జీడిమెట్ల, వెలుగు: మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి నాలుగేళ్ల చిన్నారిని నేలకేసి కొట్టడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్ట మైసమ్మ నగర్‌కు చెందిన కృష్ణవేణికి ముగ్గురు సంతానం. ఆమె కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటోంది.
ఈ క్రమంలో గాలి పోచమ్మ బస్తీకి చెందిన శివతో పరిచయం ఏర్పడి అతడితో సహజీవనం చేస్తోంది. శనివారం మద్యం తాగి ఆమె ఇంటికి వచ్చిన శివతో కృష్ణవేణికి గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో ఆగ్రహించిన శివ అక్కడే ఉన్న కృష్ణవేణి చిన్నకూతురు వెన్నెల(4)ను పైకి ఎత్తి నేలకేసి కొట్టాడు.
దీంతో చిన్నారికి తీవ్ర గాయాలు కాగా అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కుటుంబ సభ్యులు ఆమెను సమీప హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
