- రైస్ మిల్లర్లు, వడ్ల కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కుమ్మక్కు
- క్వింటాల్‌కు 6 కేజీలకు పైగా తరుగు
- మిల్లుల్లోనూ మళ్లీ తరుగు తీస్తున్న మిలర్లు
- ఆగ్రహంతో రోడ్డెక్కుతున్న రైతులు
సైదాపూర్ మండలం సోమారం గ్రామంలో నిర్వహిస్తున్న ఐకేపీ సెంటర్ లో తేమశాతం 17 లోపే ఉన్నా బస్తా 43 కేజీల నుంచి 45 కేజీల వరకు తూకం వేస్తున్నారు. ఈ సెంటర్ లో ఈ నెల 4న ఓ రైతుకు చెందిన 80 బస్తాల(31.70 క్వింటాళ్లు) వడ్లను తూకం వేసి ఇదే మండలం దుద్దెనపల్లిలోని మణికంఠ రైస్ మిల్లుకు తరలించారు. 80 బస్తాల ధాన్యం పంపిస్తే మిల్లుకు వెళ్లాక 7 బస్తాలు కట్ చేసుకుని 73 బ్యాగ్స్ అని 29.20 క్వింటాళ్లకే ట్రక్ షీట్ ఇచ్చి ఏ గ్రేడ్ కు బదులు కామన్ కింద దిగుమతి చేసుకున్నారు. ఇదేమని రైతు అడిగితే.. తాలు, తరుగు, తేమ అని మిల్లర్ చెప్తున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
కరీంనగర్, వెలుగు: ధాన్యం కొనుగోలులో రైతులను వడ్ల కొనుగోలు సెంటర్ల నిర్వాహకులు, రైస్ మిలర్లు నిలువు దోపిడీ చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో 40 కేజీల బస్తాకు తరుగుపేరిట అదనంగా 3 కేజీలకు పైగా తూకం వేస్తున్నారు. రైస్ మిల్లుకు తీసుకెళ్లాక మిల్లర్లు కూడా తాలు పేరుతో కొర్రీలు పెడుతున్నారు. ఒక్కో ట్రాక్టర్ లోడ్‌పై 8 నుంచి 10 క్వింటాళ్లు కటింగ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కూలీల ఖర్చులు, టార్పాలిన్ల భారం కూడా రైతులపైనే పడుతోంది. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరిట దోపిడీ, ధాన్యం తరలించేందుకు లారీలు రాకపోవడాన్ని నిరసిస్తూ జిల్లాలో పలుచోట్ల రైతులు రోడ్డెక్కుతున్నారు.
కరీంనగర్ జిల్లాలో 319 వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ధాన్యం కొనుగోళ్లు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. ఈ యాసంగిలో జిల్లాలో 3 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేయాలని సివిల్ సప్లై ఆఫీసర్లు టార్గెట్ పెట్టుకున్నారు. కొన్ని సెంటర్లలో బస్తాకు 42 కేజీలు, 43 కేజీలు, కొన్నిచోట్లనయితే 43.5కిలోల చొప్పున తూకం వేస్తున్నారు. ఈ లెక్కన క్వింటాకు ఆరేడు కేజీల చొప్పున అదనంగా తూకం వేస్తున్నారు.
పైగా మిల్లులకు వెళ్లాక 100 క్వింటాళ్ల లోడుకు 7 నుంచి 8 క్వింటాళ్లను మిల్లర్లు మళ్లీ తరుగు తీస్తున్నారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఇదే రకమైన దోపిడీ ఉండేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గత రెండేళ్లు తరుగు లేకుండ కొనుగోళ్లు జరిగాయని, మళ్లీ ఇప్పుడు తరుగు పేరిట కోతలు విధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లారీల రాక సెంటర్లలోనే బస్తాలు..
వడ్ల కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన బస్తాలను తరలించేందుకు లారీలు రావడం లేదు. దీంతో తూకం వేసిన బస్తాలు రోజుల తరబడి కేంద్రాల్లోనే ఉంటున్నాయి. చాలా రైస్ మిల్లుల్లో గతంలో కేటాయించిన ధాన్యం నిల్వలు ఉండడంతో కొత్త లోడ్‌ను దించుకోవడం లేదు. ఆన్ లోడింగ్‌కు రోజుల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుండడంతో లారీలు, ట్రాక్టర్ ఓనర్లు ధాన్యం తరలింపునకు రావడం లేదు.
దీంతో చొప్పదండి మండలంలో వారంరోజులుగా తూకం వేసిన బస్తాలు కొనుగోలు కేంద్రాల్లోనే ఉన్నాయి. గంగాధరలోనూ ఇదే పరిస్థితి ఉంది. కొనుగోళ్లలో జాప్యం, తరుగు పేరిట దోపిడీకి నిరసనగా శుక్రవారం చొప్పదండి మండలం ఆర్నకొండలో రైతులు ఆందోళనకు దిగారు. లారీలు రాకపోవడంతో రైతులే సొంతంగా రూ.2 వేల వరకు కిరాయి ఇచ్చి బస్తాలను మిల్లులకు తరలిస్తున్నారు.
ధాన్యం కొనుగోళ్లను స్పీడప్ చేయండి
గంగాధర, వెలుగు: ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై కలెక్టర్ చిత్రామిశ్రా, అడిషనల్ కలెక్టర్‌శ్రీనివాస్‌రెడ్డి రంగంలోకి దిగారు. శుక్రవారం రాత్రి గంగాధర మండలం కురిక్యాలలో, చిగురుమామిడి మండల కేంద్రంలోని కొనుగోలు సెంటర్లను పరిశీలించారు. లారీలు, హమాలీల కొరత రాకుండా ధాన్యం కొనుగోళ్లను స్పీడప్ చేయాలని అధికారులను ఆదేశించారు.
