డేంజర్ వెల్స్..పెద్దపల్లి జిల్లాలో గ్రామీణ రోడ్ల పక్కన ప్రమాదకరంగా బావులు

డేంజర్ వెల్స్..పెద్దపల్లి జిల్లాలో గ్రామీణ రోడ్ల పక్కన ప్రమాదకరంగా బావులు

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో రోడ్లు వెంట ఉన్న వ్యవసాయ బావులు ప్రమాదకరంగా మారాయి. రోడ్లకు పక్కనే ఎలాంటి రక్షణ గోడలు లేకుండా ఉండడంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. గ్రామీణ రోడ్లు చెరువుగట్లు, కాలువలు, వ్యవసాయ బావుల వెంటే ఉండడం వల్లే ఈ పరిస్థితి. దీంతోపాటు బావులు గట్టు మీద పిచ్చి మొక్కులు పెరగడం దగ్గరికి వెళ్తే గానీ వాహనదారులు గుర్తించలేకపోతున్నారు. మరోవైపు రోడ్డుకు ఇరువైపులా ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌బీ అధికారులు ట్రెంట్ ఏర్పాటు చేసినా అవి కనిపించడంలేదు. 

 కాలువ గట్లు, బావుల పక్క నుంచే రోడ్లు 

జూలపల్లి మండలం వెంకట్రావుపల్లి, వడ్కాపూర్​ సమీపంలోని రోడ్డు వ్యవసాయ బావుల పక్క నుంచే పోతోంది. కుమ్మరికుంట నుంచి జూలపల్లి వెళ్లే రోడ్డు కొంత దూరం కాలువ గట్టు మీద నుంచే వెళ్తుంది. సుల్తానాబాద్​ నుంచి గట్టెపల్లి వెళ్లే దారిలో ఉన్న వ్యవసాయ బావిని నిర్లక్ష్యంగా వదిలేశారు. పెద్దపల్లి మున్సిపల్​పరిధిలోని బంధంపల్లి సమీపంలో ఒక బావి, మంధంపల్లి నుంచి గొల్లపల్లి వెళ్లే దారిలో మరో బావి రోడ్డు పక్కనే ఉన్నాయి.  

ముత్తారం మండలం మచ్చుపేట శివారు నుంచి దారి పొడవునా లెక్కలేనన్ని వ్యవసాయ బావులు ఉన్నా వాటి గురించి ఏ అధికారి పట్టించుకోవడం లేదు. పాలకుర్తి మండల కేంద్రం నుంచి ఈసాల తక్కలపల్లి వెళ్లే దారిలో వ్యవసాయ బావి, పెద్దపల్లి నుంచి తుర్కల మద్దికుంట వెళ్లే దారిలో వ్యవసాయ బావి ప్రమాదకరంగా ఉంది. 

పెద్దపల్లి నుంచి ముప్పిరితోట, దూళికట్ట వెళ్లే దారిలో, పెద్దపల్లి నుంచి కాల్వ శ్రీరాంపూర్​ వెళ్లే మార్గంలో మారేడుగొండ సమీపంలో వ్యవసాయ బావులు ప్రమాదకరంగా ఉన్నాయి. గతంలో నిట్టూరు నుంచి పెద్ద కల్వలల వెళ్లే దారిలో ఉన్న వ్యవసాయ బావిలో కారు పడిపోయి ఓ వ్యక్తి చనిపోయాడు. ప్రమాదం జరిగినప్పుడు అధికారులు హంగామా చేసి వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రమాదాలు జరగకుండా శాశ్వత పరిష్కారం చూపాలని వాహనదారులు కోరుతున్నారు.