వరద నీటిలో పంపు హౌస్ మోటార్లు

వరద నీటిలో పంపు హౌస్ మోటార్లు

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరికి వరద పోటెత్తింది. కాళేశ్వరం ప్రాజెక్టుల గెట్లన్నీ ఎత్తాల్సి వచ్చింది. ఎన్నడూ లేనంతగా కాళేశ్వరం బ్యాక్​వాటర్​తో ఊర్లు, పట్టణాలు నీట మునిగాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. పలువురు వరదలో గల్లంతయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని పంప్​హౌసుల్లోకి నీరు చేరి మోటార్లు వరద నీటిలో మునిగి తీవ్ర నష్టం వాటిల్లింది. సాధారణంగా రైతుల బావి మోటార్లు వరదలో తడిసినప్పుడు కండక్టర్‌‌ మొత్తం తీసివేసి రీ-వైండింగ్‌‌ చేయించాల్సి వస్తుంది. ఒండ్రు కాకుండా మంచినీళ్లలో పంపుసెట్టు మునిగితే దాని భాగాలు వీడదీసి, ఆరబెట్టి తిరిగి వార్నీష్‌‌ వేసి, వేడి చేసి పని నడిపిస్తారు. కాళేశ్వరం పంపు హౌసుల్లోని మోటార్లు వరద నీటిలో మునిగాయి. కాబట్టి కచ్చితంగా వాటికి ఒండ్రు పడుతుంది. అది పంపుసెట్లలో ఉన్న రాగి కండక్టర్‌‌ను అతుక్కొని దెబ్బతీస్తుంది. ఈ మోటార్లు కాకుండా మిగతా ఎలక్ట్రానిక్​ బోర్డులు, విద్యుత్‌‌ పరికరాలు, స్విచ్చులు పాడైపోతాయి. వాటన్నిటిని మార్చి కొత్తవి పెట్టాల్సిందే. వరదలకు ఆస్కారం లేకుండా పంప్​హౌస్​నిర్మాణం జరిగి ఉండాల్సింది. ఇందులో ఇంజనీర్ల డిజైన్ ​లోపం కనిపిస్తోంది. మోటార్లు సహా పంపింగ్​ వ్యవస్థ మొత్తం పాడై కోట్ల రూపాయల నష్టం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్ట్​లకు 4,627.24 మెగావాట్ల విద్యుత్‌‌ అవసరం. ఇంత భారీ విద్యుత్‌‌ వినియోగించే పంపులను ఎంత జాగ్రత్తగా, ఎంత సురక్షిత ప్రాంతాల్లో అమర్చాలి? కానీ ప్రభుత్వం ఆ పని చేయలేదు. పైగా పంపులు నీట మునగడంపై ఇంజనీర్లు నిర్లక్ష్యంగా మాట్లాడటం హాస్యాస్పదం. 2020లో కల్వకుర్తి పంపుహౌస్​నీట మునిగి కోట్లాది రూపాయల నష్టం జరిగింది. వాటిని బాగు చేయడానికి చాలా సమయం పట్టింది. కన్నెపల్లి, అన్నారం పంపుహౌస్‌‌‌‌‌‌‌‌లకు ప్రమాదం పొంచి ఉందని నిపుణులు ముందే హెచ్చరించినట్లు తెలుస్తోంది. కానీ ప్రభుత్వం, అధికారులు మేల్కొనలేదు. 

రీడిజైన్ల పేరుతో..
టీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత ప్రాజెక్టులను రీడిజైన్‌‌ చేసింది. ప్రాణహిత-చేవేళ్లను కాళేశ్వరం పథకంగా, పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుంచి శ్రీశైలానికి మార్చి రీడిజైన్‌‌ చేసింది. గోదావరిపై రాజీవ్‌‌సాగర్‌‌, ఇందిరా సాగర్‌‌ ప్రాజెక్టులను సీతారామ సాగర్‌‌ ప్రాజెక్టులుగా మార్చింది. గత ప్రాజెక్టు అంచనాలు బాగా పెరిగాయి. రూ.38,500 కోట్ల ప్రాణహిత ప్రాజెక్టు రీ డిజైన్‌‌ తరువాత రూ.1.15 లక్షల కోట్ల అంచనా వ్యయానికి పెరిగింది. బడ్జెట్‌‌నిధులేగాక, కార్పొరేషన్‌‌ ఏర్పాటు చేసి బ్యాంకుల నుంచి, సంస్థల నుంచి ప్రభుత్వం అప్పులు తెచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు దాదాపు 4700 మెగావాట్లు విద్యుత్‌‌ అవసరం కాగా, ఈ ప్రాజెక్టుకు14 పంపు హౌస్‌‌లు నిర్మాణం చేయాలి. ఒక్కో హౌస్‌‌లో 3 నుంచి12 పంపుసెట్లు పెట్టాలి. అందులో ఒకటి స్టాండ్‌‌బై ఉండాలి. కానీ ఈ ఏర్పాట్లు ఏవీ పూర్తి కాలేదు. అన్ని పంపుసెట్లు పని చేసినప్పుడు నెలకు వేల కోట్లలో కరెంటు బిల్లు వస్తుంది. బిల్లు చెల్లించకుంటే పంపుసెట్లు ఆగిపోతాయి. టెక్నికల్‌‌ అడ్వయిజరీ కమిటీ సూచన ప్రకారం.. కాస్ట్‌‌ బెనిఫిట్‌‌ రెషియో1:10 ఉండాలి. 10కి మించరాదు. కానీ ఎకరాకు 30 వేల రూపాయలకుపైగా ప్రభుత్వం ఖర్చు చేసి సాగునీటి వసతి కలిపిస్తే గిట్టుబాటు రాదని సెంటర్‌‌ వాటర్‌‌ కమిషన్‌‌ అభ్యంతరం చేప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టులో గోదావరి నీటిని100 మీటర్ల ఎత్తు నుంచి 530 మీటర్ల ఎత్తుకు పంపు చేయాలి. 

