బెంగళూరు ఎయిర్‌పోర్టులో కొత్త క్యాబ్ రూల్స్.. ప్రయాణికుల ఆగ్రహం..

బెంగళూరు ఎయిర్‌పోర్టులో కొత్త క్యాబ్ రూల్స్.. ప్రయాణికుల ఆగ్రహం..

బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్ వద్ద ట్రాఫిక్ గందరగోళాన్ని అరికట్టడానికి ప్రవేశపెట్టిన కొత్త విధానం ప్రయాణికులు, క్యాబ్ ఆపరేటర్ల నుంచి తీవ్ర నిరసనకు దారితీసింది. ఈ కొత్త క్యాబ్ రూల్స్ ప్రకారం ముందుగా బుక్ చేసుకున్న ప్రైవేట్ క్యాబ్‌లలో వచ్చే ప్రయాణికులు నేరుగా అరైవల్ కర్బ్‌సైడ్ వద్ద దిగడానికి అనుమతి లేదు. కేవలం అధికారిక ఎయిర్‌పోర్ట్ అగ్రిగేటర్ క్యాబ్ సర్వీసులకు మాత్రమే దీనిని అనుమతిస్తున్నారు.

పాత విధానం పూర్తిగా మారిపోవడంతో.. విమానం దిగిన ప్రయాణికులు తమ సామానంతో దాదాపు 800 మీటర్లు నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సుదీర్ఘ నడకలో ఎలివేటెడ్ వాక్‌వేలు, ర్యాంపులు, పొడవైన కారిడార్‌లు, అనేక లిఫ్ట్‌లను దాటాల్సి ఉంటుంది. దీనికి 15 నుండి 17 నిమిషాలు పడుతోందని ప్రయాణికులు వాపోతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, నడవలేనివారు, చిన్న పిల్లలతో ప్రయాణించే కుటుంబాలకు ఇది ఒక పెద్ద కష్టంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి విమానాశ్రయానికి ప్రయాణించిన చాలా మంది దీనిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి ముందుగా తెలియాలిగా అంటూ మండిపడుతున్నారు.

టర్మినల్-2 లో డ్రైవర్లకు పిక్-అప్ కోసం కేవలం ఎనిమిది నిమిషాల సమయం మాత్రమే కేటాయించారు. ఇది వారితో పాటు ప్రయాణికులకు తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. అధికారిక ఎయిర్‌పోర్ట్ క్యాబ్‌లను ఎంచుకోనివారు తమ బుకింగ్‌లను రద్దు చేసుకుని, ఖరీదైన ఎయిర్‌పోర్ట్ క్యాబ్‌లను ఆశ్రయించడం వలన ప్రైవేట్, అవుట్‌స్టేషన్ క్యాబ్ డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం అవుతోంది.

తాజా మార్పులకు సంబంధించి ముందుగా సమాచారం లేకపోవడం, సరైన సైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవటంతో సోమవారం ఉదయం విమానాశ్రయంలో గందరగోళం నెలకొంది. లక్నో నుంచి వచ్చిన మహ్మద్ ఇర్ఫాన్ అనే ప్రయాణికుడు, విమానాశ్రయం రాక అనేది సులభంగా ఉండాలి, కానీ ఇది అనవసరమైన ఒత్తిడిగా మారిందని అన్నారు. ప్రస్తుతం కేవలం అధికారిక ఎయిర్‌పోర్ట్ అగ్రిగేటర్ సేవలకు చెందిన ట్యాక్సీలకు మాత్రమే కర్బ్‌సైడ్ పిక్-అప్ సౌకర్యం కలిగి ఉండటంతో పిల్లలు, పెద్దవారితో ప్రయాణించే వారు సరైన ఏర్పాట్లు చేసుకోవాలని ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు సూచిస్తున్నారు.