ప్ర‌భుత్వ ల్యాబ్‌ల్లో టెస్ట్ చేశాకే ఎగుమతికి అనుమతి.. ద‌గ్గు సిరప్ లపై కేంద్రం కీలక నిర్ణయం

ప్ర‌భుత్వ ల్యాబ్‌ల్లో టెస్ట్ చేశాకే ఎగుమతికి అనుమతి.. ద‌గ్గు సిరప్ లపై కేంద్రం కీలక నిర్ణయం

ద‌గ్గు సిరప్ పై ఎగుమతిదారులకు కేంద్రం కీల‌క నిబంధ‌న‌లు జారీ చేసింది. ద‌గ్గు సిర‌ప్‌ల‌ ఎగుమతికి ప్ర‌భుత్వ ల్యాబ్‌ల్లో అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నాణ్యతలపై ఆందోళనల నేపథ్యంలో కేంద్రం ఈ ప్రకటన విడుదల చేసింది. ప్ర‌భుత్వ ల్యాబ్‌ల్లో త‌నిఖీ చేశాకే దగ్గు సిరప్ ఎగుమ‌తుల‌కు అనుమ‌తి ఇస్తున్న‌ట్లు కేంద్రం ప్ర‌క‌టనలో వెల్లడించింది. జూన్ 1వ తేదీ నుంచి ఈ నిబంధనలు వ‌ర్తించ‌నున్నట్టు తెలిపింది.

దగ్గు సిరప్ ల ఎగుమతులు చేసే కంటే ముందు ప్ర‌భుత్వ ల్యాబ్స్ వాటిని ప‌రీక్ష చేయాలి. ఆ తర్వాత వారు అందించే ధృవీక‌ర‌ణ పత్రాన్ని అధికారుల‌కు చూపించాల‌ని కేంద్రం నిబంధ‌న విధించింది. ప్రస్తుతం ఇండియ‌న్ ఫార్మ‌కోపోయియా క‌మిష‌న్, ఆర్‌డీటీఎల్ – చండీఘ‌ర్, సెంట్ర‌ల్ డ్ర‌గ్స్ ల్యాబ్ – కోల్‌క‌తా, సెంట్ర‌ల్ డ్ర‌గ్ టెస్టింగ్ ల్యాబ్ – చెన్నై, హైద‌రాబాద్, ముంబై, ఆర్‌డీటీఎల్ – గువ‌హ‌టితో పాటు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌చే గుర్తింపు పొందిన‌ ఎన్ఏబీఎల్ వంటి ల్యాబ్‌ల్లో ద‌గ్గు సిర‌ప్‌ల‌ను ప‌రీక్షించేందుకు అవ‌కాశం క‌ల్పించారు.

2022లో గాంబియా, ఇండోనేషియా, ఉజ్బెకిస్థాన్ వంటి దేశాల్లో భారత్ లో తయారైన దగ్గు మందు తీసుకుని పదుల సంఖ్యలో చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై అప్పట్లో ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్ వో.. ఈ ఘటనపై సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో ఇండియన్ గవర్నమెంట్ కూడా చర్యలకు ఉపక్రమించింది.