ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ

ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ

హైదరాబాద్, వెలుగు: కరోనా చికిత్స పేరిట కార్పొరేట్​, ప్రైవేట్​ ఆస్పత్రులు అడ్డగోలుగా వసూళ్లు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించిన ఫీజులను కాదని ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నాయి. కనీసం లక్షన్నర అడ్వాన్స్ కడితేనే పేషెంట్స్ ను చేర్చుకుంటున్నాయి. లేదంటే బెడ్స్ ఖాళీగా లేవని సాకులు చెప్పి.. గేటు దగ్గరే వెనక్కి పంపిస్తున్నాయి. ఆక్సిజన్ అవసరం ఉన్న పేషెంట్స్ విషయంలో కార్పొరేటు ఆస్పత్రులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఆక్సిజన్ తో ట్రీట్​మెంట్ అయితే కనీసం రోజుకు రూ.2 లక్షలు ఫీజు వసూలు చేస్తున్నాయి. మరోవైపు హెల్త్ ఇన్సూరెన్స్ లకు ట్రీట్​మెంట్ లేదని, ముందు ఫీజు చెల్లించి ఆ తర్వాత రీయింబర్స్ మెంట్ పెట్టుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు, కార్పొరేటు ఆస్పత్రుల ఆగడాలపై వేలాది ఫిర్యాదులు వస్తున్నా.. ప్రభుత్వంలో మాత్రం కదలిక లేదు. ఇప్పటిదాకా ఏ ఆస్పత్రిపైనా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
ముందు బెడ్లు లేవని చెప్పి..
రాష్ట్రవ్యాప్తంగా 1,045 ప్రైవేటు ఆస్పత్రులు కరోనా ట్రీట్​మెంట్ ఇస్తున్నాయి. ఇందులో సుమారు 700 హాస్పిటల్స్ ఫీజులు లక్షల్లో వసూలు చేస్తున్నాయి. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం కేంద్రంగా పనిచేస్తున్న కార్పొరేటు హస్పిటళ్లు భారీగా గుంజుతున్నాయి. పేషెంట్ ను చేర్చుకోవాలని బంధువులు ఫోన్ చేయగానే ముందు ఫీజు గురించి తేల్చిచెబుతున్నాయి. పరిస్థితి విషమించిన తర్వాత పేషెంట్ వస్తే.. పండుగ చేసుకుంటున్నాయి. అసలు బెడ్లు లేవని చెప్పి, పేషెంట్ అటెండెంట్లను సైకలాజికల్ గా తమకు అనుకూలంగా మల్చుకుంటున్నాయి. పేషెంట్ ను బతికించండని, ఎంతైనా ఫీజు చెల్లిస్తామని చెప్పగానే.. లక్షన్నర అడ్వాన్స్ కట్టించుకుంటున్నాయి. 
రోజూ వందలాది ఫిర్యాదులు
ప్రైవేటు హాస్పిటల్స్ దోపిడీపై రోజుకు వందలాది ఫిర్యాదులు వస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం కరోనా చికిత్స కోసం 104 కాల్ సెంటర్ ను, వాట్సాప్ ద్వారా సలహాలు తీసుకునేందుకు ఫోన్ నంబర్ 9154170960ను ఏర్పాటు చేశారు. ఫీజుల దోపిడీపై ఇప్పటిదాకా సుమారు 3,700 దాకా ఫిర్యాదులు వచ్చినట్టు ఆఫీసర్లు చెప్తున్నారు. రోజూ వచ్చే ఫిర్యాదులను కాల్ సెంటర్ ఇన్ చార్జులు ప్రభుత్వానికి పంపుతున్నారు. కానీ ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే కార్పొరేటు ఆస్పత్రులపైనే ఎక్కువ సంఖ్యలో కంప్లైట్స్ వస్తున్నట్టు తెలిసింది.
తర్వాత రోజుకు రెండు లక్షల మేర ఫీజు వసూలు చేస్తున్నాయి. వారం రోజులు చికిత్స తీసుకుంటే రూ.10 లక్షల నుంచి 15 లక్షల దాకా వేస్తున్నాయి. ‘‘తొలుత వెళ్లినప్పుడు ‘అసలు బెడ్స్ ఖాళీగా లేవు. మీరు మరీ అర్జెంట్ అంటున్నారు కాబట్టి బెడ్డు అరేంజ్ చేస్తాం. అడ్వాన్స్ గా ఓ లక్ష కట్టాలి’ అని చెప్పారు. డబ్బు కట్టాం. వారం రోజులు తర్వాత డిశ్చార్జి చేసేటప్పుడు రూ.12.6 లక్షల బిల్లు చేతిలో పెట్టారు’’ అని హైదరాబాద్ లో కార్పొరేటు హాస్పిటల్ వసూలు చేసిన ఫీజు గురించి ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ ఆవేదన చెందారు.
చెక్కులు, కార్డులు, ఇన్సూరెన్స్.. ఒప్పుకోరంట
కార్పొరేటు ఆసుపత్రుల్లో ట్రీట్​మెంట్ కోసం ఏ రోజు బిల్లు అదే రోజు చెల్లించాలి. చెక్, క్రెడిట్, డెబిట్​కార్డు, ఆన్ లైన్ బ్యాంకింగ్ ద్వారా కడుతామంటే ఒప్పుకోవడం లేదు. అలా తీసుకుంటే.. ఇన్​కమ్ ట్యాక్స్ లెక్కలు చూపించాల్సి వస్తుందనే కారణంతో క్యాష్ రూపంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీంతో నగదు కోసం పేషెంట్ల బంధువులు తెలిసిన వారి వద్ద అప్పులు చేస్తున్నారు. అలా కుదరకపోతే తమ దగ్గరున్న బంగారం, ఇతర ఆస్తులను కుదవపెడుతున్నారు. గత ఏడాది కరోనా వచ్చిన టైమ్ లో చాలా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు భారీగా పాలసీలు చేయించాయి. కానీ కార్పొరేటు ఆసుపత్రులు మాత్రం ఇన్సూరెన్స్ ద్వారా ట్రీట్​మెంట్ చేయలేమని, ముందుగా ఫీజు కట్టాలని స్పష్టం చేస్తున్నాయి. తర్వాత ఫీజు రీయింబర్స్​మెంట్ కోసం కావాల్సిన డాక్యుమెంట్స్ ఇస్తామని చెబుతున్నాయి.
ఫుల్ ఫీజు కడితినే డెడ్ బాడీ
ట్రీట్​మెంట్ సమయంలో పేషెంట్ మరణించినా ఫీజు విషయంలో ఆస్పత్రులు వెనక్కి తగ్గడం లేదు. ముందుగా చెప్పిన మేరకు ఫీజు చెల్లిస్తేనే డెడ్ బాడీ ఇస్తామని తేల్చి చెబుతున్నాయి. ఫీజు చెల్లించడానికి ఒకరోజు కంటే ఎక్కువ టైమ్ తీసుకుంటే మార్చురీ ఫీజు రోజుకు రూ. 30 వేల చొప్పున 
కట్టించుకుంటున్నాయి.

హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లో కార్పొరేటు, ప్రైవేటు ఆస్పత్రుల ఓనర్లు ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులనే కారణంతో చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అందుకే తమపై ఫిర్యాదులు వచ్చినా ఏం కాదనే ధీమాతో ఆస్పత్రులు ఉన్నట్టు ఆఫీసర్లు అంటున్నారు. రూల్స్​కు వ్యతిరేకంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ప్రశ్నిస్తే ఎదురు దాడి చేసే పరిస్థితులు ఉన్నాయని ఆవేదన చెందుతున్నారు. ఏదైనా ఒక్క ఆసుపత్రిపై చర్యలు తీసుకున్నా.. మిగతావి దారికొస్తాయని ప్రభుత్వంలో కీలక హోదాలో పనిచేస్తోన్న ఆఫీసర్లు అంటున్నారు. కానీ ప్రభుత్వ పెద్దల ఆలోచన మాత్రం ప్రైవేటు ఆస్పత్రులకు సపోర్టుగా ఉన్నట్టు కనిపిస్తోందని చెబుతున్నారు.
మంత్రులు అడిగినా.. డోంట్ కేర్
మంత్రులు, ఐఏఎస్ లకు ప్రైవేటు హాస్పిటల్స్ షాక్ ఇస్తున్నాయి. తాము చెప్పినంత కట్టాల్సిందేనని, ఫీజు తగ్గించే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తున్నాయి. కరోనా చికిత్స చేయించుకున్న తమ బంధువులు, సన్నిహితులకు ఫీజు తగ్గించాలని కొందరు మంత్రులు, ఐఏఎస్ లు.. ప్రైవేటు హాస్పిటల్స్ ను సంప్రదించినప్పుడు వారికి చేదు అనుభవాలు ఎదురైనట్టు తెలిసింది.  కార్పొరేటు ఆస్పత్రులు లక్షల్లో ఫీజు వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులు వచ్చినా.. పెద్దలు ఎందుకు పట్టించుకోవట్లేదో అర్థం కావట్లేదని ఓ బాధిత మంత్రి అన్నారు.