నిద్ర పడతలేదా?

నిద్ర పడతలేదా?

ఎన్ని సమస్యలున్నా, ఎంత ఒత్తిడి ఉన్నా రాత్రి మంచిగా నిద్రపోతే చాలు.. అంతా హుష్​ కాకి. నిద్రకు ఉన్న పవర్ అలాంటిది. ఒక్కమాటలో చెప్పాలంటే నిద్ర నేచర్ ఇచ్చిన గిఫ్ట్. అలాంటిది ఆ నిద్ర పట్టడమే పెద్ద సమస్యగా మారింది ఇప్పుడు. ఈ సమస్యను తగ్గించేదెలా? హాయిగా నిద్ర పట్టాలంటే ఏం చేయాలో చెప్తున్నారు సైకియాట్రిస్ట్ జ్యోతిర్మయి. 

స్లీప్ డిజార్డర్స్‌‌లో చాలా రకాలున్నాయి. అందులో ఇన్‌‌సోమ్నియా(నిద్రలేమి) అనేది ఈమధ్య కామన్‌‌గా కనిపిస్తున్న సమస్య. ఇది రకరకాల మానసిక సమస్యల వల్ల రావచ్చు. ఇన్‌‌సోమ్నియాలో.. కొందరికి నిద్ర పట్టకపోవడమే ప్రాబ్లమ్. మరికొందరికి నిద్ర వెంటనే పడుతుంది. కానీ, ఎక్కువసేపు నిద్రపోలేరు. మధ్యలోనే నిద్ర డిస్టర్బ్ అవుతుంది. ఇంకొందరికి తెల్లవారుజామున మెలకువ వచ్చి, ఆ తర్వాత నిద్ర పట్టదు. ఉదయం లేవగానే అలసటగా ఉంటుంది. ఇలా సమస్య రకాన్ని బట్టి అదెలాంటి స్లీప్ డిజార్డర్ అనేది తెలుసుకోవచ్చు. 

కారణాలు ఇవే..

నిద్ర పట్టట్లేదని వచ్చిన వాళ్లకు ముందు ఏవైనా మానసిక సమస్యలు ఉన్నాయేమో అడిగి, తెలుసుకుంటాం. ఒత్తిడి, యాంగ్జయిటీ, డిప్రెషన్, స్కిజోఫ్రీనియా(మనో వైకల్యం) లాంటి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఇన్‌‌సోమ్నియా ఎక్కువగా వస్తుంటుంది. దీర్ఘకాలిక గుండె సమస్యలు, లివర్ సమస్యలు, లంగ్స్ సమస్యలు కూడా ఇందుకు కారణమవ్వొచ్చు. అలాగే కెఫిన్, ఆల్కహాల్ లాంటివి ఎక్కువగా తీసుకోవడం, లైఫ్‌‌స్టైల్ మారడం వల్ల కూడా నిద్ర సమస్యలు వస్తుంటాయి.

నిద్ర సమస్యలు ఉన్నవాళ్లు చెప్పిన లక్షణాలను బట్టి అదెలాంటి స్లీప్ డిజార్డర్ అనేది తెలుసుకోవచ్చు. అలా తెలుసుకోలేకపోతే ‘పాలీసోమ్నోగ్రఫీ’ టెస్ట్ చేస్తారు. ఇదొక స్లీప్ స్టడీ. ఇందులో నిద్ర క్వాలిటీ, బ్రెయిన్ యాక్టివిటీ, హార్ట్ రేట్, బీపీ చెక్ చేస్తారు. మానసిక సమస్యల వల్ల డిజార్డర్ వస్తే కౌన్సెలింగ్ హెల్ప్ చేస్తుంది. లేదంటే మందులు వాడాల్సి ఉంటుంది.

ఇలా చేయాలి

లైఫ్‌‌స్టైల్ మారడం వల్ల యూత్‌‌లో ఇన్‌‌సోమ్నియా ప్రాబ్లమ్ ఎక్కువగా కనిపిస్తుంది. నిద్ర పట్టడం కష్టంగా ఉన్నవాళ్లు ఆల్కహాల్, కాఫీ అలవాటుంటే మానేయాలి. మధ్యాహ్నం మూడింటి తర్వాత కాఫీ, టీ లేదా ఆల్కహాల్‌‌ తీసుకోకూడదు. సాయంత్రం దాటాక ఎక్సర్​సైజ్​ చేయకూడదు. రాత్రిళ్లు మొబైల్, టీవీలకు దూరంగా ఉండాలి. బ్రెయిన్‌‌కు అలసట తెప్పించే పనులు అంటే... పుస్తకాలు చదవడం, రాయడం లాంటివి చేయాలి. నిద్ర వచ్చినప్పుడే బెడ్‌‌పైకి వెళ్లాలి. అలాకాకుండా బెడ్​ మీద పడుకుని నిద్ర కోసం ఎదురుచూడొద్దు. ఇలా చేయడం వల్ల బ్రెయిన్ యాక్టివ్‌‌  అవుతుంది. స్లీప్ డిజార్డర్స్ ఉన్నవాళ్లు బ్రేక్‌‌ఫాస్ట్ , లంచ్, డిన్నర్ రోజూ ఒకే టైంకు తినాలి. డిన్నర్ ఎర్లీగా చేయాలి. లైట్ ఫుడ్ తినాలి. జంక్ ఫుడ్, స్వీట్స్ తినొద్దు. షుగర్ ఎక్కువైనా నిద్రపై ఎఫెక్ట్ పడుతుంది. ఇన్‌‌సోమ్నియా కొన్ని రోజుల పాటు మాత్రమే ఉంటే ట్రీట్మెంట్ అవసరం లేదు. రెండు మూడు వారాల కంటే ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్‌‌‌‌ను కలవాలి.

