వరికి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి: జి. చిన్నా రెడ్డి

వరికి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి: జి. చిన్నా రెడ్డి

వనపర్తి, వెలుగు :  సంప్రదాయంగా వస్తున్న వరి సాగుకు ప్రత్యామ్నాయంగా డిమాండ్ ఎక్కువగా ఉండే వాణిజ్య పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి. చిన్నా రెడ్డి సూచించారు. బుధవారం జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ‘పంటల మార్పిడి’పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. 

దేశంలో నూనె గింజలు, పప్పు దినుసుల కొరత వల్ల విదేశీ మార్పిడి నిల్వలు హరించుకుపోతున్నాయని, అందుకే ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తోందని తెలిపారు. మొక్కలు, ఎరువులు, డ్రిప్ నుంచి అంతర పంటల సాగు వరకు ప్రభుత్వం భారీగా సబ్సిడీలు అందిస్తోందని, దీని ద్వారా రైతులు 30 ఏండ్ల పాటు స్థిరమైన ఆదాయం పొందవచ్చని చెప్పారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ ప్రతీ రైతు భూసార కార్డు పొందాలని, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, సహకార సంఘాల్లో సభ్యత్వం తీసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాలను సులువుగా పొందవచ్చని సూచించారు.