గిరిజనుల కోసం  న్యూట్రిషన్ ప్లాన్

గిరిజనుల కోసం  న్యూట్రిషన్ ప్లాన్
  • కార్యాచరణ రూపొందించాలని గవర్నర్ తమిళిసై ఆదేశం

హైదరాబాద్, వెలుగు: గిరిజనుల్లో పోషకాహార స్థాయిని పెంచాలని, అందుకు న్యూట్రిషన్ ప్లాన్ రూపొందించాలని రాజ్ భవన్ అధికారులను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశించారు. పోషకాహార లోపం వల్ల గిరిజనులు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని శనివారం రాజ్ భవన్​అధికారులతో జరిగిన రివ్యూలో ఆమె గుర్తుచేశారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్ జిల్లాల్లో, మరికొన్ని జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో రాజ్​భవన్ ఆధ్వర్యంలో కార్యాచరణ చేపట్టనున్నట్లు రాజ్​భవన్ వెల్లడించింది. ఈ కార్యాచరణలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఈఎస్ఐ మెడికల్ కాలేజీ, రెడ్ క్రాస్ తదితర సంస్థలు భాగస్వామ్యం అవుతాయని తెలిపింది. న్యూట్రిషన్ ప్లాన్ దేశానికే రోల్ మోడల్ కావాలని గవర్నర్ తమిళిసై అభిప్రాయపడ్డారు. ఇందులో గిరిజన సంక్షేమ శాఖ, విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, ఐసీడీఎస్  వంటి విభాగాలు కూడా భాగస్వామ్యం అయితే మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. గవర్నర్ భర్త, నెఫ్రాలజీ నిపుణుడు పి. సౌందరరాజన్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం సుస్థిరత సాధించాలంటే స్థానికంగా దొరికే పోషకాలెక్కువగా ఉన్న ఆహార పదార్థాలను గిరిజనుల రోజూవారీ అన్నంలో భాగం చేయాలని సూచించారు. రివ్యూలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సైంటిస్ట్ డాక్టర్ శ్రీనివాసరావు, రెడ్ క్రాస్ ప్రతినిధి మదన్​మోహన్, ఈఎస్ఐ హాస్పిటల్ డీన్ ప్రొఫెసర్ శ్రీనివాస రావు, రాజ్ భవన్ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.