చికెన్‌కు డిమాండ్.. గ్రామాల్లోనే వాడకం ఎక్కువ

చికెన్‌కు డిమాండ్.. గ్రామాల్లోనే వాడకం ఎక్కువ

చికెన్‌ తింటే కరోనా వస్తుందనే పుకార్ల వల్ల మొదట్లో జనం దీనికి దూరంగా ఉన్నారు. అయితే ప్రభుత్వంతోపాటు పలు సంస్థలు అవగాహన కలిగించడం వల్ల దీని
అమ్మకాలు పుంజు కుంటున్నాయని సుగుణ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సేల్స్
జీఎం రవీందర్ బాబు చెప్పారు. అమ్మకాలు సాధారణ స్థాయికి చేరాలంటే కనీసం ఏడాది పడుతుందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో తమ ప్రొడక్టుల అమ్మకాలు
బాగున్నాయని అన్నారు. ఈ విషయమై ‘వెలుగు’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు చెప్పారు. అవన్నీ ఆయన మాటల్లోనే…

వెలుగు, బిజినెస్‌‌డెస్క్ : కరోనా వచ్చిన మొదట్లో బాగా పడిపోయిన చికెన్ వాడకం మెల్లమెల్లగా పెరుగుతున్నది. దీని వాడకం 50 శాతానికి చేరుకుంది. పౌల్ట్రీ ఇండస్ట్రీకి పెద్ద మార్కెట్‌‌ అయిన తెలంగాణలో వారంలో 12 వేల టన్నుల చికెన్‌‌ అమ్ముడుపోతోంది. సాధారణ రోజుల్లో ఈ సేల్స్ వారానికి 20 వేల టన్నుల వరకు ఉంటుంది. కరోనా వల్ల తలెత్తిన రూమర్ల కారణంతో బాగా పడిపోయిన సేల్స్‌‌, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. అయినప్పటికీ డిమాండ్ ఇంకా తక్కువగానే ఉంది. చికెన్, ఎగ్ సేల్స్‌‌కు అత్యంత ముఖ్యమైన హాస్పిటాలిటీ, రెస్టారెంట్, కేటరింగ్ వ్యాపారాలు ఇంకా పూర్తిగా తెరుచుకోకపోవడమే ప్రధాన కారణం. చికెన్ అమ్మకాల్లో 30 శాతం వాటా హోటల్స్, రెస్టారెంట్లు, కెఫెటేరియాల నుంచే ఉంటుంది. ముంబై, చెన్నై, హైదరాబాద్‌‌లలో చాలా స్టోర్లు కూడా ఇంకా పూర్తిగా ఓపెన్ కాలేదు. చికెన్‌లో విటమిన్లూ ఎక్కువ. కొవ్వు తక్కువ కాబట్టి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

లాక్‌‌డౌన్‌‌ వల్ల ఇబ్బందులు పడ్డాం..

కరోనా లాక్‌‌డౌన్‌‌ టైమ్‌‌లో చికెన్ ధరలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఒకదశలో కిలో చికెన్‌‌ ధర రూ.35లకు పడిపోయింది. తదనంతరం.. భారీగా అంటే రూ.250కి పైగా పెరిగింది. ప్రస్తుతం ఈ ధరలు రూ.150 నుంచి రూ.180 మధ్య ఉన్నాయి. చికెన్ తింటే కరోనా వస్తుందని సోషల్ మీడియాలో వచ్చిన రూమర్లతో లాక్‌‌డౌన్‌‌ ప్రారంభంలో కేజీ చికెన్ ధరలు రూ.35కి పడిపోయాయి. ప్రొడక్షన్ కాస్ట్ కేజీకి రూ.75గా ఉండటంతో పౌల్ట్రీ ఇండస్ట్రీ బాగా దెబ్బతింది. లాక్‌‌డౌన్‌‌ టైమ్‌‌లో ఈ సెక్టార్ నష్టాలు రూ.30 వేల కోట్లుగా ఉంటాయని అంచనా.

పట్టణాల్లో అమ్మకాలు తక్కువ...

