సీఎం సీట్లో వరుసగా నాలుగోసారి

సీఎం సీట్లో వరుసగా నాలుగోసారి

నితీష్ కుమారే మా సీఎం:బీజేపీ క్లారిటీ

దీపావళి తర్వాత నితీశ్ ప్రమాణం

125 సీట్లు సాధించిన ఎన్డీయే

110 స్థానాలకే  పరిమితమైన మహాకూటమి

పాట్నా: బీహార్ సీఎం ఎవరనే దానిపై క్లారిటీ వచ్చింది. జేడీయూ తక్కువ సీట్లకే పరిమితం కావడంతో నితీశ్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారా? లేదా? అనే కన్ఫ్యూజన్​కు తెరపడింది. ఎన్డీయే సీఎం అభ్యర్థి నితీశే అని ఎన్నికలకు ముందు చెప్పిన బీజేపీ.. ప్రభుత్వ పగ్గాలు ఆయనకే అప్పగిస్తామని తాజాగా మరోమారు స్పష్టం చేసింది. దీపావళి తర్వాత నితీశ్ ప్రమాణ స్వీకారం చేస్తారని జేడీయూ ప్రకటించింది. దీంతో వరుసగా నాలుగోసారి నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.

మద్దతుగా నిలిచిన బీజేపీ

2015లో జేడీయూకు 71 సీట్లు రాగా.. ఇప్పుడు 43 సీట్లకే పరిమితమైంది. తమకన్నా తక్కువ సీట్లు వచ్చినా నితీశ్ కుమార్​కు బీజేపీ మద్దతుగా నిలిచింది. ‘‘కూటమిలో.. అన్ని పార్టీలు సమానంగా సీట్లు గెలవలేవు. ఎవరు ఎక్కువ సీట్లు గెలిచారనేది అప్రస్తుతం. ప్రజలు ఎన్డీయేకు ఓటేశారు. జేడీయూ గెలుపులో బీజేపీ ముఖ్యపాత్ర పోషించింది. బీజేపీ గెలుపులో జేడీయూది కీ రోల్. జేడీయూ, బీజేపీ, వీఐపీ, హెచ్ఏఎం కలిసికట్టుగా పని చేశాయి.. విజయం సాధించాయి” అని బీజేపీ నేత, డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ చెప్పారు. ప్రజల తీర్పులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదన్నారు. ‘‘నితీశ్ కుమార్ నాయకత్వంలో ఎన్డీయే గెలిచింది. ఇప్పటికే నితీశ్​కు బీజేపీ లీడర్​షిప్ మద్దతు తెలిపింది. లాభమా, నష్టమా అనేది ఇప్పుడు ముఖ్యం కాదు. బీహార్​లో.. ఎన్డీయే కలిసికట్టుగా పోరాడింది” అని హెచ్ఏఎం నేత జితన్ రామ్ మాంఝీ చెప్పారు.

దిగ్విజయ్ ఎద్దేవా

నితీశ్​కు తక్కువ సీట్లు రావడంపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఎగతాళి చేశారు. ‘‘నితీశ్ జీ.. బీహార్ మీకు చాలా చిన్నదిగా మారింది. మీరు ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్​లోకి రావాలి” అని ట్వీట్ చేశారు. దీనిపై బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ ఫైర్ అయ్యారు. ‘‘నితీశ్ కుమార్ ఎన్డీయే నేత. లాభం లేదా నష్టం.. ఆయన స్థాయిని ప్రభావితం చేయదు. తేజస్వీ యాదవ్ ఏం సాధించారు? నితీశ్​కు వ్యతిరేకంగా మాట్లాడారు. ఇప్పుడు బీహార్ ప్రజలు తేజస్వీకి రెస్ట్ ఇచ్చారు. దిగ్విజయ్ తన సొంత రాష్ట్రం గురించి ఆలోచిస్తే మంచిది” అని చురకలంటించారు.

