- లిస్ట్ లో సీవీ ఆనంద్, వినాయక్ ప్రభాకర్ ఆప్టే, శిఖా గోయల్, సౌమ్య మిశ్రా!
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణకు పూర్తి స్థాయి డీజీపీ ఎంపికపై ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది. ఆరు వారాల్లో రాష్ట్రానికి పూర్తి స్థాయి డీజీపీ నియామక ప్రక్రియను పూర్తి చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో యూపీఎస్సీ ఈ మీటింగ్ ను నిర్వహించింది. బుధవారం యూపీఎస్సీ బిల్డింగ్ లో జరిగిన డీజీపీ ఎంపిక కమిటీ సమావేశానికి రాష్ట్ర సీఎస్ రామకృష్ణా రావు హాజరయ్యారు.
నలుగురు సీనియర్ ఐపీఎస్ ల పేర్లతో కూడిన జాబితాను సీఎస్ కమిటీ సభ్యులకు అందజేశారు. వారి సర్వీస్, మెరిట్స్ ఇతర అంశాలపై చర్చించారు. సీనియర్ ఐపీఎస్ అధికారులు సీవీ ఆనంద్(1992 బ్యాచ్), 1994 బ్యాచ్ కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే, శిఖా గోయల్, సౌమ్య మిశ్రా పేర్లను కమిటీకి అందజేసినట్టు సమాచారం. అయితే.. నలుగురిలో ముగ్గురి పేర్లను కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. ఇందులో ఒకరిని ప్రభుత్వం డీజీపీగా నియమిస్తుంది.
తొలి మహిళ డీజీపీ?
కేంద్రానికి ఇచ్చిన నాలుగు పేర్లలో ఇద్దరు మహిళా అధికారులు ఉన్నారు. మహిళా సాధికారత, రిజర్వేషన్లు, సమానత్వం విషయాల్లో సమన్యాయం పాటిస్తోన్న రేవంత్ సర్కార్ ఈసారి మహిళ డీజీపీని నియమిస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే ఉమ్మడి ఏపీ, ప్రస్తుత తెలంగాణలో మహిళ డీజీపీ ఇప్పటి వరకు లేరు. అయితే తొలి మహిళ డీజీపీని ఎంపిక చేసి.. తమ ప్రభుత్వం మహిళలకు కల్పిస్తోన్న అవకాశాలు, సమన్యాయాన్ని చాటాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తున్నది. కాగా.. సీనియార్టీ వరుసలో సీవీ ఆనంద్ పేరు బలంగా వినిపిస్తున్నా.. శిఖా గోయల్ ఈ పదవి కోసం ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
