పల్లెల్లో పిల్ల బాటలన్నీ పెద్దబాటకు కలిసినట్టు ప్రతి ఇంటి గడపను అక్షర బంధం చేసి అన్నిటినీ మూటగట్టుకొని తమ సత్తువేంటో చూపడానికి సావడి కాడ ఈత సాప మీద గొంగడి పరుచుకొని కుమ్మరించిన బీసీ కులాల కళల తోరణం తేజ్. అవి అలుసైన అక్షరాలు కావు. అన్నం పెట్టి సమాజాన్ని నిలబెట్టిన మూల స్తంభాలు. పొద్దొక్కసారి సాయంత్రమొకసారి వికసించే సూర్యచంద్రికలు కావు. మరిగిన నెత్తురును పులిమిన మాడు చెక్కల వాసన తేజ్.
వనపట్ల సీమ నుండి దుబ్బరేగిన అక్షరమొలలతో ప్రశ్నల రేఖలను పదునైన గొంతుకతో ఎక్కుపెట్టి, అసెంబ్లీ, పార్లమెంట్ వేదికల శిఖరమై సాగుతున్న బీసీ వాద సాహితీ స్ఫురణకు చెకుముకి రాయి వనపట్ల సుబ్బయ్య. ఆయన తడారని గొంతులో దిగబడిన బీసీ కులాల నినాదం తేజ్ కవితా సంపుటిలో వరదలై పారింది. సమాజాన్ని మోపుగట్టుకుని మోసే బహుజనులు కొట్లాడే కత్తులు కావాలని, బీసీ రాజకీయ హక్కులకై విప్లవిస్తూ తన నెత్తురు నెరసుపై అలికిన అక్షర కౌముది ఈ తేజ్.
‘బావిలో ఊటెండి పోయినట్లు
చట్టసభల నీతి అడుగంటి పోయింది
వజ్రోత్సవాలైన నేనింకా
ప్రజా ప్రతినిధిని కాలేకపోయినందుకు
సిగ్గుపడుతున్న’
దేశ జనాభాలో అధిక మొత్తంలో ఉన్న బీసీల వాటా ప్రభుత్వాలు తేల్చడం లేదు. అసెంబ్లీనీ పార్లమెంటును చేతుల్లో మోస్తున్న మాకు రాజ్యాధికారం ఎప్పుడు అంటూ ఉద్యమ గీతం అందుకున్నాడు. పందిరి గుంజవే కానీ పందిరివి కారాదు/ కుర్చీకి కాలువే కానీ కుర్చీవి కారాదు అందుకే తేనెటీగలై లేవాలని బీసీ బిడ్డలకు మేలుకొలుపు రాగమై తిరుగుతున్నాడు.
ఉదయం ఉదయించటం మానేసినట్లు..
రాయడానికి మీకేమి సిగ్గు అనిపించడం లేదా రాజ్యాంగానికి వృద్ధాప్యం వచ్చిందా? అనే ప్రశ్నతో మొదలైన వాక్యం కావ్యం నిండా చురకత్తులై గుచ్చుతూనే ఉంటవి. అవి అధికార దాహము కాదు. అనధికార వేషమూ కాదు. అక్షరబద్ధమైన వాస్తవ స్ఫురణ. రాజకీయ నాయకుల కుటిల వేషాలను ఎండగట్టడానికి తేజ్ చక్రం పరిభ్రమించడం మొదలుపెట్టింది.
కమిషన్లు, డిక్లరేషన్లు, రిపోర్టులు, తీర్మానాలన్నీ పాడెల మీదేనా? అంటూ సాగిన అస్తిత్వ గర్జన శివుని గరళం లాంటిదే! బీసీల స్వప్నం సాధనకు మార్గాలు అన్వేషించిన వనపట్ల వస్తు వైవిధ్యంతో, సబ్బండ కులాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి సింగిల్ నినాదంగా తేజ్ ను నిలబెట్టాడు.
బీసీలు అంటే బానిసలు కాదు బహుజనులు అంటూ కొత్త నిర్వచనాన్ని శాస్త్రబద్ధం చేసి మేమెంతో మాకంత అనీ ఒట్టిపోయిన చేతులతో వొడవని చరిత్రను ఆశావాద దృక్పథంతో అంకుశమై పొడుస్తాడు. అంతరించి పోతున్న కులవృత్తులు, మిగిల్చుకున్న జ్ఞాపకాలను రగుల్సుకున్న ఆవేదనను చాలా కవితల్లో ప్రస్తావించారు. చాకలి, మంగలి, కమ్మరి, కంసాలి, గాజుల, గొల్ల, కురుమల గోడునంత వినిపిస్తూనే బహుజన నినాదానికి జెండా ఎత్తి కట్టిన పూలే వారసులను తలుచుకుంటాడు.