3 సీట్లు ఎక్కువే

బీహార్ అసెంబ్లీ సీట్ల సంఖ్య 243. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 122 సీట్లు సాధించాలి. ఎన్డీయే 125 సీట్లు గెలిచి మెజారిటీ సాధించింది. ఇందులో బీజేపీ 74, జేడీయూ 43, హెచ్ఏఎం 4, వీఐపీ 4 సీట్లు సాధించాయి. ఇక మహాకూటమి 110 సీట్లు గెలుచుకుంది. 75 సెగ్మెంట్లలో గెలిచిన ఆర్జేడీ.. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. కానీ భాగస్వామి కాంగ్రెస్ అనుకున్నంత మేర సక్సెస్ కాకపోవడంతో మెజారిటీ మార్క్​ను చేరుకోలేకపోయింది. అయితే గత లోక్​సభ ఎన్నికలతో పోలిస్తే ఆర్జేడీ భారీగా పుంజుకుంది. ఇక మహాకూటమిలోని సీపీఐఎంఎల్ మాత్రం 12 సీట్లు సాధించింది. సీపీఐ రెండు, సీపీఎం రెండు సీట్లు సాధించాయి. మజ్లిస్ ఐదు సీట్లలో, బీఎస్పీ, ఎల్జేపీ ఒక్కో స్థానంలో గెలిచాయి. రాఘోపూర్​లో తేజస్వీయాదవ్ 38,174 మెజారిటీతో, హసన్​పూర్​లో తేజ్ ప్రతాప్ యాదవ్ 21,139 గెలిచారు. మాజీ షూటర్, కామన్​వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ శ్రేయాసి సింగ్(బీజేపీ) 41 వేల మెజారిటీ సాధించారు.

12 ఓట్లతో గెలిచిన జేడీయూ క్యాండిడేట్

హిల్సా సీటు నుంచి పోటీ చేసిన జేడీయూ అభ్యర్థి కృష్ణకుమారి శరణ్ అలియాస్ ప్రేమ్ ముఖియా 12 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ప్రేమ్​కు 61,848 ఓట్లు రాగా, ఆర్జేడీ అభ్యర్థి ఆత్రి ముని అలియాస్ శక్తి సింగ్ యాదవ్​కు 61,836 ఓట్లు వచ్చాయి. అయితే మంగళవారం రాత్రి 10 గంటల దాకా రిజల్ట్ ఇవ్వకపోవడంపై ఆర్జేడీ ఆరోపణలు చేసింది. ‘‘547 ఓట్లతో శక్తి సింగ్ గెలిచారని రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు. గెలిచినట్లు సర్టిఫికెట్ ఇస్తామని చెప్పారు. కానీ సీఎం నుంచి ఫోన్ రాగానే మాట మార్చారు. పోస్టల్ బ్యాలెట్లు రద్దు చేయడంతో ఆర్జేడీ అభ్యర్థి 13 ఓట్లతో ఓడిపోయినట్లు ప్రకటించారు” అని ఆర్జేడీ ఆరోపించింది.

ఎన్డీయేకి ప్రజలు మద్దతిచ్చారు: పళనిస్వామి

ఎన్డీయేకి బీహార్ ప్రజలు తమ సంఘీభావాన్ని కొనసాగించారని తమిళనాడు సీఎం పళనిస్వామి ట్వీట్ చేశారు. ‘‘సుపరిపాలన అభివృద్ధి వైపు దారి చూపుతుంది. ఎన్డీయే కూటమికి నా హృదయపూర్వక అభినందనలు. బీహార్ ప్రజలకు శుభాకాంక్షలు” అని పేర్కొన్నారు.

7లక్షల మంది ‘నోటా’కు..

బీహార్‌‌ అసెంబ్లీ ఎలక్షన్స్‌‌లో ‘నన్‌‌ ఆఫ్‌‌ ది ఎబోవ్‌‌(నోటా)’కు 7,06,252 ఓట్లు పోలయ్యాయని ఈసీ బుధవారం ప్రకటించింది.  బీహార్‌‌‌‌లోని 243 స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 4 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా వారిలో 1.7 శాతం మంది నోటాకు ఓటు వేశారు. బీహార్‌‌‌‌లోని చాలా చోట్ల కేండిడేట్ల కంటే నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చాయని అధికారు లు చెప్పారు. ఎన్నికల్లో  పోటీ చేసిన కేండిడేట్లలో ఎవరికీ ఓటు వేసేందుకు ఇష్టంలేని పక్షంలో ఓటర్‌‌‌‌ నోటా మీటను నొక్కి తన ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. సుప్రీం ఆదేశాల మేరకు 2013లో దీన్ని అమలు చేశారు.