వన మహోత్సవానికి అంతా రెడీ!

వన మహోత్సవానికి అంతా రెడీ!

 

  • ఈ నెల 9 లేదా 10న ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి 
  • గుర్రంగూడ అర్బన్‌‌ ఫారెస్ట్‌‌ పార్కులో వన మహోత్సవానికి ఏర్పాట్లు 
  • ఈసారి 16.06 కోట్లమొక్కలు నాటడమే లక్ష్యం
  • శాఖల వారీగా టార్గెట్లు ఖరారు చేసిన రాష్ట్ర సర్కార్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వన మహోత్సానికి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 9 లేదా10వ తేదీన రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ అర్బన్ ఫారెస్ట్ పార్కులో సీఎం రేవంత్ రెడ్డి మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దీంతో ఇప్పటికే అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి అహ్మద్‌‌ నదీమ్‌‌ నేతృత్వంలో వైల్డ్‌‌ లైఫ్‌‌ చీఫ్‌‌ వినయ్‌‌ కుమార్‌‌, సీసీఎఫ్‌‌ ప్రియాంక వర్గీస్​తో కలిసి గుర్రంగూడ పార్క్‌‌ ప్రాంతాన్ని పరిశీలించి, సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాగా, ఈసారి ఏ శాఖ ఎన్ని మొక్కలు నాటాలన్న లక్ష్యాలను కూడా నిర్దేశించింది. అయితే, గతేడాది మొత్తం 18.02 కోట్ల మొక్కలు నాటగా.. ఈసారి 16.06 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది.

శాఖల వారీగా లక్ష్యాలు.. 

పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు పట్టణాలు, పల్లెల్లో పచ్చదనం పరిఢవిల్లేలా ఏటా జూన్‌‌లో ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈసారి మొత్తం 23 శాఖలకు సంబంధించి లక్ష్యాలను ఖరారు చేయగా.. ఇందులో మున్సిపల్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు కీలక పాత్ర పోషించనున్నాయి. గతేడాది మున్సిపల్ శాఖ 8 కోట్లు మొక్కలు నాటగా.. ఈసారి 7.20 కోట్ల మొక్కలు నాటాలని టార్గెట్ పెట్టింది. పట్టణాల్లోని పార్కులు, ఖాళీ స్థలాలు, డివైడర్ల వెంట పచ్చదనాన్ని పెంచేలా కార్యాచరణ రూపొందించింది.

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో 2025లో 7 కోట్ల మొక్కలు నాటగా.. ఈసారి 6.18 కోట్ల మొక్కలు నాటేలా ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. ఉపాధి హామీ పథకం అనుసంధానంతో గ్రామీణ రహదారుల వెంట, గ్రామ పొలాల గట్లపై మొక్కలు నాటనున్నారు. అటవీశాఖ, అటవీ అభివృద్ధి సంస్థ సంయుక్తంగా కోటి మొక్కలు నాటనున్నాయి. అలాగే, వ్యవసాయశాఖ ద్వారా కూడా రైతులను భాగస్వాములను చేస్తూ మరో కోటి మొక్కలు నాటనున్నారు.

విద్యుత్ శాఖ 25 లక్షలు, రెవెన్యూ 27 లక్షలు, పరిశ్రమల శాఖ 14 లక్షలతో పాటు హోం, విద్యా, రోడ్లు, భవనాల శాఖలకు మొక్కలు నాటే బాధ్యతలను అప్పగించారు. అటవీ శాఖ అటవీ ప్రాంతాల్లో, పట్టణాల్లో మున్సిపల్ శాఖ, గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నాయి. అయితే, గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది టార్గెట్‌‌ను కొంత తగ్గించినప్పటికీ.. లక్ష్యాన్ని సాధించడంలో నిర్లక్ష్యం చేయవద్దని ప్రభుత్వం ఆదేశించింది. 

విద్యాసంస్థల్లోనూ పచ్చదనం..

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లోనూ మొక్కలు నాటాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. స్కూల్స్‌‌, కాలేజీలు, యూనివర్సిటీల పరిధిలో సుమారు 8.6 యూనిట్ల మొక్కలు నాటనున్నారు. రోడ్ల వెంట పచ్చదనం కోసం ఆర్ అండ్ బీ, ఎన్‌‌హెచ్‌‌ఏఐ వంటి విభాగాలు కలిసి సుమారు 6 యూనిట్ల లక్ష్యాన్ని పూర్తి చేయాలి. ఐటీడీఏ పరిధిలోని గిరిజన ప్రాంతాల్లో సుమారు 3.6 యూనిట్ల మొక్కలను నాటాలని నిర్ణయించారు. ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వేలు, గనులు, ఆరోగ్య శాఖలు కూడా తమకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది