హనుమకొండ బస్ స్టేషన్ లో సౌకర్యాలు కరువు

హనుమకొండ బస్ స్టేషన్ లో సౌకర్యాలు కరువు

అంతర్జాతీయ ప్రమాణాలతో ఆకర్షణీయంగా ఉండాల్సిన బస్ స్టేషన్... కనీస సౌకర్యాలు లేక అధ్వాన్న స్థితికి చేరింది. పునరుద్ధరణ అనే మాట కాగితాలకే పరిమితమైంది తప్పా.... పైసా పని జరిగింది లేదు. ఏళ్లు గడుస్తున్నా బస్టాండ్ లో సౌకర్యాలపై దృష్టి పెట్టకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

వరంగల్ మహానగరం మధ్యలో ఉన్న హనుమకొండ బస్ స్టేషన్ లో కనీస సౌకర్యాలు లేవు. నిత్యం వేలాది మందితో రద్దీగా ఉండే బస్టాండ్ లో మినిమమ్ ఫెసిలిటీస్ లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్టేషన్ నిర్మాణం జరిగి సుమారు 40 ఏళ్లు దాటిపోయింది. అప్పటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ బస్ స్టేషన్ కట్టారు. ఇపుడు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు పెంచారు గానీ.. అందుకు తగ్గట్టుగా ఫ్లాట్ ఫామ్స్ నిర్మించలేదు. దీంతో ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. వర్షం వస్తే బస్ స్టేషన్ చెరువును తలపిస్తుంది. గుంతల్లో నీళ్లు నిలిచిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంతపెద్ద బస్టాండ్ లో తాగడానికి మంచినీటి సౌకర్యం కూడా లేదు. ఉన్న ఒక్క ట్యాప్ కూడా సరిగా పనిచేయదు. దాంతో వచ్చే బోరు నీళ్లు కూడా రావు. ఫ్యాన్లు, టీవీలు పని చేయవు. ముక్కు మూసుకోకుండా వాష్ రూమ్స్ కు వెళ్తే పరిస్థితి లేదు. 

సిటీ సెంటర్ లో ఉన్న బస్టాండ్ కు రోజూ 1500 బస్సులు వస్తూ పోతుంటాయి. 2 నుంచి 3 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. హైదరాబాద్ తర్వాత వ్యాపార, వాణిజ్య పరంగా వరంగల్ అభివృద్ధి చెందుతోంది. హాస్పిటళ్లు, మెడికల్ కాలేజీలు, షాపింగ్ మాల్స్, మార్కెట్లతో నగరమంతా ఎపుడూ రద్దీగా ఉంటుంది. ప్రతి 10 నిమిషాలకు హైదరాబాద్ కు ఓ బస్సు పూర్తి ఆక్యూపెన్సీతో వెళ్తుంది. పెళ్లిళ్లు, పండుగల సీజన్ వస్తే స్టేషన్ మొత్తం స్పెషల్ బస్సులు, ప్రయాణికులతో నిండిపోతుంది. సిటీకి సెంట్రల్ పాయింట్ అవడంతో హనుమకొండ బస్ స్టేషన్ ను స్మార్ట్ సిటీలో భాగంగా పునర్నిర్మించి.... ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో బహుళ అంతస్తులు నిర్మిస్తే అదనపు ఆధాయం వస్తుందని అంచనాలు వేశారు. కానీ అవేవి నెరవేరడంలేదు. స్మార్ట్ సిటీ కాలపరిమితి ఈ ఏడాదితో పూర్తవుతోంది. దీంతో.. బస్ స్టేషన్ రూపురేఖలు మారుతాయనేది కళగానే మిగిలిపోతుందుంటున్నారు.

హన్మకొండే కాదు.. వరంగల్ బస్ స్టేషన్ లోనూ ఇదే పరిస్థితి. భవనాలు శిధిలావస్థకు చేరుకున్నాయి. సరైన ప్లాట్ ఫామ్స్ లేవు. వరంగల్ ను స్మార్ట్ సిటీ కింద కేంద్రం ఎంపిక చేసింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ లో భాగంగా గ్రేటర్ లోని వరంగల్, హనుమకొండ, కాజీపేట బస్ స్టేషన్లను పునరుద్ధరించాలని ప్లాన్ చేశారు. కానీ ఏళ్లు గడుస్తున్నా పైసా పని జరిగింది లేదు.