కోకో ఫార్మింగ్ నుంచి చాక్లెట్ బార్ తయారీ వరకూ

కోకో ఫార్మింగ్ నుంచి చాక్లెట్ బార్ తయారీ వరకూ

చాక్లెట్లు ఆరోగ్యానికి మంచివో, కావో అటుంచితే.. చాక్లెట్ల తయారీ వల్ల మాత్రం పర్యావరణానికి చాలానే నష్టం జరుగుతుంది. ఒక చిన్న చాక్లెట్ బార్ తయారీకి లీటర్ల కొద్దీ నీళ్లు, గ్రీన్ హౌస్ వాయువులు,  ప్లాస్టిక్ కవర్లు ఇలా ఎన్నో అవసరమవుతాయి. మరి చాక్లెట్స్‌‌ను ఎకో ఫ్రెండ్లీగా తయారుచేసే మార్గమే లేదా? అడవులను నరికి కోకో చెట్లను ప్రాసెసింగ్ చేయడం వల్ల గ్లోబల్ వార్మింగ్ పెరగడంతో పాటు, రోజూ లక్షల్లో అమ్ముడయ్యే చాక్లెట్ల వల్ల టన్నుల కొద్దీ ప్లాస్టిక్ కూడా పోగవుతుంది. అందుకే పర్యావరణానికి హాని చేయని ఎకో ఫ్రెండ్లీ చాక్లెట్ తయారుచేయాలని నిర్ణయించుకున్నాడు నితిన్ చోర్డియా. ‘కోకోట్రైట్’ పేరుతో ప్రపంచంలోనే మొట్టమొదటి జీరో వేస్ట్ చాక్లెట్ బ్రాండ్ ఏర్పాటు చేశాడు.

ఇలా పుట్టింది

నితిన్ చోర్డియాకు సముద్రాలు, అడవులంటే ఇష్టం. 2019లో ఒక డీప్ సీ డైవర్.. సముద్రపు అడుగున కేజీల కొద్దీ చాక్లెట్ కవర్లను గుర్తించిన వార్త అతడిని ఆలోచింపజేసింది. దీనికి ఎలాగైనా సొల్యూషన్ కనిపెట్టాలనుకున్నాడు. అలా పుట్టిందే ‘కోకోట్రైట్’.

ఊరూరూ తిరిగి

చెన్నైలో ఉండే నితిన్.. కోకోట్రైట్‌‌ని ఏర్పాటు చేయడం కోసం ఊరూరూ తిరిగి కోకో రైతులను కలిశాడు.  తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌‌ల నుంచి కోకోను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. మన మట్టిలో, సేంద్రీయ విధానంలో పండించిన కోకోను మాత్రమే కొనుగోలు చేసేవాడు. కోకోను రుచి చూసి సాగులో మార్పులు చెప్పేవాడు. నితిన్ ఇండియాలోనే మొదటి సర్టిఫైడ్ చాక్లెట్ టేస్టర్. అంటే రుచి చూసి చాక్లెట్ క్వాలిటీ చెప్తాడన్న మాట. ఇది నితిన్‌‌కు ఎంతగానో ఉపయోగపడింది. అలా కోకో రైతులకు ట్రైనింగ్ ఇచ్చి కెమికల్స్ వాడకుండా సహజంగా పండిన కోకోను సేకరించేవాడు. కోకో పండించడం కోసం రైతులు అడవులను నరికివేయకుండా జాగ్రత్తలు తీసుకునేవాడు. అలా సహజమైన పద్ధతుల్లో చాక్లెట్‌‌ తయారు చేసి 2019లో  ఆమ్‌‌స్టర్‌‌‌‌డామ్ చాక్లెట్ షో లో.. వరల్డ్స్ ఫస్ట్ ఎకోఫ్రెండ్లీ చాక్లెట్ బ్రాండ్ ‘కోకోట్రైట్’ను లాంచ్ చేశాడు.

రెస్పాన్సిబుల్‌‌గా ఆలోచించాలి

“ సెలబ్రేషన్‌‌కు సింబల్‌‌గా చెప్పుకునే చాక్లెట్లు ఎకో ఫ్రెండ్లీగా ఉండాలనేది నా డ్రీమ్. అందుకే కోకో ఫార్మింగ్ నుంచి చాక్లెట్ బార్ తయారీ వరకూ పర్యావరణానికి ఎలాంటి హాని జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. చాక్లెట్‌‌ను ప్యాక్ చేయడానికి రీసైకిల్డ్ పేపర్ కవర్స్‌‌ వాడుతున్నాం. బ్రాండ్ పేర్లు ప్రింట్ చేసేందుకు కూడా వాటర్ బేస్డ్ ఇంక్‌‌ వాడుతున్నాం. చాక్లెట్ల తయారీకోసం రెన్యువబుల్ కరెంట్ వాడుతున్నాం. చాక్లెట్స్‌‌లో వాడే ఫ్లేవర్స్ కూడా సహజమైనవే. చాక్లెట్‌‌ను ఇష్టంగా తినేవాళ్లంతా ఇలా రెస్పాన్సిబుల్‌‌గా ఆలోచిస్తే భూమికి జరిగే నష్టాన్ని కొంతైనా తగ్గించొచ్చు. ఇకపోతే  కోకోట్రైట్ నుంచి ముందుముందు లగ్జరీ చాక్లెట్లు కూడా తీసుకొచ్చే ఆలోచన ఉంది. వాటి ప్యాకింగ్ కోసం అల్యూమినియం బాక్స్‌‌లు వాడతాం. ఫ్యూచర్‌‌‌‌లో కోకో రైతులకు మరిన్ని అవేర్‌‌‌‌నెస్ ప్రోగ్రామ్స్​ పెట్టడమే కాకుండా కోకోట్రైట్ నుంచి వచ్చే  లాభాలను క్లైమేట్ ఛేంజ్ పనులకు ఉపయోగిస్తాం” అని చెప్పాడు  నితిన్.