పర్చే కుట్ర జరుగుతుందన్నారు ప్రియంకగాంధీ. 

పేరు మార్పుపై శ్రద్ధ పేదల అవసరాలతీర్చడంలో లేదని,ఈ బిల్లు రాజ్యాంగానికి విరుద్దమని కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ అన్నారు. చాలాకాలంగా ఎన్డీయే ప్రభుత్వం ఈ పథకానికి నిధులు తగ్గిస్తూనే వచ్చింది. ఈ బిల్లు ద్వారా ఇప్పుడు పథకంలో మార్పులు చేస్తూ  గ్రామ పంచాయతీల హక్కులను లాక్కుంటుందన్నారు. బిల్లును అన్ని కోణాల్లో పరిశీలనకోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలన్నారు ప్రియాంకగాంధీ. 

ప్రియాంక గాంధీvs శివరాజ్ చౌహాన్

ఈ బిల్లును కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రవేశపెట్టగా.. ప్రియాంక గాంధీ అనేక అభ్యంతరాలు లేవనెత్తారు.  మహాత్మాగాంధీజి పేరు మార్చి అవమానిస్తున్నారని మండిపడ్డారు. ప్రియాంక వ్యాఖ్యలపై  స్పందించిన శివరాజ్ చౌహాన్ .. ప్రభుత్వం మహాత్మా గాంధీని నమ్మడమే కాకుండా ఆయన సూత్రాలను కూడా అనుసరిస్తుందని అన్నారు. ఈ చట్టం దేశంలోని గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయడంలో సహాయపడుతుందని అని అన్నారు. మహాత్మా గాంధీ కలను మనం సాకారం చేస్తాం.. ఆయన కలలుగన్న రామరాజ్యాన్ని స్థాపిస్తామని అని కేంద్ర వ్యవసాయ మంత్రి అన్నారు శివరాజ్ చౌహాన్. 

VB-G రామ్ జి బిల్లు, 2025 లో ఏముంది?

ఈ బిల్లుద్వారా గ్రామీణ ప్రాంతాల నైపుణ్యం లేని పేదలకు  ఉపాధి కల్పించడమే లక్ష్యం.. ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏదాడి మొత్తంలో 125 రోజుల వేతన ఉపాధిని చట్టబద్దంగా కల్పించేందుకు ఈ బిల్లు హామీ ఇస్తుంది. VB-G RAM G చట్టం ప్రారంభమైన తేదీ నుంచి ఆరు నెలల్లోపు, రాష్ట్రాలు కొత్త చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా ఓ పథకాన్ని రూపొందించాల్సి ఉంటుంది. 

ఆర్థిక బాధ్యతను కేంద్రం ,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంచుకోవాల్సి ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాలు ,హిమాలయ రాష్ట్రాలకు ఇది 90:10 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్రాలు ఆర్థిక సాయం చేయాల్సి ఉంటుంది. శాసనసభ ఉన్న అన్ని ఇతర రాష్ట్రాలు ,కేంద్రపాలిత ప్రాంతాలకు 60:40 నిష్పత్తిలో ఉంటుంది. శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతాలకు మొత్తం ఖర్చును కేంద్రమే భరిస్తుంది.