పాలమూరు ఎత్తిపోతల..
పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం జూరాల నుంచి 255 కిలోమీటర్ల దిగువన శ్రీశైలంలోకి మార్చింది. మొదట రూ.12 వేల కోట్ల అంచాన వ్యయం గల ప్రాజెక్టు రూ.48 వేల కోట్లకు చేరింది. 120 టీఎంసీలను లిఫ్ట్ చేసి అందులో 30 టీఎంసీలను హైదరాబాద్‌‌కు తాగునీటికి మళ్లించాలి. మిగిలిన 90 టీఎంసీలతో మహబూబ్‌‌నగర్‌‌, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలోని 12.30 లక్షల ఆయకట్టు నీటి సౌకర్యాం కల్పించాలి. కల్వకుర్తి ఎత్తిపోతల, పాలమూరు ఎత్తిపోతల లిప్ట్‌‌ పంపులు ఒకే చోట నుంచి అంటే.. రేగుమానుగడ్డ నుంచి ప్రారంభించాలి. రోజుకు 5 టీఎంసీలు లిప్ట్‌‌ చేయాలి. ఇంత భారీ ప్రాజెక్టు ఇంతవరకు 30 శాతం కూడా పూర్తి కాలేదు. దీనికి తోడు కృష్ణా, గోదావరి బోర్డులు ఏర్పాటు చేసి కేంద్రం అనుమతి లేకుండా ప్రాజెక్టులు నిర్మించవద్దని చెప్పింది. ఇప్పటికే తవ్విన మేజర్‌‌ కాలువలు, పంపుసెట్ల నిర్మాణాలు నాణ్యత లేకుండా ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం పాలమూరు పనులు నత్తనడకన నడుస్తున్నాయి. 250 మీటర్ల నుంచి లక్ష్మీదేవపల్లికి 675 మీటర్ల ఎత్తుకు నీటిని పంపు చేయాలి. సీతారామసాగర్‌‌ ప్రాజెక్టుకు గోదావరి వద్ద ఇంత వరకు లిప్ట్‌‌ ఏర్పాటు చేయలేదు. 4 లక్షల ఎకరాలకు బదులు 6.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇస్తామని ప్రభుత్వం రీ-డిజైన్‌‌లో చెప్పింది. 120 మీటర్ల నుంచి 550 మీటర్ల ఎత్తుకు లిప్ట్‌‌లు చేయాలి. ఈ పథకాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తే 20 ఏండ్లు పని చేస్తాయి. ఆ తరువాత తప్పని సరిగా ఇప్పటి అంత పెట్టుబడి పెట్టి రీపేర్లు చేయాలి. లేదంటే అవి మూలకుపడతాయి. 

బాధ్యతను విస్మరించిన వారి.. 
రాష్ట్రంలో లిఫ్ట్​ స్కీంలకు మొత్తంగా13 వేల మెగావాట్ల విద్యుత్‌‌ అవసరం. దీన్ని బట్టి విద్యుత్‌‌ లేకుండా ఏ పథకం జరగదని అర్థమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వం విద్యుత్‌‌ చార్జీల పేరుతో వేల కోట్లు భారం వేస్తోంది. దానికి తోడు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మరిన్ని కోట్లు భరించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ భారమంతా ప్రజలు పన్నుల ద్వారా చెల్లించాల్సిందే. ప్రభుత్వం, అధికారులు ప్రజల ఆస్తులకు నష్టం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వరదలు వస్తుంటే ముందస్తు చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తుంటే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి. గతంలో శ్రీశైలానికి వరద వచ్చినప్పుడు గేట్లు ఎత్తాలని నీటిపారుదల శాఖ మంత్రికి చెప్పినప్పటికీ వినకపోవడం వల్ల వరద ఎదురు తన్ని కర్నూల్‌‌ పట్టణం పూర్తిగా వరద, బురుదతో నిండిపోయింది. ఆ పట్టణం బాగు కావడానికి 6 మాసాలు పట్టింది. కాళేశ్వరం పంపు హౌస్​లు మునగడంలో ఇంజనీరింగ్​ లోపం, ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఈ నష్ట్రాన్ని బాధ్యతను విస్మరించిన వారి నుంచే రాబట్టాలి. 
సారంపల్లి మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు, ఆలిండియా కిసాన్​ సభ