నాలుగు రోజులకోసారి.. వరుస పెట్రోల్ ధరల పెంపుతో జనం బెంబేలు

నాలుగు రోజులకోసారి.. వరుస పెట్రోల్ ధరల పెంపుతో జనం బెంబేలు
  • మళ్లీ పెట్రో వాత..పెట్రోల్​పై 87 పైసలు, డీజిల్​పై 91 పైసలు పెంపు
  • ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.99.51కి, డీజిల్ రూ.92.49కి పెరుగుదల 
  • హైదరాబాద్​లో రూ.112.81కి చేరిన పెట్రోల్.. రూ. 100.94కు చేరిన డీజిల్ 
  • సీఎన్‌‌‌‌జీ ధర కూడా రూపాయి హైక్
  • పది రోజుల్లోనే మూడోసారి పెంపు.. మొత్తంగా రూ.5 వడ్డింపు

న్యూఢిల్లీ:పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు శనివారం పెట్రోల్ ధరను 87 పైసలు, డీజిల్ ధరను 91 పైసల చొప్పున పెంచాయి. పశ్చిమాసియా యుద్ధం, ఇంధన కొరత, అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో నష్టాన్ని పూడ్చుకునేందుకని ఆయిల్ కంపెనీలు ఈ నెల 15వ తేదీ నుంచి వరుసగా నాలుగు రోజులకోసారి ధరలను పెంచాయి. తాజాగా శనివారం నాటి పెంపుతో పది రోజుల్లోనే ఇంధన ధరలు మూడోసారి పెరిగినట్టయింది. 

ఈ నెల 15న పెట్రోల్, డీజిల్ ధరలను రూ. 3 చొప్పున పెంచిన కంపెనీలు.. 19న 90 పైసల చొప్పున పెంచాయి. మొత్తంగా చూస్తే పదిరోజుల్లోనే లీటరుకు రూ. 5 వరకూ వాతపెట్టాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.51కి, డీజిల్ ధర లీటరుకు రూ. 92.49కు చేరింది. కోల్ కతాలో పెట్రోల్ ధర రూ. 110.64కు, డీజిల్ ధర రూ. 97.02కు పెరిగింది. అలాగే,  ముంబైలో పెట్రోల్ రేటు రూ. 108.49కి, డీజిల్ రేటు రూ. 95.02కు చేరింది.

 చెన్నైలో పెట్రోల్ రూ. 105.31కి, డీజిల్ రూ. 96.98కి హైక్ అయింది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 112.81కి, లీటర్ డీజిల్ ధర రూ. 100.94కు పెరిగింది. ఇక బెంగళూరులో లీటర్ పెట్రోల్ రేటు రూ. 108.05కి, లీటర్ డీజిల్ రేటు రూ.95.99కి చేరింది. పెట్రోల్, డీజిల్ తోపాటు సీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ ధరను కూడా కంపెనీలు పెంచాయి. ఢిల్లీలో కిలో సీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ ధర రూ. 1 మేరకు పెరిగి.. రూ. 81.09కి చేరింది. 

కాగా, గత వారం ఇంధన ధరలు రూ. 3 చొప్పున పెరిగిన తర్వాత, కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందిస్తూ.. గత నాలుగేళ్లలో కేంద్రం నాలుగు సార్లు ఇంధన ధరలను తగ్గించిందని పేర్కొన్నాయి. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా, కేంద్రం పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై లీటరుకు రూ. 24 వరకు, డీజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై లీటరుకు రూ. 30 వరకు ధరల వ్యత్యాసాన్ని పరోక్షంగా భరించిందని తెలిపాయి. 2021, 2024 మధ్య కాలంలో చమురు సంస్థలు  రూ. 24,500 కోట్ల మేర నష్టాలను చవిచూశాయని, ఎల్ పీజీ వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి 2024-–25లో రూ. 40,000 కోట్ల భారాన్ని భరించాయని పేర్కొన్నాయి.