బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ అధికారంలోకి వస్తే ..ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తం : మాజీ మంత్రి హరీశ్ రావు

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ అధికారంలోకి వస్తే ..ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తం : మాజీ మంత్రి హరీశ్ రావు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఫార్మా సిటీ కోసమే రైతుల నుంచి 16 వేల ఎకరాలు సేకరించామని, దానికే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతిచ్చిందని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీనిని మార్చొద్దని కేంద్రం పేర్కొందని, డీవియేషన్ ఉంటే రైతుల భూములు వెనక్కి ఇవ్వాలని పార్లమెంట్ చట్టం చేసిందని గుర్తుచేశారు. అమెరికాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో శుక్రవారం ఆయన మాట్లాడారు.

ఫార్మా సిటీ విషయంలో రేవంత్ ప్రభుత్వం డ్రామాలు చేస్తున్నదని మండిపడ్డారు. ‘‘ఫార్మా సిటీ కంటిన్యూ చేస్తున్నామని రేవంత్ ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. కోర్టులో ఫార్మా సిటీ అని చెప్తూ.. బయట మాత్రం ఫోర్త్ సిటీ అని అంటున్నరు. ఫార్మా సిటీ వస్తే దానికి అనుబంధంగా కనీస సౌకర్యాలైన ఎడ్యుకేషన్, హౌసింగ్ రావాలని ప్రయత్నం చేస్తున్నారు. 75 శాతం ఫార్మా సిటీ ఉండి.. 25 శాతం మిగతావి ఉండేలా ప్లాన్ చేశాం. కానీ, రేవంత్ సర్కార్.. 75 శాతం వ్యాపారం, 25 శాతం ఫార్మా సిటీ వచ్చేలా చేస్తున్నారు. ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు.

ఇది చట్ట ప్రకారం చెల్లదు. మేం ప్రభుత్వంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేసి.. ఫార్మా సిటీని పునరుద్ధరిస్తం. ఫార్మా సిటీ వస్తే లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయని మేము ప్రారంభించాం. రాష్ట్ర ఆర్థిక వృద్ధి కూడా పెరుగుతుంది. కానీ, రేవంత్ సర్కారు భూములు పంచి పెడితే బ్యాక్ ఎండ్ నుంచి లబ్ధి పొందాలని చూస్తున్నది. ఫార్మా సిటీ అభివృద్ధి చెందితే బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కు పేరొస్తుందనే ఇలా చేశారు. వాళ్లేం చేసినా నడవదు.. నిలబడదు. ఉన్నది ఉన్నట్టుగా అక్కడ ఫార్మా సిటీనే వస్తుంది’’ అని హరీశ్ రావు స్పష్టం చేశారు.