- సోమవారం రాత్రి 9 గంటల నుంచి.. మంగళవారం రాత్రి 9 గంటల వరకు పంపిణీ
- ఇప్పటికే భారీగా తరలివచ్చిన ఆస్తమా రోగులు
- ఏర్పాట్లు చేసిన అధికారులు
బేగంబజార్, వెలుగు: మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నేటి నుంచి బత్తిని సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. హైదరాబాద్ఇన్చార్జి మినిస్టర్పొన్నం ప్రభాకర్, క్రీడలశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ఆస్తమా రోగులు తరలివస్తుండడంతో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. శనివారం నుంచే ఆస్తమా రోగులు వేల సంఖ్యలో వచ్చి ఎగ్జిబిషన్గ్రౌండ్స్పరిసరాల్లో వేచి ఉన్నారు.
ముందుగానే క్యూ లైన్లలో నిలబడి టోకెన్లు తీసుకుంటున్నారు. కాగా, చేప ప్రసాదం తయారీకి ముందు ఆనవాయితీగా నిర్వహించే సత్యనారాయణస్వామి వ్రతాన్ని ఆదివారం దూద్ బౌలీలోని బత్తిని ఇంట్లో నిర్వహించారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సతీమణి సంధ్యారాణి పాల్గొన్నారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి..
చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం సోమవారం రాత్రి 9 గంటలకు మొదలై.. మంగళవారం రాత్రి 9 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగుతుంది. దీని కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు ప్రకటించారు. 16 కౌంటర్లలో ఆస్తమా రోగులకు టోకెన్లు ఇచ్చి..35 కౌంటర్ల ద్వారా చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. 2 కౌంటర్లను వీఐపీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. క్యూ లైన్లు, తాగునీరు, హెల్త్క్యాంప్స్, భద్రతా పరంగా ఎక్కడా ఎలాంటి లోపం తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు.
