కళా వైభవం: కరీంనగర్ ఫిలిగ్రీకి న్యూ లుక్!.. 450 ఏళ్ల కళాఖండాలకు జీఐ ట్యాగ్

కళా వైభవం:  కరీంనగర్ ఫిలిగ్రీకి న్యూ లుక్!.. 450 ఏళ్ల కళాఖండాలకు జీఐ ట్యాగ్

వెండి తీగను చేతిలోకి తీసుకుని.. దానికి కళాత్మకమైన మెలికలు తిప్పితే అద్భుతం ఆవిష్కృతమవుతుంది. అదే కరీంనగర్ ఫిలిగ్రీ. 450 ఏళ్ల చరిత్రను మోస్తున్న ఈ సున్నితమైన కళ నేడు కాలంతో పోటీ పడుతూ సరికొత్త రూపాల్లో ఒదిగిపోతోంది. 

గతంలో ఆధునిక ఆభరణాల పెట్టెలు, కేశాలంకరణ ఉపకరణాలు, రాఖీలు, నెమళ్లు, హంసలు, నమూనా పడవలతో సహా అలంకరణ వస్తువులు, పాన్​దాన్​​లు తయారుచేసేవారు. నేడు వెండి జువెలరీ, కార్పొరేట్ లోగోలు, మెమోంటోలను వెండి ఫిలిగ్రీ కళాకారులు తయారుచేస్తున్నారు.

 వెండి ధరలు పెరుగుతున్నా.. ప్రజల అభిరుచులు మారుతున్నా.. కరీంనగర్ వెండి ఫిలిగ్రీ కళ మాత్రం కాలానుగుణంగా కొత్త రూపాన్ని సంతరించుకుంటోంది. 450 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సంప్రదాయ కళ నేడు ఆధునిక ఆభరణాలు, కార్పొరేట్ లోగోలు, ఫ్యాషన్ యాక్సెసరీస్ వరకు విస్తరించింది.

450 సంవత్సరాల పురాతనమైన ఈ కళను కరీంనగర్ వెండి ఫిలిగ్రీ పనిని తర్కాసి అని కూడా పిలుస్తారు. కరీంనగర్ నుంచి10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్గందల్ కోట, మొఘలులు, వారి వారసులైన నిజాంల ఆయుధ తయారీ కేంద్రంగా ఉండేది. నాడు ఈ కోట వివిధ రకాల లోహ కళలు, చేతిపనులు చేసే కళాకారులకు కేంద్రంగా ఉండేది. వెండి ఫిలిగ్రీ కళకు కాలానుగుణంగా కొత్త రూపు వస్తోంది. 

సంప్రదాయ డిజైన్లకు ఆధునికతను జోడిస్తూ కళాకారులు వినూత్నమైన వెండి కళాఖండాలను రూపొందిస్తున్నారు. దీంతో కరీంనగర్ ఫిలిగ్రీకి దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ గుర్తింపు పెరుగుతోంది. గతంలో ధనవంతులు, ప్రముఖులు మాత్రమే కొనే ఫిలిగ్రీ కళాఖండాలు నేడు చిన్న జువెలరీల తయారీతో సామాన్యుల చెంతకు చేరింది. 

సీఎం నుంచి పీఎం దాకా..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిలను ప్రముఖులు, వివిధ దేశాల అధినేతలు, రాయబారులు, ఇతర సెలబ్రిటీలు కలిసినపుడు వారికి ఫిలిగ్రీ కళాఖండాలను బహుమతులుగా అందిస్తున్నారు. నంది విగ్రహాలు, రామప్ప, నెమలి కళాఖండాలను మెమోంటోలుగా అందిస్తూ ఫిలిగ్రీ కళను ప్రోత్సహిస్తున్నారు. హైదరాబాద్​లో గతంలో మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న అందాల రాణులకు సీఎం రేవంత్ రెడ్డి నెమలి బ్రోచ్​లను బహుమతిగా అందించారు.

ప్రధాని మెచ్చిన ఫిలిగ్రీ కళాఖండాలు

సిల్వర్ ఫిలిగ్రీ ఆఫ్ కరీంనగర్ హ్యాండీ క్రాఫ్ట్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అశోక్ వెండితో తయారుచేసిన పెన్నును ప్రధాని మోదీకి బహుమతిగా అందజేశారు. ఆ తర్వాత కరీంనగర్​లో జరిగిన సభలో ప్రధాని మోదీ ఫిలిగ్రీ కళాకారుల కళావైభవాన్ని మెచ్చుకున్నారు. 

