- కౌన్సిల్ మీటింగులకు మీడియాకు నో ఎంట్రీ
- 2017లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు
- పార్లమెంట్, అసెంబ్లీల్లో లేని రూల్స్ మున్సిపాలిటీలకు ఎందుకంటున్న ప్రతిపక్షాలు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: మున్సిపల్ మీటింగులకు మీడియాను అనుమతించకుండా సర్కారు నియంత్రిస్తోంది. ప్రతినెలా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జనరల్‌బాడీ మీటింగులు జరుగుతాయి. ఈ సమావేశాలకు మీడియాను నిషేధిస్తూ మున్సిపల్ అడ్మిస్ట్రేషన్ డిపార్ట్మెంట్2017 ఏప్రిల్‌లో ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు మీడియా ఈ సమావేశాలకు హాజరై పాలకవర్గాల తీరుతెన్నులను రిపోర్టు చేసేది. అఫీసర్లు, మేయర్లు, చైర్పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్ల అక్రమాలు, అవినీతి, నిధుల దుర్వినియోగం తదితర అంశాలు చాలా సందర్భాల్లో ఈ మీటింగుల్లో ప్రస్తావనకు వచ్చేవి. అవన్నీ మీడియా ద్వారా ప్రజల్లోకి రావడంతో సర్కారు నిషేధం విధించింది. తమ పాలన పారదర్శకంగా ఉంటుందని ఎప్పుడూ చెప్పుకునే మంత్రి కేటీఆర్ సొంత శాఖే.. మున్సిపల్ మీటింగులకు మీడియాను రానీయకుండా కట్టడి చేస్తున్నది.
ఎక్కడా అనుమతించడం లేదు
పార్లమెంటు అసెంబ్లీ సమావేశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాయి. తాము ఎన్నుకున్న వాళ్లు చట్టసభల్లో ఏం మాట్లాడుతున్నారో.. ప్రజల కోసం వారు చేస్తున్నారో జనం తెలుకునేందుకు లైవ్ ఇస్తున్నారు. జిల్లా, మండల పరిషత్మీటింగులకు కూడా మీడియాను ఆహ్వానిస్తున్నారు. 2017 ముందు వరకు మున్సిపల్ సమావేశాలకు కూడా మీడియాను పిలిచేవాళ్లు. కానీ 27 ఏప్రిల్2017 లో మున్సిపల్అడ్మినిస్ట్రేషన్ నుంచి రిలీజ్ చేసిన సర్క్యులర్తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సీఎం ఇలాకా సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీల్లో తప్ప దాదాపు అన్ని చోట్ల మీడియాపై నిషేధం అమలవుతోంది. ఇదే జిల్లాలోని గజ్వేల్, హుస్నాబాద్ మున్సిపాలిటీల్లో మీడియాను అలో చేయడం లేదు. మంత్రి కేటీఆర్సొంత నియోజకవర్గంలోని సిరిసిల్ల మున్సిపాలిటీలోకి మీడియాను రానివ్వడం లేదు. పక్కనే ఉన్న మెదక్ జిల్లాలోని మెదక్, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీల్లో మీటింగులకు మీడియాను అనుమతించట్లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీల్లో మీడియాను రానివ్వడం లేదు. నిజామాబాద్ కార్పొరేషన్ తోపాటు జిల్లాలోని ఆర్మూర్, బోధన్ , భీమ్ గల్, కామారెడ్డి జిల్లా కామారెడ్డి, బాన్స్ వాడ, ఎల్లారెడ్డి, నాగర్‌కర్నూలు జిల్లాలోని నాగర్ కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ మున్సిపాలిటీల్లో మీడియాపై నిషేధం అమలవుతోంది. కరీంనగర్ కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని ఏ మున్సిపాలిటీలోనూ మీడియాకు అనుమతి లేదు. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని అన్ని మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో సమావేశాలు పూర్తయ్యాక ప్రతిపక్ష నేతలు కొందరు ప్రెస్మీట్లు పెట్టి, పాలకవర్గం తప్పిదాలను ఎండగడుతున్నారు. ‘ఆ కౌన్సిలర్ ఇలా మాట్లాడారు, ఈ కౌన్సిలర్ ఇలా అన్నారు. చైర్‌పర్సన్‌పై ఫలానా ఆరోపణలు వచ్చాయి. ఆఫీసర్ల అవినీతిని సభ్యులు ప్రశ్నించారు’ ఇలా చెబుతున్నారు. ఇందులో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియక మీడియా రిపోర్ట్ చేయలేకపోతోంది. అదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్, భైంసా మున్సిపాలిటీ ల్లో మీడియాకు పర్మిషన్ లేదు. బడ్జెట్, కౌన్సిల్ మీటింగులకూ పిలవట్లేదు. నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ మీడియాకు పర్మిషన్లేదు. ఈ జిల్లాలో ప్రతిపక్ష పార్టీ నేతలే వీడియోలు, ఫోటోలు తీసి మీడియాకు రిలీజ్ చేయాల్సిన దుస్థితి. ఇటీవల సూర్యాపేట కౌన్సిల్ మీటింగ్ కు మీడియాను అనుమతించకపోవడంపై టీపీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సర్కారు, ఆఫీసర్లపై మండిపడ్డారు. కానీ ఎలాంటి ఫాయిదా లేకుండా పోయింది. కొన్నిచోట్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, తీర్మానాలను వివరిస్తూ ఆఫీసర్లు నోట్రిలీజ్ చేస్తుండగా.. ఇంకొన్నిచోట్ల సమావేశాల్లో ఏం జరిగిందో తెలియడం లేదు. ఇలా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జరిగే కౌన్సిల్ మీటింగులకు మీడియాను అలో చేయకపోవడం ప్రజల ప్రాథమిక హక్కును కాలరాయడమేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అక్రమాలు బయటకు రావద్దనే
ప్రతినెలా జరిగే కార్పొరేషన్, మున్సిపల్ మీటింగ్‌లలో టౌన్లో అప్పటివరకు జరిగిన పనులను సమీక్షించి.. ఇంకా ఏం చేయాలన్నది డిసైడ్చేస్తారు. బడ్జెట్ మీటింగ్‌లో ఏ మార్గంలో ఎంత ఫండ్ వస్తుందో.. ఏఏ పనులు చేపట్టనున్నారో ప్లాన్చేస్తారు. మీటింగుల్లో అన్ని అంశాల మీద పాలకవర్గ సభ్యులు సమగ్రంగా చర్చిస్తారు. ఈ క్రమంలో పట్టణాల్లో జరుగుతున్న తప్పులు, అక్రమాలు ప్రస్తావనకు వస్తుంటాయి. పనుల్లో వివక్ష, ఫండ్స్ దుర్వినియోగం, ఆఫీసర్ల నిర్లక్ష్యం తదితర అంశాల మీద సభ్యులు తరచూ నిలదీస్తుంటారు. దీనివల్ల రూలింగ్పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటుదన్న ఉద్దేశంతోనే మీడియా మీద నిషేధం విధించారన్న ప్రచారం జరుగుతోంది.
మీడియాను అనుమతించకపోవడం అప్రజాస్వామికం
మున్సిపల్ సమావేశా లకు మీడియాను అనుమతించకపోవ డం అప్రజాస్వామి కం. అసెంబ్లీ, మండ లి సమావేశాలను లైవ్పెట్టినప్పుడు మున్సిపల్ సమావేశాలకు మాత్రం అడ్డు చెప్పడం విడ్డూరంగా ఉంది. మున్సిపల్ సమావేశాల్లో ఏం జరుగుతుందో సీక్రెట్‌గా ఉంచడం ఎందుకు? మున్సిపల్ సమావేశాలలో రూలింగ్పార్టీ కౌన్సిలర్లు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. మీడియా కవరేజ్ ఉంటే వారి ఆగడాలు ప్రజలకు అర్థమవుతాయి. వెంటనే మున్సిపల్ సమావేశాలకు మీడియాను అనుమతించాలి.
- బొల్గం నాగరాజు, సిరిసిల్ల మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్
ఇంత నిరంకుశత్వమా..
కౌన్సిల్ మీటింగ్‌లకు మీడియాను అనుమతించకపోవడం దారుణం. బంగారు తెలంగాణ అంటే మీడియాకు సంకెళ్లు వేయడమేనా? టీఆర్ఎస్గవర్నమెంట్ వచ్చిన తర్వాతే నిషేధం పెట్టారు. మీడియాను ఎందుకు రానివ్వడం లేదో మున్సిపల్ మినిష్టర్ కేటీఆర్ జవాబు చెప్పాలి.
- వై.శ్రీనివాస్‌రెడ్డి, సీపీఐ మున్సిపల్ఫ్లోర్లీడర్, కొత్తగూడెం
గవర్నమెంట్ ఉత్తర్వుల మేరకే..
కౌన్సిల్ మీటింగ్‌లకు మీడియాను అనుమతించవద్దని మున్సిపల్అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నాం. ప్రభుత్వం అనుమతిస్తే మీడియాను ఆహ్వానిస్తాం.
- ఎ.సంపత్ కుమార్, మున్సిపల్ కమిషనర్, కొత్తగూడెం
పారదర్శక పాలనైనప్పుడు భయమెందుకు
టీఆర్ఎస్ పార్టీ పారదర్శకత పాలన అందిస్తున్నపుడు మీడియాతో భయమెందుకు. సభ్యుల బలంతో చర్చ జరగకుండానే ఎన్నో తీర్మానాలు చేస్తున్నారు. బల్దియాలో వర్క్స్ పెట్టేటప్పుడు అందులో అవకతవకలపై ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు మీడియాను అలో చేయడం లేదు. గతంలో జరిగిన సమావేశాల్లో మీడియాను అలో చేయాలని గంటల పాటు నిరసన తెలిపినా ఫలితం లేకపోయింది.
- అనుమల్ల జయశ్రీ, ఇండిపెండెంట్ కౌన్సిలర్, జగిత్యాల
