హైదరాబాద్, వెలుగు: ఎయిర్‌పోర్ట్ మెట్రో జనరల్ కన్సల్టెంట్(జీసీ) బిడ్‌లకు ఐదు ఇంజినీరింగ్ కన్సార్టియంలు అర్హత సాధించాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రీ-క్వాలిఫికేషన్ కోసం ఐదు కన్సార్టియంలు సమర్పించిన వాల్యుమినస్ డాక్యుమెంట్లు, డేటాను హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోలిమిటెడ్ సాంకేతిక బృందం పరిశీలించిందని తెలిపారు. ఆయా కంపెనీల సాంకేతిక సామర్థ్యాలు, ఆర్థిక ప్రొఫైల్‌ను అంచనా వేసినట్లు చెప్పారు. ప్రాజెక్ట్‌ల సంఖ్య, పరిమాణం, టెండర్ డాక్యుమెంట్ తయారీలో వారి అనుభవం, డీపీఆర్ సమీక్ష, ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ రికార్డ్, ప్రాజెక్ట్ మానిటరింగ్ కన్సల్టెన్సీ, వివరణాత్మక ఇంజినీరింగ్ డిజైన్‌ల ప్రూఫ్ చెకింగ్ వంటివి అంచనా వేశామని తెలిపారు. వీటన్నింటి ఆధారంగా మొత్తం ఐదు కన్సార్టియంలు చివరి రౌండ్ బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించాయని వెల్లడించారు. ఈ బిడ్ పత్రాలన్ని కన్సార్టియంలకు జారీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. తమ బిడ్‌లను వచ్చే ఏడాది జనవరి 20వ తేదీలోగా సమర్పించాలన్నారు.

