ఎక్స్‌ ‌‌‌టర్నల్ వాల్యుయేషన్ వద్దే వద్దు..సీసీఈ స్ఫూర్తికి విరుద్ధంగా కొత్త విధానం

ఎక్స్‌ ‌‌‌టర్నల్ వాల్యుయేషన్ వద్దే వద్దు..సీసీఈ స్ఫూర్తికి విరుద్ధంగా కొత్త విధానం
  • ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని టీచర్ల సంఘాల డిమాండ్

హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో విద్యార్థుల సమ్మేటివ్ అసెస్‌‌‌‌మెంట్‌‌‌‌ (ఎస్‌‌‌‌ఏ-1, 2) పరీక్షల ఆన్సర్ షీట్లను ఇతర బడుల టీచర్లతో దిద్దించడాన్ని పలు ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. పరీక్షల్లో పారదర్శకత పేరుతో విద్యాశాఖ తీసుకొచ్చిన ఈ విధానం టీచర్ల నిజాయితీని శంకించేలా ఉందని టీపీటీఎఫ్, డీటీఎఫ్, హెడ్మాస్టర్ల అసోసియేషన్, తపస్, టీఆర్టీఎఫ్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కొత్త విధానాలపై ముందే టీచర్ల సంఘాలతో చర్చించాలని కోరారు. “విద్యార్థులకు భయంలేని అభ్యసన వాతావరణం కల్పించడమే సీసీఈ ఉద్దేశం. అలాంటప్పుడు ఎక్స్‌‌‌‌టర్నల్ వాల్యుయేషన్ ఎవరి ప్రయోజనాల కోసం?” అని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ ప్రశ్నించారు. విద్యార్థికి పాఠాలు చెప్పేందుకు, హాజరు వేయడానికి, ప్రగతిని గమనించేందుకు అర్హుడైన టీచర్.. పేపర్ దిద్దడానికి మాత్రం అనర్హుడా? అని ప్రశ్నించారు. తొమ్మిదో తరగతి వరకు నాన్‌‌‌‌-డిటెన్షన్ విధానం అమల్లో ఉన్నందున పరీక్షల ఫలితాల ఆధారంగా టీచర్లను బాధ్యులను చేయడం సరికాదని డీటీఎఫ్ నేతలు ఎం. సోమయ్య, టి. లింగారెడ్డి అన్నారు. 

శిక్షణలు, ప్రాజెక్టులు, రాతపనులతో బోధనా సమయం ఇప్పటికే తగ్గిపోయిందని చెప్పారు. ఎక్స్‌‌‌‌టర్నల్ వాల్యుయేషన్‌‌‌‌పై పునరాలోచించాలని హెచ్‌‌‌‌ఎం యూనియన్ అధ్యక్షుడు రాజభానుచంద్రప్రకాశ్ కోరారు. ఇంటర్నల్ వాల్యుయేషన్‌‌‌‌తోనే విద్యార్థి ఏ అంశంలో వెనుకబడ్డాడో టీచర్‌‌‌‌కు తెలుస్తుందని అన్నారు. 

పేపర్లు దిద్దేందుకు టీచర్లు ఇతర బడులకు వెళ్తే పిల్లలకు పాఠాలు చెప్పేదెవరని ప్రశ్నించారు. ఎక్స్‌‌‌‌టర్నల్ మూల్యాంకనంలో తొందరపాటు వద్దని తపస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వొద్నాల రాజశేఖర్, పెంటయ్య అన్నారు.  సీసీఈ స్ఫూర్తికి విరుద్ధంగా తీసుకొచ్చిన ఈ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కటకం రమేశ్, అంజిరెడ్డి డిమాండ్ చేశారు.