హైదరాబాద్: చావైనా, బతుకైనా కరీంనగరేనని.. తుది శ్వాస వరకు బీజేపీలోనే ఉంటానని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. బండి సంజయ్ సైతం డాక్టర్ లక్ష్మణ్ మాదిరిగా ఏదో ఒక రాష్ట్రానికి వలస పోక తప్పదంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘వలసపోవడానికి నేను అవకాశవాదిని కాదు. రేవంత్ రెడ్డిని అంతకంటే కాదు. చావైనా బతుకైనా కరీంనగరంతోనే... నా రక్తం కాషాయమే. నేను చనిపోతే నా శవంపై కప్పేది కూడా కాషాయ జెండానే. ఆ సన్నివేశం చూడటానికైనా రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు బతికి ఉండాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నారు.
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లులతో జరిగే నష్టమేమిటో చెప్పే దమ్ములేక రాజకీయం చేయాలనుకంటున్నారా అని ప్రశ్నించారు. డీలిమిటేషన్లో భాగంగా ప్రతి రాష్ట్రానికి 50 శాతం సీట్ల పెంచితే దక్షిణాదికి జరిగే నష్టమేంటని.. ప్రజల్లో లేనిపోని భయాందోళనలు స్రుష్టించి విభజించాలనుకుంటున్నారా అని నిలదీశారు. అసలు.. మీరు చెప్పే శాస్త్రీయత ఏమిటి..? డబ్బు సమకూర్చే వాళ్లకే ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నారా అని ప్రశ్నించారు.
డబ్బుకు, ఓటుకు, సీటుకు లింకు పెడతారా..? లక్ష కోట్లు ఉన్న మీ కుటుంబానికి లక్ష ఓట్లు ఇవ్వాలా..? డబ్బులేని పేదవాడికి ఓటు హక్కు కల్పించొద్దా అని ప్రశ్నల వర్షం కురిపించారు. ముంబయికి, ఢిల్లీకి మాత్రమే అత్యధిక సీట్లు ఉండాలా.. వెనుకబడ్డ ఆదిలాబాద్, పాలమూరు జిల్లాలకు సీట్లు పెంచాల్సిన అవసరమే లేదా అని నిలదీశారు. మీ హైబ్రీడ్ మోడల్ అంటే ఇదేనా అని అన్నారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం తగదని చురకలంటించారు.