జీ20 సదస్సులో పాల్గొన్న వివిధ దేశాల అధినేతలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెండితో తయారు చేసిన కోణార్క్ వీల్ బ్రోచ్​లను బహుమతిగా అందజేశారు. వెండి తీగలతో కళాకారులు తయారుచేసిన హ్యాండిక్రాఫ్ట్​ను వివిధ దేశాల అధినేతలు వారి జేబులు, టైలకు పెట్టుకున్నారు.

సిఫ్కా ఆవిర్భావం 

పురాతన ఫిలిగ్రీ కళ అంతరించిపోకుండా కాపాడుకునేందుకు బంగారం పనిచేసే కుటుంబాలు వారి పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు. ఫిలిగ్రీ కళాకారులు సభ్యులుగా కరీంనగర్ కేంద్రంగా సిల్వర్ ఫిలిగ్రీ ఆఫ్ కరీంనగర్ హ్యాండీ క్రాఫ్ట్ వెల్ఫేర్ సొసైటీ (సిఫ్కా)ఆవిర్భవించింది. ఈ సొసైటీలో 300 మందికి పైగా ఫిలిగ్రీ కళాకారులు సభ్యులుగా ఉన్నారు. 

కొత్త డిజైన్లు

మారుతున్న కాలాన్ని బట్టి కార్పొరేట్ లోగోలు, ఫ్యాషన్ డిజైన్లు, పెండెంట్స్, ఇయరింగ్స్, వడ్డాణం, బ్యాంగిల్స్, నెక్లెస్, లాంగ్ చైన్లు, వధూవరులకు కట్టే బాసింగం, పాపిటబిళ్లలు, గణేశ్ విగ్రహాలు, చార్మినార్, తాజ్ మహల్ బొమ్మలను వెండితో ఫిలిగ్రీ కళాకారులు తయారుచేస్తున్నారు. ప్రముఖులు, సెలబ్రిటీలు, సినీనటీనటులు కూడా ఫిలిగ్రీ కళాఖండాలను వివిధ శుభకార్యాల సందర్భంగా బహుమతులుగా అందిస్తున్నారు.

 వెండితో తయారు చేసే వాల్ హ్యాంగింగ్స్, నెమలి, ఫ్లవర్ వాజ్, శారీ పిన్స్, బుక్ మార్కర్స్ కూడా ఫిలిగ్రీ కళాకారులు తయారుచేస్తున్నారు. వివాహాల్లో పసుపు, కుంకమ భరిణలు రిటన్ గిఫ్టులుగా అందిస్తున్నారు. ఇలా ఒకటేమిటి పలు రకాల డిజైన్ల వెండి ఫిలిగ్రీ ఆభరణాలకు ఇటీవల డిమాండ్ పెరిగింది. 

అందుబాటు ధరల్లో ఫిలిగ్రీ కళాఖండాలు

వెండి ధరలు పెరిగినా ఫిలిగ్రీ కళాకారులు తయారుచేసే చిన్న జువెలరీ అందుబాటు ధరల్లో లభిస్తున్నాయి. వెయ్యి రూపాయల నుంచి పది లక్షల రూపాయల దాకా డిజైన్, మోడల్, సైజును బట్టి ఫిలిగ్రీ కళాఖండాలకు ధరలను నిర్ణయిస్తున్నారు.కస్టమర్లు కోరుకున్న విధంగా వివిధ రకాల ఫిలిగ్రీ కళాఖండాలను తయారుచేసి ఇస్తున్నామని సిల్వర్ ఫిలిగ్రీ ఆఫ్ కరీంనగర్ హ్యాండీ క్రాఫ్ట్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధి ఆకోజు వెంకటేష్ చెప్పారు. 

ఫిలిగ్రీ కళాఖండాల తయారీ ఇలా...

కరీంనగర్ ఫిలిగ్రీ కళాఖండాల తయారీ హ్యాండ్ మేడ్ కళ. ముందుగా వెండిని కరిగించి దాన్ని మిషన్​లో ఉంచి వెండి తీగలను పలుచగా తయారుచేస్తారు. ఆ వెండి తీగలను వంచి, మెలికలు తిప్పి వివిధ ఆకారాలు రూపొందిస్తారు. 

ఫిలిగ్రీ అనేది బంగారం, వెండి లేదా రాగితో సన్నని దారాలను మెలిపెట్టి, లేస్ వంటి తెరచి ఉన్న నమూనాల్లో తయారుచేసే ఒక సున్నితమైన, క్లిష్టమైన లోహపు పని. కళాకారులు సులభంగా వంగే లోహపు దారాలను కళాత్మకమైన చుట్టలుగా లేదా జిగ్-జాగ్ నమూనాలలోకి వంచి, అల్లుతారు. 