రకాలెన్నో...

స్లీప్ డిజార్డర్స్‌​లో ఇంకొన్ని రకాలు కూడా ఉన్నాయి. నిద్రలో గురక రావడం, నిద్ర మధ్యలో కొన్ని సెకండ్ల పాటు శ్వాస ఆగిపోవడం వల్ల నిద్ర డిస్టర్బ్ అవుతుంటే దాన్ని స్లీప్ ఆప్నియా అంటారు. దీనికి ప్రత్యేకమైన ట్రీట్మెంట్​, మెడిసిన్స్ ఉన్నాయి. నిద్ర పోయేటప్పుడు కాళ్లలో దురదగా అనిపిస్తుంటుంది కొంతమందికి. దానివల్ల కాళ్లను అదేపనిగా ఊపుతుంటారు. దీన్నే ‘రెస్ట్‌‌లెస్‌‌ లెగ్‌‌ సిండ్రోమ్‌‌’ అంటారు. దీన్ని ఎక్సర్‌‌‌‌సైజులు, థెరపీలతో తగ్గించొచ్చు.

నార్కోలెప్సీ అనే మరో రకమైన స్లీప్​ డిజార్డర్‌‌‌‌లో పగటి పూట మత్తుగా ఉంటుంది. రాత్రిళ్లు నిద్ర సరిగా పట్టక పగటిపూట మగతగా అనిపిస్తుంది. ఇదొక బ్రెయిన్ డిజార్డర్. మెదడుకి స్లీప్ సైకిల్‌‌ను కంట్రోల్ చేసే శక్తి తగ్గుతుంది. దీన్ని మెడిసిన్స్ ద్వారా తగ్గించొచ్చు. పగటిపూట నిద్రపోవడం, రాత్రిళ్లు మెలకువతో ఉండడం వల్ల శరీరంలోని బయోక్లాక్ దెబ్బతింటుంది. దీన్ని ‘సర్కేడియన్ రిథమ్ స్లీప్ డిజార్డర్’ అంటారు. షిఫ్ట్ జాబ్స్ చేసేవాళ్లలో ఇది ఎక్కువ. థెరపీలు, లైఫ్‌‌స్టైల్ మార్పులతో దీన్ని తగ్గించొచ్చు. పారాసోమ్నియా అనే మరో అరుదైన స్లీప్ డిజార్డర్‌‌‌‌.. పిల్లల్లో ఎక్కువగా వస్తుంటుంది. నిద్రలో నడవడం, పీడకలలు రావడం వల్ల నిద్రలో లేచి షాక్ అవుతుంటారు. దీన్ని కొన్నిరకాల థెరపీల ద్వారా తగ్గించొచ్చు.

వయసుతోపాటు..

వయసు పెరగడం వల్ల కూడా నిద్ర సమస్యలు పెరుగుతాయి. చిన్న పిల్లలు12 నుంచి 16 గంటలు నిద్రపోతారు. వయసు పెరిగే కొద్దీ నిద్రపోయే టైం తగ్గుతుంటుంది. అయితే కనీసం ఆరు గంటల నిద్ర అవసరం. వయసు పెరిగే కొద్దీ వచ్చే శారీరక, మానసిక సమస్యల ప్రభావం ముందుగా నిద్రపైనే పడుతుంది. అలాగే ఈ మధ్య కాలంలో వయసు పైబడిన వాళ్లలో డిప్రెషన్, ఒత్తిడి, ఒంటరితనం, బోర్‌‌‌‌గా ఫీలవ్వడం, పోస్ట్ రిటైర్మెంట్ స్ట్రెస్ లాంటివి ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి వాళ్లకు కౌన్సెలింగ్ సరిపోతుంది.

డా. జ్యోతిర్మయి.కె, కన్సల్టెంట్​ సైకియాట్రిస్ట్​ హైదరాబాద్