ముంబై ఎయిర్ పోర్టులో రూ. 4.1 కోట్ల విదేశీ కరెన్సీ స్వాధీనం

ముంబై ఎయిర్ పోర్టులో రూ. 4.1 కోట్ల విదేశీ కరెన్సీ స్వాధీనం

విదేశాల నుంచి విమానాల ద్వారా బంగారం, నగదును అక్రమంగా తరలిస్తూ కొంతమంది కేటుగాళ్లు పట్టుబడుతున్నారు. కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పేందుకు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలు వెతుక్కుంటున్నారు. కంత్రీగాళ్లు బంగారం, విదేశీ కరెన్సీలను తరలించే విధానం చూస్తే అధికారులే షాక్ అవుతున్నారు. కొంతమంది కాసుల కక్కుర్తి కోసం ప్రాణాలకు తెగించి అక్రమ గోల్డ్, నగదును కడుపులో.. విగ్గులో ఇలా.. వినూత్నంగా తరలించేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోతున్నారు. ఇలాగే విదేశీ కరెన్సీని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఓ కుటుంబం అడ్డంగా బుక్ అయ్యింది. ముంబై విమానాశ్రయంలో ముగ్గురు భారతీయుల నుంచి కోట్ల విలువైన విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

ఓ భారతీయ కుటుంబం దుబాయ్ వెళ్లేందుకు ముంబై ఎయిర్ పోర్టుకు వచ్చింది. ఎఫ్ జెడ్ 446 విమానంలో వెళ్లేందుకు ముగ్గురు ప్రయత్నించారు. వీరిని చూసిన ముంబై ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ కి అనుమానం వచ్చింది. వెంటనే వారిని అడ్డుకుని తనిఖీలు నిర్వహించారు. వారి బ్యాగుల్లో సోదాలు చేశారు. ఓ వ్యక్తి వేసుకున్న షూ లోపల విదేశీ కరెన్సీ గుర్తించి బయటకు తీశారు. అలాగే పట్టుచీర లోపల కూడా ఉన్న కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి 4,97,000 USD (రూ. 4.1 కోట్లు) విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ముగ్గురు ప్రయాణికులను అరెస్టు చేశామని కస్టమ్స్ అధికారులు తెలిపారు.