ఢిల్లీలో నిర్భయ తరహాలో అమానుష ఘటన.. స్లీపర్ బస్సులో 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

ఢిల్లీలో నిర్భయ తరహాలో అమానుష ఘటన.. స్లీపర్ బస్సులో 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

ఢిల్లీ: ఢిల్లీలో అమానుష ఘటన జరిగింది. స్లీపర్ బస్సులో 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆగస్ట్ 4న రాత్రి ఈ దారుణం జరిగింది. 45 నిమిషాల పాటు రోడ్డుపై బస్సును తిప్పుతూ ఈ అరాచకానికి ఒడిగట్టారు. బస్సు డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్ను అరెస్ట్ చేసిన పోలీసులు బస్సును సీజ్ చేశారు.

బస్సును క్షుణ్ణంగా పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందని నిర్ధారించారు. బస్సు వెళ్లిన రూట్ సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలించారు. ఆగస్టు 4వ తేదీ రాత్రి ఢిల్లీలోని కాశ్మీర్ గేట్ ప్రాంతంలో ఖాళీగా ఉన్న స్లీపర్ బస్సులో 11వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

ఉత్తర ప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాకు చెందిన బాధిత బాలిక ఇంట్లో తల్లిదండ్రులతో గొడవ జరగడంతో నోయిడాలో ఉన్న తన కజిన్ దగ్గరకు వెళ్లేందుకు ఢిల్లీకి వచ్చింది. భారీ వర్షం, చిమ్మ చీకటిలో ఆమె పొరపాటున పరి చౌక్ దగ్గర బస్సు దిగింది. ఆ సమయంలో ఖాళీగా ఉన్న ఒక స్లీపర్ బస్సు అటు వైపుగా వెళుతుండగా ఆ అమ్మాయి బస్సును ఆపమని సైగ చేసింది. డ్రైవర్, కండక్టర్ తాము నోయిడా సెక్టార్ 63 వైపు వెళ్తున్నామని చెప్పి ఆమెను బస్సు ఎక్కించుకున్నారు.

రన్నింగ్ బస్సులో కండక్టర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత సదరు బాలికపై డ్రైవర్, కండక్టర్ ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రతిఘటించడానికి ప్రయత్నించిన బాలికను చంపేస్తామని బెదిరించారు.

నిందితులు ఆమెను అర్ధరాత్రి కాశ్మీర్ గేట్ బస్ టెర్మినల్ దగ్గర రింగ్ రోడ్డు సమీపంలో దింపి పారిపోయారు. బాధిత బాలిక కాశ్మీర్ గేట్ పోలీసులను ఆశ్రయించి, ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది. పోలీసులు తర్వాత తిమర్‌పూర్‌లోని ఒక బస్ పార్కింగ్ ప్రాంతంలో కుల్దీప్, సందీప్‌లను అరెస్టు చేశారు.