ఊరూరా ఉత్తరమై తిరిగి ఎద్దు గిట్టల్లా అరిగిన కాళ్లు చాకిరేవు పిలుపు మేలుకొలుపు రాగం ఎప్పుడూ కావాలనీ కోరుకుంటాడు. గ్లోబలైజేషన్ స్వైర విహారంతో చేతివేళ్లు విరిగి బావి దరులు కూలి ఒడ్డెక్కలేక పోతున్నం. అభ్యుదయపక్షమైన రాజకీయ పక్షమా! కాలానికి కాత పూత మేమే! అధికార సమతకై సామాజిక న్యాయాన్ని అడుగుతున్నాం.
మా కవాతు బ్యాక్వర్డ్ టు ఫార్వర్డ్. గతాన్ని వర్తమానాన్ని కలుపుకొని కవిత్వ పదమై మైలంటని మంగళి కత్తి అంటూ, ఇంకెప్పుడు మమ్మల్ని మేమే పాలించుకునేది? అన్న ప్రశ్నకు జవాబు వెతుకులాట కోసం తేజ్ కవితా సంపుటి ఆశల వెలుగులను చిగురింప చేస్తుంది.
‘మహాజన వెలుగు’ అనే కవితలో మనిషిని బహుకోణాల్లో చెక్కే ప్రయత్నం చేస్తాడు. దేశీయమైన పదజాలంతో పాఠకుణ్ణి పరిగెత్తించుటకు‘పనిముట్లకు పని చెప్తాం’ఈ శీర్షికన సాగిన కవిత్వం నిజంగా రంపపు కోతనే! ఒక్కో కుల వృత్తిని మాట్లాడించిన తీరు ఆకట్టుకుంటుంది.
‘బ్రహ్మంగారి ఆట’ పేరు కింద బుర్రకథను చెప్పే కళాకారులను పోతులూరి వీరబ్రహ్మేంద్ర జీవిత చరిత్రను అన్వయిస్తూ టీవీ సీరియల్ల ప్రభావం వల్ల గ్రామాల్లో జన సమైక్యత లేక ఎవరికి వారే యమునా తీరుగా బతుకుతున్నారని, కవిత్వం ఎంత రాస్తే అంతేకాదు ఎంత ఉపదేశమైతే అంత గొప్పదని వనపట్ల రుజువు చేశాడు.
‘అసెంబ్లీ సాక్షిగా’ అనే కవితలో మా రక్తంతో మూడు రంగుల జెండా నేసినం, ఆశలు కమురువాసనలు, రుధిరాన్ని నూనె చేసి బహుజన దీపాలను వెలిగిస్తాం, అన్నదమ్ముల సంతోషాలు అలుగెళ్ళినప్పుడు రాజకీయ దేవాలయంలో అమ్మలకు సంకెళ్ళా, బట్టల సింగిడి మీద పిట్టల ముచ్చట్లు, కొడవలి లేని కాపురం కోడలు లేని సంసారమే, కొడవలి లేని కాపుదనం కొడుకు లేని కన్నీళ్లే వంటి వాక్యాల్లో ఇదివరకు కవులు వాడిన భావానికంటే బిసీ వాదాన్ని బలంగా వినిపించడానికి సుబ్బయ్య వాడిన పోలికల భావం వేరుగా ఆలోచింపచేస్తాయి.
కవిత్వంలో చరిత్రను అన్వయిస్తూ సాగే సంగిశెట్టి శ్రీనివాస్ గారి విశ్లేషణ నిపుణతను చెప్తూ, అతడొక కరపత్రం/ ఒక సిద్ధాంతం/ ఒక భరోసా/ ఒక ధైర్యం ఒక ఎరుక/ చిన్న పదాలు కావు ఇవి బీసీ వాదానికి వారధిగా నిలబడిన సంగిశెట్టి దృక్పథాన్ని సాహితీ లోకానికి దర్పణమై చూపుతాడు.
- గన్నోజు ప్రసాద్
గమనిక: లైఫ్& లిటరేచర్ పేజీకి వ్యాసాలు పంపాల్సిన మెయిల్ ఐడీ
featureseditor@v6velugu.com