దృఢమైన లోహపు ఆధార పలకకు జోడించి, టంకం వేస్తారు. ఉంగరాలు, బ్రోచ్‌లు, చెవిపోగులు వంటి నగల తయారీ కోసం వీటిని ఉపయోగిస్తారు. చిన్న చిన్న వెండి తీగలతో సున్నితమైన డిజైన్లు తయారుచేస్తారు. మైనంపై వెండితీగలను చుట్టి వివిధ డిజైన్లను రూపొందిస్తారు. చివరగా కళాఖండాన్ని శుభ్రపరచి, మెరుగుపెట్టి అందంగా తీర్చిదిద్దుతారు.

 కళాకారులు ఫిలిగ్రీ కళాఖండాలను రూపొందిస్తే మహిళలు దీనికి తుది మెరుగులు దిద్దుతారు. అలా ఇంటిల్లిపాది ఫిలిగ్రీ కళాఖండాల తయారీ ద్వారా ఉపాధి పొందుతున్నారని సిల్వర్ ఫిలిగ్రీ ఆఫ్ కరీంనగర్ హ్యాండీ క్రాఫ్ట్ వెల్ఫేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి గద్దె అశోక్ కుమార్ చెప్పారు. 

ఫిలిగ్రీ కళాఖండాలకు జీఐ ట్యాగ్

కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ క్రాఫ్ట్ క్లస్టర్ 2007లో మేధో సంపత్తి హక్కుల రక్షణ, భౌగోళిక సూచిక (జీఐ ట్యాగ్) హోదాను పొందింది. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ ‘కరీంనగర్ జిల్లాకు ఒక జిల్లా ఒక ఉత్పత్తి’ అనే గుర్తింపును పొందింది. ఫిలిగ్రీ కళాఖండాలకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లభించడంతో వీటికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. 

ప్రపంచంలోనే ఫైనేస్ట్ వర్క్​గా పేరొందిన ఫిలిగ్రీ కళాఖండాలకు యునెస్కో గుర్తింపు ఉంది. వెండి దారాలతో హ్యాండ్ మేడ్ కళాఖండాల ఖ్యాతి విదేశాలకు చేరడంతో వీటిని ఎగుమతి చేసుకునేందుకు విదేశీయులు ఆసక్తి చూపిస్తున్నారు. అమెరికా, యూరప్ దేశాలకు ఫిలిగ్రీ కళాఖండాల ఎగుమతి సాగుతోంది. అరబ్ దేశాల్లోనూ వీటికి డిమాండ్ పెరిగింది. గల్ఫ్ దేశాలకు మక్కా, మదీనా, చంద్రుడు, ఖర్జూరచెట్లు, చేతి కడియాలను తయారుచేసి పంపిస్తున్నారు.

ఫిలిగ్రీ వెండి కళాఖండాల తయారీలో ఏఐను వినియోగించడం ద్వారా మెరుగైన అత్యంత అధునాతన మైన డిజైన్లను తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఫిలిగ్రీ కళాకారుడు, జాతీయ అవార్డు  గ్రహీత గద్దె అశోక్ కుమార్ చెప్పారు. టెక్నాలజీ సాయంతో తాము మౌల్డ్​లు తయారుచేసి ఫిలిగ్రీ కళాఖండాల తయారీ ప్రక్రియను మరింత మెరుగ్గా చేస్తామని ఆయన పేర్కొన్నారు.

కళాకారులకు అవార్డులు

ఫిలిగ్రీ వెండి కళాకారుల నైపుణ్యానికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పలు జాతీయ అవార్డులు ఇచ్చింది.కరీంనగర్ కు చెందిన కాదర్ల నారాయణ 1967లో ఈ ప్రాంతం నుంచి వెండి ఫిలిగ్రీలో తొలి జాతీయ అవార్డు పొందారు. అప్పటి నుంచి ఈ ప్రాంతానికి చెందిన 8 మంది ఫిలిగ్రీ కళాకారులకు జాతీయ అవార్డులు లభించాయి. 

ఆకోజు వెంకటేశ్వర్లు, ఆకోజు దయాకరాచారి, అర్రోజు అశోక్, అర్రోజు ధనలక్ష్మి,  సిల్వర్ ఫిలిగ్రీ విభాగంలో జాతీయ అవార్డులు పొందారు. గద్దె అశోక్ కుమార్1.5 కిలోల వెండితో పల్లకీ రూపొందించి జాతీయ అవార్డును  అందుకున్నారు. ఈ అవార్డులతో కరీంనగర్ వెండి ఫిలిగ్రీ  కళకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించింది. 

 గమనిక: లైఫ్​& లిటరేచర్​ పేజీకి వ్యాసాలు పంపాల్సిన మెయిల్​ ఐడీ  featureseditor@v6velugu.com