ఊపిరితిత్తుల్లోనూ కొవ్వు

ఊపిరితిత్తుల్లోనూ కొవ్వు

మామూలుగా రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండె పోటు వస్తుంటుంది. ఒక్కోసారి గుండె గోడలపైనా కొవ్వు పేరుకుపోతుంటుంది. దానికి ప్రధాన కారణం మన అలవాట్లే కారణం. కానీ, గుండె, కండరాలు, రక్తనాళాలే కాదు, ఊపిరితిత్తుల్లోనూ కొవ్వు పేరుకుపోతోంది. ఊబకాయుల్లోనే ఆ సమస్య ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని తొలిసారిగా ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్​ వెస్టర్న్​ ఆస్ట్రేలియా సైంటిస్టులు గుర్తించారు. 52 మంది చనిపోయిన వ్యక్తుల ఊపిరితిత్తులను పరిశీలించిన సైంటిస్టులు, ఊపిరితిత్తుల్లో అడిపోస్​ సెల్స్​ (కొవ్వు కణాలు) ఉన్నట్టు గుర్తించారు.

లంగ్స్​లోని 1,400 గాలి రంధ్రాలను వివిధ డైస్​తో సైంటిస్టులు పరిశీలించారు. లావు ఎక్కువ ఉన్నోళ్ల ఊపిరితిత్తుల గాలి రంధ్రాల గోడలపై అడిపోస్​ టిష్యూ (కొవ్వు కణజాలం) ఎక్కువగా పేరుకుపోయినట్టు తేల్చారు. దాని వల్ల వారి ఊపిరితిత్తుల రూపం మారిపోయిందని, కొందరి లంగ్స్​ వాచిపోయాయని, దాని ప్రభావంతో ఆయాసం, ఉబ్బసం వంటి జబ్బు సమస్యలను చనిపోయిన వాళ్లు ఎదుర్కొన్నారని వివరించారు. ఎక్కువ బరువు ఉండడం వల్ల లంగ్స్​పై ఒత్తిడి ఎక్కువగా పడుతుందని సైంటిస్టులు అంటున్నారు. అంతేగాకుండా లంగ్స్​ గాలి రంధ్రాల్లో  కొవ్వు పేరుకుపోవడం వల్ల లంగ్స్​ వాచిపోతాయని, గాలి లోపలికి రాకుండా, బయటకు వెళ్లకుండా రంధ్రాలు మూసుకుపోతాయని, దాని వల్ల ఆయాసం, ఉబ్బసం సమస్యలు వస్తున్నాయని నిర్ధారించారు. లావు తగ్గడం వల్ల ఊపిరితిత్తుల్లో కొవ్వును తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.