హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అక్రమాలు, కుంభకోణాలు బయటపెట్టిన బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గపు చర్య అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సింగరేణిపై వివాదస్పద వ్యాఖ్యల కేసులో జైలుకు వెళ్లిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను ములాఖత్‌లో భాగంగా గురువారం (జూన్ 4) చంచల్ గూడ జైల్లో కేటీఆర్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ బొగ్గు దోపిడీని ప్రశ్నిస్తే జైళ్లకు పంపుతున్నారని ఆరోపించారు.
గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రగతి భవన్‌ను బాంబులతో బద్దలు కొడుతామన్న రేవంత్ రెడ్డిది తప్పు కాదా.. అలాగే, మైనంపల్లి హన్మంత్ రావు నాటి మంత్రి హరీష్ రావును పెట్రోల్ పోసి తగలబెడతా అన్నది తప్పు కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అక్రమాలను ప్రశ్నిస్తే జర్నలిస్టులను కూడా జైళ్లకు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్క సుమన్ ధైర్యంగా ఉన్నాడని.. అతడికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. బాల్క సుమన్ అరెస్ట్‌పై న్యాయ పోరాటం చేస్తామన్నారు.
