హైదరాబాద్: GHMC డివిజన్ల పునర్విభజనపై హైకోర్టులో విచారణ జరిగింది. రాంనగర్ను చిక్కడపల్లి నుంచి బాగ్ లింగంపల్లిలో కలపడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. అయితే.. పిటిషనర్ పేర్కొన్న అంశాలపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏ ప్రాతిపదికన మీరు డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తున్నారని పిటిషనర్ను హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. అక్కడ 100 ఫీట్ రోడ్డుతో పాటు 30 ఫీట్ నాలా ఒక అబ్జెక్షన్ అని పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పారు. ఇంటి డోర్ నెంబర్లు మార్పుతో పాటు, ట్యాక్స్ చెల్లింపు దగ్గర అంశాలు మారుతాయని పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
పిటిషనర్ అభ్యంతరాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్ అభ్యంతరాలు సంతృప్తిగా లేవని హైకోర్టు అభిప్రాయపడింది. మీ అభ్యంతరాలపై నేనే సంతృప్తి చెందనప్పుడు అధికారులు ఎలా సంతృప్తి చెందుతారని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. చిక్కడపల్లి డివిజన్ను రాష్ట్రాల బౌండరీలతో పోల్చడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం వాదనలను పూర్తిగా వింటామన్న హైకోర్టు స్పష్టం చేసింది.
GHMC పరిధిలో చేపట్టిన డివిజన్ల పునర్విభజన అసంబద్ధంగా, ఏకపక్షంగా జరిగిందని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ అంశం అత్యవసరమని పేర్కొంటూ పిటిషనర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
జనాభా ప్రమాణాలు, భౌగోళిక సౌలభ్యం, పరిపాలనా సమతుల్యతను పక్కనపెట్టి డీలిమిటేషన్ చేశారని పిటిషనర్ ఆరోపించారు. కొన్ని ప్రాంతాలకు అన్యాయం జరిగేలా, మరికొన్ని ప్రాంతాలకు లాభం చేకూరేలా వార్డుల విభజన జరిగిందనేది వాదన. ప్రజాప్రతినిధులు, స్థానికుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.
