ఆధారాల్లేకుండా బ్యాంక్‌‌ అకౌంట్‌ను ఫ్రీజ్ చేయడం సరికాదు: హైకోర్టు

ఆధారాల్లేకుండా బ్యాంక్‌‌ అకౌంట్‌ను ఫ్రీజ్ చేయడం సరికాదు: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: ఆధారాలు లేకుండా బ్యాంక్‌‌ ఖాతాను ఫ్రీజ్‌‌ చేయడం సరికాదని హైకోర్టు సూచించింది. నేరానికి సంబంధం ఉన్నట్లు భావించి ఖాతాను నిలిపివేయడం వ్యాపార, వాణిజ్య హక్కులను దెబ్బతీయడమే అని శనివారం తీర్పు వెల్లడించింది. ఇలాంటి చర్యలు ఆర్టికల్‌‌ 21 కింద జీవించే హక్కును, ఆర్టికల్‌‌ 19(1) కింద వ్యాపారం నిర్వహించే స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని కోర్టు అభిప్రాయపడింది. 

ఉత్తరప్రదేశ్‌‌లోని ఇటావా జిల్లా సైబర్‌‌ క్రైమ్‌‌ అధికారుల సూచనలతో ప్రైవేట్‌‌ బ్యాంకులో ఉన్న తమ ఖాతాను ఫ్రీజ్‌‌ చేయడం అన్యాయమని ఖమ్మంకు చెందిన ది బాటిల్‌‌ రెస్టారెంట్‌‌ అండ్‌‌ బార్‌‌ యజమాని కందిబండ శ్రీధర్‌‌ హైకోర్టులో పిటిషన్ ​వేశారు. దీనిపై జస్టిస్‌‌ ఈవీ వేణుగోపాల్‌‌ విచారణ జరిపారు. 

పిటిషనర్‌‌ న్యాయవాది వాదిస్తూ ఎఫ్‌‌ఐఆర్‌‌లో తన క్లయింట్‌‌ పేరు లేనప్పటికీ ఖాతాను నిలిపివేశారని, డీ ఫ్రీజ్‌‌ చేయాలని చేసిన వినతులను అధికారులు పట్టించుకోలేదన్నారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ దర్యాప్తు సమయంలో ఖాతాను ఫ్రీజ్‌‌ చేసే అధికారమున్నా, కారణాలు తెలియజేయకుండా ఆ చర్య కొనసాగించడం చట్టబద్ధం కాదని చెప్పింది. ఫ్రీజ్‌‌ను వెంటనే ఎత్తివేయాలని ఆదేశించింది.