LSG vs MI: లక్నో చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు

LSG vs MI: లక్నో చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లోనూ ముంబై ఇండియ‌న్స్ ఆటగాళ్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. మొదట బ్యాటర్లు విఫలమవ్వగా.. అనంతరం బౌలర్లు వారి అడుగుజాడల్లోనే ప్రయాణించారు. ఫలితంగా, లక్నో చేతిలో ఓడి ప్లే ఆఫ్స్ ఆశలను క్లిష్టతరం చేసుకుంది. మొదట ముంబై 144 పరుగులు చేయగా.. లక్నో బ్యాటర్లు  19.2 ఓవర్లలో ఆ లక్ష్యాన్ని చేధించారు. ఛేదనలో స్టోయినిస్(62; 45 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ బాదగా.. కేఎల్ రాహుల్(28) పరుగులు చేశారు.   

తొలి ఓవర్‌లోనే వికెట్

145 పరుగుల ఛేదనలో లక్నో తొలి ఓవర్లోనే వికెట్‌ కోల్పోయింది. తుషార వేసిన తొలి ఓవర్లో నాలుగో బంతికి ఆర్షిన్ కులకర్ణి(0) ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. అనంతరం స్టోయినిస్- రాహుల్ జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ మరో వికెట్ చేజారకుండా నిలకడగా ఆడుతూ మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. 58 పరుగులు జోడించారు. వేగంగా ఆడే ప్రయత్నంలో రాహుల్ ఔటవ్వగా.. క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా(18).. స్టోయినిస్‌తో జతకలిసి స్కోరు బోర్డును నడిపించాడు. 

మ్యాచ్ ఏకపక్షంగా సాగుతున్న సమయంలో పాండ్యా ఈ జోడీని విడదీశాడు. హుడాను ఔట్ చేసి.. మరోసారి పోరాడే అవకాశం కల్పించాడు. ఆపై కొద్దిసేపటికే స్టోయినిస్, టర్నర్(5) వెనుదిరగడంతో మ్యాచ్ ఆసక్తిగా అనిపించింది. అయితే, లక్ష్యం చిన్నది కావడం.. బుమ్రా 4 ఓవర్లు పూర్తవ్వడంతో ముంబై బౌలర్లు ఏమీ చేయలేకపోయారు.

ఆదుకున్న వ‌ధేరా

అంతకుముందు సొంతగడ్డపై లక్నో బౌలర్లు విజృభించడంతో ముంబై స్వల్ప స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. అన్‌క్యాపెడ్ ప్లేయర్ నేహ‌ల్ వ‌ధేరా(37) ఒక్కడే పర్వాలేదనిపించాడు. రోహిత్ శ‌ర్మ(4), సూర్యకుమార్ యాద‌వ్‌(10), తిలక్ వర్మ(7), హార్దిక్ పాండ్యా(0) నలుగురూ విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో మొహ్సిన్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టగా.. స్టోయినిస్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మయాంక్ యాదవ్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.

చివరి నుంచి రెండో స్థానంలో ముంబై

ఇప్పటివరకూ 10 మ్యాచ్‌లు ఆడిన ముంబై.. మూడింట మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పరిస్థితి సైతం అంతే. ఈ ఇరు జట్లు చివరి స్థానం కోసం పోటీపడుతున్నాయి. అధ్బతాలు జరిగితే తప్ప.. ఇవి రెండూ ప్లే ఆఫ్స్ చేరవు.