ఎగ్ సేల్స్‌‌ కూడా ఈ లాక్‌‌డౌన్‌‌ టైమ్‌‌లో తగ్గాయి. ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో విటమిన్లు వీటిలో ఉంటాయి. కరోనా వల్ల చాలా మంది పట్టణవాసులు చికెన్, ఎగ్స్‌‌ తినడం తగ్గించారు. అయితే గ్రామాల్లో డిమాండ్‌‌ బాగానే ఉంది. పట్టణాల్లో సేల్స్‌‌ 40 శాతం, గ్రామాల్లో 60 శాతం సేల్స్ ఉన్నాయి. ప్రభుత్వం సహకరించడం వల్ల సప్లై చెయిన్‌‌ బాగానే ఉంది. ప్రాసెస్డ్ చికెన్‌‌కు డిమాండ్‌‌ పుంజుకుంటున్నది.

సుగుణ ఫుడ్స్ రైతులకు ఇబ్బంది లేదు..

లాక్‌‌డౌన్‌‌ టైమ్‌‌లో పౌల్ట్రీ ఇండస్ట్రీకి వచ్చిన నష్టాలతో చాలా మంది రైతులు ఇబ్బందులు పడ్డారు. సుగుణ ఫుడ్స్‌‌తో కాంట్రాక్ట్ కుదుర్చుకున్న రైతులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా రిస్క్‌‌ను కంపెనీనే భరించింది. ఇతర రైతులు మాత్రం ప్రొడక్షన్ కాస్ట్ పెరిగి, ధరలు తగ్గడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారికి లోన్లు దొరకడం కష్టమయింది. డబ్బుపరమైన సమస్యలు వచ్చాయి. ప్రస్తుతం బ్యాంకులు పౌల్ట్రీ ఇండస్ట్రీ రైతులకు కొత్తగా లోన్లు ఇస్తున్నాయి. పాత లోన్లను రీస్ట్రక్చర్ చేస్తున్నాయి. లోన్ రీపేమెంట్ పీరియడ్‌‌ను కూడా బ్యాంక్‌‌లు పొడగించాయి.

ఉద్యోగులపై నో కరోనా ఎఫెక్ట్...

మా ఉద్యోగులు కరోనా బారినపడకుండా వారికి గ్లోవ్స్‌‌లు, శానిటైజింగ్ వంటి సౌకర్యాలు కల్పించాం. సుగుణ ఫుడ్స్‌‌లో 8,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 35 వేల మంది రైతులతో మాకు కాంట్రాక్టులు ఉన్నాయి. తెలంగాణ, ఏపీలు మాకు అతిపెద్ద మార్కెట్లు. తెలుగు రాష్ట్రాల్లో ఐదు వేల మంది రైతులు మాతో వ్యాపారం చేస్తున్నారు. 500 మందికి ఉపాధి కల్పిస్తున్నాం. ఇక్కడి మార్కెట్లో మాకు 10 శాతం వాటా ఉంది.

పౌల్ట్రీ మార్కెట్‌‌ విలువ రూ.56 వేల కోట్లు

ఇండియాలో పౌల్ట్రీ ఇండస్ట్రీ యాన్యువల్ టర్నోవర్ సుమారు రూ.56 వేల కోట్లు. పౌల్ట్రీ ఇండస్ట్రీ పూర్తిగా రికవరీ కావడానికి ఏడాది కంటే ఎక్కువ సమయం పట్టొచ్చు. అయితే డిమాండ్‌‌ తగ్గ డంతో చికెన్‌‌ ఫీడ్‌‌.. మక్క, సోయా వంటి వాటి ధరలు తగ్గాయి. అంతకుముందు రోజుకు 200 టన్నుల చికెన్ ఫీడ్ అమ్ముడు పోతే.. ఇప్పుడు రోజుకు 20 టన్నులే అమ్ముడు పోతున్నది. పౌల్ట్రీ ఫీడ్‌‌ ధరలు తగ్గడం కూడా రైతులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసింది. పౌల్ట్రీ ఇండస్ట్రీకి ఎక్కువ సపో ర్ట్ ఇచ్చిన రాష్ట్రం తెలంగాణనే! సేల్స్ పెరిగేందుకు ముఖ్య మంత్రి కేసీఆర్ చాలా సాయం చేశారు. లాక్‌‌డౌన్ తర్వాత మాకు బెస్ట్ మార్కెట్‌‌గా నిలిచింది తెలంగాణయే! ఒకవారంలో 12 వేల టన్నుల చికెన్‌‌ అమ్ముడవుతున్నది. కరోనాకు ముందు నిత్యం 20 వేల టన్నుల డిమాండ్‌‌ ఉండేది.