
న్యూఢిల్లీ: హీరో మోటో కార్ప్ ఎలక్ట్రిక్ టూవీలర్ల విభాగంలో విస్తరించాలని చూస్తోంది. మరిన్ని కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుందని కంపెనీ సీనియర్ అధికారి చెప్పారు. దేశంలోని అతిపెద్ద టూవీలర్ల తయారీ సంస్థ ప్రస్తుతం విదా పేరుతో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. వీటి ధర రూ. లక్ష నుంచి రూ. 1.5 లక్షల మధ్య ఉంది. తమ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తున్నామని హీరో మోటోకార్ప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ -(ఎమర్జింగ్ మొబిలిటీ) స్వదేశ్ శ్రీవాస్తవ తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రీమియం, మిడ్, మాస్ విభాగాలలో మోడల్స్‌ను తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడాది కూడా ఈవీ సెగ్మెంట్‌లో కంపెనీ భారీ వృద్ధిని సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు. దేశంలో 120 కంటే ఎక్కువ నగరాలల్లోని 180కి పైగా టచ్ పాయింట్లకు విదా స్కూటర్లను తీసుకెళ్లామని ఆయన వివరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో విదా యూరోపియన్, యూకే మార్కెట్‌లలో ప్రవేశిస్తుందని భావిస్తున్నారు.