టీ20ల్లో చేయి తిరిగింది.. టెస్టులు ఆడాలన్న కోరిక ఉంది: సూర్యకుమార్

టీ20ల్లో చేయి తిరిగింది.. టెస్టులు ఆడాలన్న కోరిక ఉంది:  సూర్యకుమార్

న్యూఢిల్లీ: ఇండియా టీ20 టీమ్ కెప్టెన్‌‌‌‌గా చేపట్టిన నాటి నుంచి అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న సూర్యకుమార్ యాదవ్‌‌‌‌ తనకు టెస్టులు ఆడాలనే కోరిక ఉందని చెప్పాడు. 35 ఏండ్ల వయసులో టెస్టు జట్టులోకి రావడం కష్టమైనప్పటికీ, అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా ఆడతానని స్పష్టం చేశాడు.

వన్డే ఫార్మాట్‌‌‌‌ తనకు అంతగా సెట్‌‌‌‌ అవ్వలేదన్న సూర్య.. టీ20ల్లో మాత్రం తన చేయి తిరిగిందని అంటున్నాడు. వరల్డ్ కప్‌‌‌‌ విన్నింగ్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌గా దిగ్గజాల సరసన చేరిన సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌  తన కెరీర్, వరల్డ్ కప్ విజయం గురించి ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పాడు.

వన్డేల్లో నా ఆట సాగలేదు
వరుసగా రెండు వరల్డ్ కప్స్ (2024, 2026)  నెగ్గిన ఇండియా జట్టులో మెంబర్‌‌‌‌‌‌‌‌గా ఉన్న సూర్యకుమార్  కెరీర్‌‌లోఒకే ఒక్క టెస్టు (2023లో ఆస్ట్రేలియాపై) ఆడాడు. తనకు టెస్టు క్రికెట్ ఆడాలనే కోరిక ఇంకా బలంగా ఉందని తెలిపాడు. ‘నా కెరీర్ రెడ్ బాల్ క్రికెట్‌‌‌‌తోనే మొదలైంది. దాదాపు 10-–12 ఏండ్ల పాటు రంజీ ట్రోఫీ ఆడాను. ముంబైలో పెరిగిన ప్రతి క్రికెటర్ ముందుగా రెడ్ బాల్ క్రికెట్‌‌‌‌పైనే పట్టు సాధిస్తారు. నా విషయంలోనూ అదే జరిగింది. నాకు ఆ ఫార్మాట్ అంటే చాలా ఇష్టం’ అని సూర్య పేర్కొన్నాడు. 

అయితే టీ20 ఫార్మాట్ తనకు సరిగ్గా సరిపోతుందని చెప్పాడు. ‘టీ20ల్లో ఇప్పుడు నా చేయి తిరిగింది. ఈ ఫార్మాట్‌‌‌‌లో నేను చాలా సౌకర్యంగా ఉన్నాను. వన్డే క్రికెట్‌‌‌‌లో రాణించడానికి చాలా ప్రయత్నించాను కానీ, అక్కడ నా ఆట అంతగా సాగలేదు. వన్డేల్లో ఒకే ఇన్నింగ్స్‌‌‌‌లో మూడు రకాలుగా ఆడాల్సి ఉంటుంది. అది నాకు అర్థం కాలేదు. టీ20లు మాత్రం నా స్టయిల్‌‌‌‌కు సరిగ్గా సరిపోయాయి’ అని  ఒప్పుకున్నాడు.

ఇషాన్ ఎక్స్ ఫ్యాక్టర్.. శాంసన్ అద్భుతం
సొంతగడ్డపై టీ20 వరల్డ్ కప్ విజయ రహస్యాలను వివరిస్తూ  జట్టు ఎంపికలో తాను తీసుకున్న సాహసోపేత నిర్ణయాలను సూర్య వెల్లడించాడు. జితేష్ శర్మ ను కాదని ఇషాన్ కిషన్‌‌‌‌ను టీమ్‌లోకి తీసుకోవడం వెనుక తన గట్ ఫీలింగ్’ పనిచేసిందని చెప్పాడు.‘ఇషాన్‌‌‌‌ను ఎంపిక చేయడం కొంత కఠినమైన నిర్ణయమే. టాపార్డర్‌‌‌‌లో ప్రత్యర్థిని భయపెట్టే ఆటగాడు కావాలనిపించింది. ఇషాన్‌‌‌‌కు ఫోన్ చేసి ‘వరల్డ్ కప్ గెలిపిస్తావా?’ అని అడిగితే, ‘నన్ను నమ్ముతావా?’ అని తిరిగి అడిగాడు. ఆ నమ్మకమే మమ్మల్ని గెలిపించింది. తను ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆడి 317 రన్స్‌‌‌‌ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు’  అని పేర్కొన్నాడు. 

ఇక,  టోర్నీ గమనాన్ని మార్చింది మాత్రం సంజూ శాంసనే అని సూర్య కొనియాడాడు. ‘టాపార్డర్‌‌‌‌లో లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువగా ఉండటంతో ప్రత్యర్థి ఆఫ్ స్పిన్నర్లను ఎదుర్కోవడం కష్టమైంది. ఆ సమయంలో సంజూ రాకతో సమీకరణాలు మారిపోయాయి. సెమీఫైనల్, ఫైనల్లో తను ఆడిన ఇన్నింగ్స్‌‌‌‌లు అద్భుతం. మంచి వ్యక్తులకు ఎప్పుడూ మంచే జరుగుతుంది అనడానికి సంజూనే నిదర్శనం’ అని ప్రశంసించాడు.

ఒకేసారి మూడు టీ20 జట్లను ఆడించొచ్చు
ఇండియా క్రికెట్‌‌‌‌లో అద్భుతమైన టాలెంట్  ఉందన్న సూర్య ప్రస్తుతం ఇండియా ఒకేసారి రెండు, మూడు ఇంటర్నేషనల్ లెవెల్‌ టీ20 జట్లను బరిలోకి దింపగలదని ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్, డొమెస్టిక్‌‌‌‌ క్రికెట్ వల్ల ప్రతి ఏటా అద్భుతమైన క్రికెటర్లు వస్తున్నారని, ఇది దేశక్రికెట్ పునాదులను పటిష్టం చేసిందన్నాడు.

మాది అన్నదమ్ముల అనుబంధం
హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌‌‌‌తో తన సంబంధం గురించి సూర్య మాట్లాడాడు ‘మా మధ్య అన్నదమ్ముల అనుబంధం ఉంది. నేను తనను ఇప్పటికీ గౌతీ భాయ్ అనే పిలుస్తాను. మేమిద్దరం టీమ్ సెలెక్షన్  కోసం కూర్చున్నప్పుడు 15 పేర్లలో 14 పేర్లు ఇద్దరికీ సమానంగా ఉన్నాయి. మా ఆలోచనలు, లక్ష్యాలు ఒకటే కావడం జట్టు విజయానికి ప్రధాన కారణం’ అని సూర్య వివరించాడు. 

ఇక, తన విలక్షణమైన 360 డిగ్రీస్‌‌‌‌ బ్యాటింగ్ స్టయిల్‌‌‌‌ ముంబైలో చిన్నప్పుడు ఆడిన రబ్బర్ బాల్‌క్రికెట్ వల్ల అబ్బిందన్నాడు. బ్యాటింగ్ అనేది 75 శాతం రియాక్షన్, 25 శాతం సహజ టాలెంట్‌పై ఆధారపడి ఉంటుందని సూర్య  పేర్కొన్నాడు.