న్యూఢిల్లీ: ఐపీఎల్ 2026 మినీ వేలం ఆసక్తికరంగా సాగుతోంది. అందరూ ఊహించినట్లుగానే కామోరూన్ గ్రీన్, మతీశా పతిరణ ఆక్షన్‌లో జాక్ పాట్ కొట్టారు. ఆసీస్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్‌ను రూ. 25.20 కోట్లు, శ్రీలంక పేసర్ మతీషా పతిరణను రూ.18 కోట్లకు కేకేఆర్ దక్కించుకుంది. అయితే.. వేలంలో సీనియర్ స్టార్ ప్లేయర్లకు ఊహించని షాక్ తగిలింది. లియామ్ లివింగ్ స్టోన్, జానీ బెయిర్ స్టో, రచీన్ రవీంద్ర, అఫ్గానిస్థాన్‌కు చెందిన రహ్మనుల్లా గుర్బాజ్ వంటి బడా ప్లేయర్లు వేలంలో అమ్ముడుపోలేదు.
వేలంలో వీరిని కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపకపోవడంతో అన్ సోల్డ్‌గా మిగిలిపోయారు. ఒంటి చేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా ఉన్న వీరిని కనీస ధరకు కొనేందుకు కూడా ఫ్రాంఛైజీలు మొఖం చాటేయడం గమనార్హం. ఏజ్, ఫిట్నెస్, గత సీజన్ ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా వీరిని కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇండియన్ ప్లేయర్స్ పై ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు:
ఐపీఎల్ 2026 మినీ వేలంలో పలువురు ఇండియన్ ప్లేయర్స్‌కు నిరాశే ఎదురైంది. భారత ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపకపోవడంతో పలువురు అన్ సోల్డ్‌గా మిగిలిపోయారు. కేఎస్ భరత్, దీపక్ హుడా, సర్ఫరాజ్ ఖాన్, పృథ్వీ షా, యష్ ధుల్, ఆర్య దేశాయి, అధర్వ థైదే, అన్మోల్ ప్రీత్ సింగ్, అభినవ్ తేజ్ రానా, అభినవ్ మనోహర్, అన్మోల్ ప్రీత్ సింగ్, రాహుల్ చాహర్, శివం మావి, ఆకాశ్ దీప్ వేలంలో అమ్ముడుపోలేదు.
మరోవైపు.. టీమిండియా యంగ్ ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్, స్పిన్నర్ రవి బిష్ణోయ్ పై కాసుల వర్షం కురిసింది. వీరిద్దరూ భారీ ధరకు అమ్ముడుపోయారు. రూ.7 కోట్లకు వెంకటేశ్ అయ్యర్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ కొనుగోలు చేయగా.. రవి బిష్ణోయిని 7.2 కోట్ల రూపాయలకు రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది.
